ఆంధ్ర ట్రావెల్స్‌ లూటీని బట్టబయలు చేసిన ‘జనంసాక్షి’

C
డిసెంబర్‌ 21న పతాక శీర్షిక

స్పందించిన తెలంగాణ సర్కారు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 1(జనంసాక్షి) : టీఎస్‌ఆర్టీసీ లూటీ, తెలంగాణ ఆదాయానికి సీమాంధ్ర ప్రయివేటు బస్సుల గండి అంటూ డిసెంబర్‌ 21న జనంసాక్షి  పతాక శీర్షికన కథనం ప్రచురించింది.  ”ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా సీమాంధ్రుల దోపిడీ నేటికీ కొనసాగుతోంది. ఏ రంగంలో చూసినా వారి దోపిడీ ఇంకా ఆగలేదు. విభజన చట్టం ప్రకారం.. తెలంగాణకు నిర్దేషించిన విద్యుత్‌ సరఫరా చేయడంలో కుట్రలు చేస్తున్నారు. అదేకోవలో.. తెలంగాణ ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చే ఆర్టీసిని ప్రైవేట్‌ ట్రావెల్స్‌ రూపంలో కొల్లగొడుతున్నారు. తెలంగాణ ఆర్టీసికి ఇవ్వాల్సిన పర్మిట్లను ఇవ్వకుండా.. సీమాంధ్ర బస్సులను యథేచ్ఛగా డుపుతున్నారు. ఈ విధంగా రోజుకు సగటున 1500 ప్రైవేట్‌ బస్సులను నడుపుతూ.. తెలంగాణ ఆర్టీసికి దాదాపుగా రూ.3 కోట్ల మేర గండికొడుతున్నారు. ఈ దోపిడీని ప్రైవేట్‌ ట్రావెల్స్‌ యజమానులు ఏ విధంగా చేస్తున్నారు..? అందుకు ప్రభుత్వాన్ని, ఆర్టీఏను ఏ విధంగా మోసం చేస్తున్నారు..? ఆ వివరాలను తెలుసుకుందాం”. అంటూ ఈ పతాక శీర్షిక ప్రచురించాం.

జనంసాక్షి ప్రచురించిన ఈ కథనానికి స్పందించిన తెలంగాణ సర్కారు ఇకపై ఆంధ్ర నుంచి తెలంగాణలోకి వచ్చే వాహనాలకు పన్ను విధించేందుకు నిర్ణయం తీసుకుంది.  ఏప్రిల్‌ 1 నుంచి పన్ను వడ్డన తప్పదని సోమవారం రాత్రి తెలంగాణ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రయివేటు ట్రావెల్స్‌ ఆగడాలకు అడ్డుకట్టపడనుంది. అయితే హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా ఉన్నందున ఉమ్మడి పన్ను విధానం కొనసాగించాలని ఆంధ్ర ప్రయివేటు వాహన యజమానులు కోరుతున్నారు. కానీ దీనిపై చర్చల్లేవని తెలంగాణ రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి స్పష్టంచేశారు. ఇతర రాష్ట్రాల మాదిరిగానే ఆంధ్రప్రదేశ్‌ నుంచి వచ్చే వాహనాలకూ నూతన పన్ను విధానం వర్తిస్తుందని తేల్చిచెప్పారు. కోర్టు సూచనల మేరకే పన్ను విధానం రూపొందించామని చెప్పారు.

ఇక నూతన పన్ను విధానం వల్ల తెలంగాణ ప్రభుత్వానికి యేటా 50 కోట్ల రూపాయల పైచిలుకు ఆదాయం సమకూరనుంది. అయితే నూతన పన్ను విధానం రద్దు చేయాలంటూ ఆంధ్రకు చెందిన పలు ప్రయివేటు వాహనాల యజమాన్య సంఘాలు బంద్‌ పాటిస్తున్నాయి. దీంతో 80 శాతం రవాణా బంద్‌ అయిపోయింది. పన్ను విధానం మార్చేవరకు ప్రయివేట్‌ ట్రావెల్‌ బస్సులు నడపబోమని ఆంధ్ర ట్రావెల్‌ ఏజెన్సీలు తేల్చిచెప్తున్నాయి. నూతన పన్ను విధానం వల్ల ప్రధానంగా ప్రయివేటు ట్రావెల్‌ బస్తులపై అధికంగా భారం పడనుంది. 3 నెలల పన్ను మొత్తం జాతీయ పరిమితి ఉన్న వాహనాలకు ఒక్కో సీటుకు 3675 రూపాయలు కాగా, రాష్ట్ర పరిమితి ఉన్న వాహనాలకు 2625 రూపాయలు భారం పడనుంది. ఇలా బస్కుకు లక్ష 25వేల నుంచి లక్షన్నర వరకు పన్ను భారం పడుతుంది. ఇవేకాక కాకినాడ,విశాఖ, కృష్ణపట్నం పోర్టు తదితర ప్రాంతాల నుండి హైదరాబాద్‌ వచ్చే లారీలపై 200 శాతం వరకు పన్ను భారం పడనుంది.

పన్నుల మోత మోగనున్న నేపథ్యంలో ఇప్పటికే ఆంధ్ర నుంచి హైదరాబాద్‌ రావాల్సిన 1500 ప్రయివేటు ట్రావెల్‌ బస్సులను ఏజెన్సీల యజమానులు రద్దు చేశారు. ఏపీలో రిజిస్టర్‌ అయిన వాహనాల నుంచి పన్ను వసూలు చేయకుండా ఏకీకృత పన్ను విధానం కొనసాదించాలని వారు కోరుతున్నారు. జీఓను వెంటనే రద్దు చేయాలని, ఉమ్మడి రాజధాని కాబట్టి ఉమ్మడి పన్ను విధానం ఉండాలని కోరుతున్నారు. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం ఏకపక్ష నిర్ణయమని సీమాంధ్ర వాహనదారులు ఆందోళనచేస్తున్నారు. మరోవైపు తెలంగాణ నుంచి వచ్చే వాహనాలపై పన్నుకు సంబంధించి ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వ నిర్ణయం తీసుకోలేదని ఏపీ రవాణ మంత్రి సిద్ధా రాఘవరావు పేర్కొన్నారు.