ఆంధ్రా రియల్టర్ల భూములే గరీబోళ్ల ఇండ్ల నిర్మాణానికి అనువు

C

యూనివర్సిటీల మధ్య ఇండ్ల నిర్మాణం వద్దు

నార్నె, జయభేరి, రామోజీ, అన్నపూర్ణ, నాగార్జున, ల్యాంకో రియల్టర్ల వద్ద వేలాది ఎకరాల భూములు

ఆంధ్రా సినీ స్టూడియోల్లో పడావుగా మిగులు భూములు

సర్కారు ఆదిశగా ఆలోచిస్తే మేలు

జనంసాక్షి ప్రత్యేక కథనం…

హైదరాబాద్‌, మే19(జనంసాక్షి) : హైదరాబాద్‌ చుట్టూ పచ్చని పొలాలుండేవి. హైదరాబాద్‌ అంటే ద్రాక్ష తోటలకు ప్రసిద్ధి. చల్లని వాతావరణం, చక్కటి భూములు, నిజాం ప్రభువు కాలంలోనే అన్ని మౌళిక సదుపాయాలతో అభివృద్ధి చెందిన నగరం. నగరం నడిబొడ్డు నుంచి రింగు రోడ్డు వరకు ఆనుకుని ఉన్న అన్ని భూములపై ఆంధ్రోళ్ల కన్నుపడింది. పంట భూములపై రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు నిర్మించారు. అవి పడావుబడి ఉన్నాయి. నార్నె, జయభేరి, రామోజీ, అన్నపూర్ణ, నాగార్జున, ల్యాంకో తదితర రియల్టర్ల వద్ద వేలాది ఎకరాల భూములున్నాయి. గరిష్ట భూ పరిమితి చట్టం క్రింద తెలంగాణ భూములు ముఖ్యంగా నిజాం భూములు ప్రభుత్వ పరమయ్యాయి. చట్టాల్లో ఉన్న లొసుగుల్ని ఆసరా చేసుకుని, ఆంధ్రా రియల్టర్లు లక్షల కోట్ల వ్యాపారాన్ని సాగిస్తున్నారు. పేదలకు పక్కా ఇల్లు నిర్మించాలని తెలంగాణ రాష్ట్ర సర్కారు సంకల్పించింది. దీనిపై ఎవరికి అభ్యంతరం ఉండనవసరంలేదు, కానీ యూనివర్సిటీ భూముల్ని, మరీ ముఖ్యంగా తెలంగాణ ఉద్యమానికి గుండె కాయైన ఉస్మానియా యూనివర్సిటీ భూముల్ని పేదల ఇండ్లకు వాడుతామంటున్నారు. యూనివర్సిటీ క్యాంపస్‌ అన్న పదానికి అర్థమేముంటుంది? విద్యారంగానికి చెందిన భూముల్లో విద్యేతర అవసరాలకు వాడకూడదని చట్టం సుస్పష్టం చేస్తున్నది. ప్రభుత్వ నిర్ణయంపై ఎవరికీ అభ్యంతరం లేకపోయినా, యూనివర్సిటీ భూములపై మాత్రం ప్రజల్లోనుంచి వ్యతిరేకత వస్తోంది.

ఏడాదికి రెండు లక్షల ఇండ్ల చొప్పున ఈ ఐదేళ్లు పేదోళ్లకు డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు నిర్మించి ఇస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చేసిన ప్రకటనతో బడుగుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిసాయి. ప్రభుత్వం అవసరమైతే ఒక్కో ఇంటికి 5 లక్షల పైగా ఖర్చు చేసి ఇండ్లు నిర్మించి ఇస్తుందని సీఎం ఖరాఖండిగా తేల్చి చెప్తున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో మోడల్‌ ఇండ్ల నిర్మాణం ప్రారంభమైంది. పనులు వేగంగా సాగుతున్నాయి. మరిన్ని ఇండ్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేద ఉండకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యమని కేసీఆర్‌ పదేపదే చెప్తున్నారు. ఇండ్ల నిర్మాణం కోసం ఎంత ఖర్తు పెట్టడానికైనా వెనుకాడేది లేదని స్పష్టం చేస్తున్నారు. అంతే కాకుండా ఎక్కడి వాళ్లకు అక్కడే ఇండ్లు నిర్మించి ఇస్తామని, ఊరికి దూరంగా ఎక్కడ్నో నిర్మించే ఆలోచన కూడా చేయట్లేదని స్పష్టం చేశారు. ముఖ్యంగా హైదరాబాద్‌ నడిబొడ్డున ఉన్న కొన్ని ప్రభుత్వ కార్యాలయాలకు, యూనివర్సిటీలకు, క్లబ్బులకు అక్కరకు మించి స్థలాలు కలిగి నిరుపయోగంగా పడి ఉన్నాయని, వాటిలో ఇండ్ల స్థలాలకు అవసరమైన స్థలాన్ని ప్రభుత్వం సమీకరిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అంటున్నారు. బహిరంగ మీటింగుల్లో కూడా ఇదే విషయం చెప్తూ వస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా ఇండ్ల నిర్మాణానికి యూనివర్సిటీ స్థలాలను వినియోగిస్తామనడం విమర్శలకు దారితీస్తున్నది. అయితే సీఎం కేసీఆర్‌ మాత్రం ఇది రాజుల కాలం కాదని, యూనివర్సిటీలకు వందల వేల ఎకరాలు అవసరం లేదని అంటున్నరు. గత ప్రభుత్వాలు గోల్ఫ్‌ కోర్సులకు, రేసు కోర్సులకు, పేకాట క్లబ్బులకు ఎకరాల కొద్దీ స్థలాలను ధారాదత్తం చేశారని, వాటిని పేదల కోసం వినియోగించటం తప్పెలా అవుతుందన్నది సీఎం వాదన. యూనివర్సిటీలకు వేలాది ఎకరాల స్థలం అవసరం లేదని సీఎం  అంటున్నారు. ఓయూలో 11 ఎకరాల స్థలం తీసుకుని ఇండ్లు నిర్మించి తీరతామని స్పష్టంచేస్తున్నారు. కానీ మరోవైపు విద్యార్థి సంఘాలు మాత్రం కేసీఆర్‌ ప్రకటనల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఉస్మానియా భూముల జోలికి వస్తే ఊరుకునేది లేదని విద్యార్థులు చెప్తున్నారు. ఇప్పటికే పలు విద్యార్థి సంఘాలు సీఎం ప్రకటనకు నిరసనగా ఆందోళనలు నిర్వహించాయి. పేదల పేరుతో ఓయూ భూములపై కన్నేస్తే ఊరుకునే ప్రసక్తే లేదంటున్నరు. యూనివర్సిటీ భూముల జోలికి రావొద్దని విద్యార్థులు హెచ్చరిస్తున్నరు.

