అసెంబ్లీ లేనప్పుడు గోడలకు చెప్పుకోవాలా?
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కోరుతూ టీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని శాసనసభ సమావేశాలు నిర్వహిస్తున్నప్పుడు కాకుండా సమావేశాలు పూర్తయ్యాక నిర్వహించుకోండి అంటూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఓ ఉచిత సలహా ఇచ్చాడు. శాంతియుతంగా చేపట్టబోయే నిరసన కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని మంత్రివర్గ సహచరులు కోరితే వారిని ఏమాత్రం లక్ష్యపెట్టని ముఖ్యమంత్రి, ప్రతిపక్షాలు కలిసినప్పుడు మాత్రం ఉచిత సలహాలతో తన నిర్లక్ష్య వైఖరిని బట్టబయలు చేశాడు. అనుమతి గురించి హైదరాబాద్ పోలీసులను అడిగి చెప్తానంటూ అచ్చూ గుమస్తా మాదిరిగా సమాధానమిచ్చాడు. ముఖ్యమంత్రి పదవికి, అధికారానికి కళంకం తెచ్చేలా నిర్లక్ష్యంగా మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు నిరసన తెలుపే హక్కుంది. ఈ హక్కు ప్రతి పౌరుడికీ రాజ్యాంగబద్ధంగా సంక్రమిస్తుంది. అదే రాజ్యాంగ బద్ధంగా అధికారం వెలగబెడుతున్న రాజకీయ పక్షం ప్రజాస్వామిక హక్కులను కాలరాసేలా ప్రవరిస్తోంది. వివిధ వర్గాల ప్రజలు, సంఘాలు తమ తమ హక్కుల సాధన కోసం వివిధ స్థాయిలో ఉద్యమాలు నిర్వహించడం పరిపాటి. ఆయా స్థాయిల్లో చేసిన ఆందోళనలపై ప్రభుత్వానికి మెమోరాండాలు సమర్పిస్తారు కూడా. సర్కారు ఎంతకీ వాటిపై స్పందించకుంటే రాష్ట్ర రాజధానికి ఉద్యమం మారుతుంది. ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తారు. అప్పటికీ పాలకుల్లో చలనం లేకుంటే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో చలో అసెంబ్లీ నిర్వహిస్తారు. రాజ్యాంగానికి లోబడే నిరసన తెలిపి పాలకుల దృష్టికి తమ డిమాండ్లను తీసుకెళ్తారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి వామపక్ష పార్టీలతో పాటు పలు సంఘాలు, వివిధ రాజకీయ పక్షాలు ఇలా నిరసన తెలిపాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా చలో అసెంబ్లీని నిర్వహించింది. ఇప్పుడు అధికారంలో ఉండి ప్రజల హక్కును హరించేందుకు చేతనైన ప్రతి ప్రయత్నాన్ని చేస్తోంది. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత చలో అసెంబ్లీ నిర్వహించడం ద్వారా ప్రజలకు ఓనగూరే ప్రయోజనమేంటో ముఖ్యమంత్రికే తెలియాలి. పాలకులు సభలో లేనప్పుడు నిరసన ప్రదర్శన నిర్వహించి తమ గోడును గోడలకు చెప్పుకోవాలా? అక్కడున్న చెట్లు, పుట్టలకు చెప్పుకోవాలా? ఎవరికి చెప్పుకోవడానికంటూ ముఖ్యమంత్రి అంత నిర్లక్ష్యంగా వ్యవహరించాడో ఆయనకే తెలియాలి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తామని చెబుతూ నాలుగు దశాబ్దాలుగా తెలంగాణ ప్రజలను మోసం చేస్తూనే వచ్చింది. ఇందిరాగాంధీ హయాంలో మొదలైన మోసాల పరంపర ఆమె వారసులు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ హయాంలోనూ కొనసాగుతోంది. తెలంగాణ సాధన కోసం ఇప్పటికే వెయ్యి మందికి పైగా విద్యార్థులు, యువత ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. తమను తాము దహించుకొని మంటల్లో కాలిపోతూ జై తెలంగాణ నినాదాలు చేశారు. ఉరికొయ్యలపై వేలాడారు. అయినా కాంగ్రెస్ పార్టీ, యూపీఏ ప్రభుత్వ వైఖరిలో మార్పు రాలేదు. 2009లో ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న సందర్భంలో చలో అసెంబ్లీకి పిలుపునిస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బెంబేలెత్తిపోయాయి. అంతకుముందే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. కానీ ఆ ప్రకటననూ నిలబెట్టుకోలేదు. సీమాంధ్ర పెత్తందారుల బలమైన లాబీ ముందు కాంగ్రెస్ అధిష్టానంలోని కొందరు పెద్దలు మోకరిల్లారు. వాళ్లిచ్చే డబ్బు సంచులకు లొంగి నాలుగు దశాబ్దాల తెలంగాణ ఉద్యమాన్ని 12 రోజుల కృత్రిమ సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఒకే ఘాటన కట్టారు. సీమాంధ్ర లాబీయింగ్ మేరకు శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు చేయించి సమస్యను మరింత జఠిలం చేయించారు. తెలంగాణ ప్రజలు ఉద్యమాన్ని హోరెత్తించినప్పుడు కేంద్రంలో కదలిక రావడం, సీమాంధ్ర పెట్టుబడిదారుల లాబీయింగ్‌తో మళ్లీ చల్లబడటం గత మూడేళ్లుగా సాగుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్ర పెత్తందారుల పాలనలో తెలంగాణ ప్రజలపై నిర్బంధాలు, అణచివేతలు కొత్తకాదు. కానీ ఉద్యమం హోరెత్తుతున్న సందర్భంలోనూ సీమాంధ్ర సర్కారు అవే కుట్రలను కొనసాగిస్తుంది. తెలంగాణ ప్రజల ప్రజాస్వామిక హక్కులనూ హరించివేస్తుంది. కిరణ్‌కుమార్‌రెడ్డి అధికార పీఠంపై కూర్చున్నాక ఆయన మాట్లాడుతున్న తీరు ప్రజాస్వామ్యాన్నే అపహాస్యం చేసేలా ఉంటుంది. ప్రభుత్వం అంటే ఆకాశం నుంచి ఊడిపడినట్టుగా విర్రవీగుతున్నాడు. ప్రజలు ఓట్లేసి గెలిపిస్తేనే అధికార పీఠంపై కూర్చుంటామని, ఆ ప్రజలు తెలంగాణలోని పది జిల్లాల్లోనూ ఉన్నారనే విషయాన్ని విస్మరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు (2004, 2009) తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. ఆ హామీనే నిలబెట్టుకోవాలని తెలంగాణ ప్రజలు కోరుతున్నారు. ఆ డిమాండ్‌తోనే చలో అసెంబ్లీకి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ చెప్పని మాటను, ఇవ్వని హామీని వారు కోరుకోవడం లేదు. ఆ విషయం అధికారాన్ని వెలగబెడుతున్న వారు గుర్తించకపోవడం దురదృష్టకరం. అణచివేత ద్వారా చలో అసెంబ్లీని అడ్డుకోగలుగుతామని ప్రభుత్వం భావిస్తే అది ఆత్మహత్యా సదృశ్యమై అవుతుంది. చీమల దండులా తరలివచ్చే ప్రజలను నిలువరించడం పోలీసులు కాదు ఇంకెవరి తరమూ కాదన్న విషయాన్ని ఇప్పటికైనా గుర్తిస్తే మంచిది.