ఇరువర్గాల వాదనలు ఎలాఉన్నా.. ఒకవేళ ఓయూ భూముల్లో పేదలకు ఇండ్లు నిర్మించి ఇస్తే తలెత్తే సమస్యలేంటి అని విశ్లేషిస్తే.. పలు సమస్యలు ఉత్పన్నమయ్యే పరిస్థితి ఉంది. యూనివర్సిటీ పక్కన ఇండ్లు నిర్మించి ఇస్తే అక్కడ నివసించే వారి వల్ల విద్యార్థులు చదువుకునేందుకు పలు రకాల సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదముంది. ఇండ్లు నిర్మించి ఇచ్చిన తర్వాత అక్కడ నివసించేవారు రకరకాల కార్యకలాపాలు కొనసాగించటం సహజం. పెండ్లిళ్లు, పేరంటాలు, మొక్కుబడుల పేరుతో నిత్యం ఏదో రకంగా కార్యక్రమాలు నిర్వహించుకుంటారు. ముఖ్యంగా లేడీస్‌ హాస్టల్‌లో ఉండే విద్యార్థునులకు చాలా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. రజినీకాంత్‌ రోబో సినిమాలో హీరోయిన్‌ ఐశ్వర్య పరిక్షల కోసం చదువుకుందామని పుస్తకం తీయగానే చుట్టుపక్కల నుండి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయో చూసాం. యూనివర్సిటీ పరిసరాల్లో ఇండ్లు నిర్మిస్తే  అలాంటి పరిస్థితే తలెత్తే అవకాశాలు మెండుగా ఉన్నాయి. సినిమాలో అయితే రోబో తనకున్న శక్తులతో కట్టడి చేశాడనుకోండి. కానీ నిజ జీవితంలో అయితే విద్యార్థినులకు సమస్యలే. ఈవ్‌ టీజర్లు పెరిగిపోయే ప్రమాదం లేకపోలేదు. దీంతో పోలీసు కంప్లయింట్లు, ఆ తర్వాత రకరకాల సామాజిక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. చదువుకునే విద్యార్థులకు ప్రశాంత వాతావరణం ఉన్నప్పుడు మెరుగైన ఫలితాలు సాధించగలుగుతారు. అలాంటిది యూనివర్సిటీ స్థలంలో ప్రయివేటు వ్యక్తులకు హక్కులు కల్పిస్తే రకరకాల సమస్యలు తలెత్తే ప్రమాదముంది.

ఇప్పటికే యూనివర్సిటీ భూముల విషయమై విద్యార్థి సంఘాలు సచివాలయం ముట్టడికి యత్నించాయి. విద్యార్థుల ఆందోళనకు ప్రతిపక్షాలు కూడా మద్దతు తెలుపుతున్నాయి. ఈ యూనివర్సిటీ భూముల వివాదం చినికి చినికి గాలివానలా మారుతుందా లేక బెట్టు తగ్గించుకుని ప్రభుత్వం మరో ఆలోచన చేస్తుందా లేక విద్యార్థుల ఆందోళనలను ఎదుర్కొంటుందా అనేది ప్రస్తుతానికి ప్రశ్నార్థకమే. మరోపైవు పలువురు విద్యావేత్తలు, పలు ప్రజా సంఘాలు ముఖ్యమంత్రి నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నాయి. యూనివర్సిటీ భూములకు బదులు మరేదైనా స్థలంలో ఇండ్లు నిర్మించి ఇవ్వాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. కేవలం రానున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కొన్ని సీట్లు గెల్చుకునేందుకే ఈ ఫీట్లు తప్ప చిత్తశుద్ధితో చేస్తున్నదేమీ లేదని విమర్శలు గుప్పుమంటున్నాయి. ఏదేమైనా యూనివర్సిటీ స్థలాలకు బదులు ఆంధ్రా ప్రాంతానికి చెందిన రియల్టర్ల దగ్గర ఖాళీగా మగ్గుతున్న లక్షల ఎకరాల భూమిని వినియోగిస్తే విద్యార్థులకు మేలు చేసినట్లే కాకుండా పేదలకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది.