ఆంధ్ర సర్కార్‌ నోటీసులపై భగ్గుమన్న తెలంగాణ

C
– తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలు

హైదరాబాద్‌,జూన్‌20(జనంసాక్షి):

టీ న్యూస్‌కు ఎపి పోలీసులు నోటీస్‌ ఇవ్వడంపై జర్నలిస్టు సంఘాలు భగ్గుమన్నాయి. దీనిని నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా వీరు ఆందోళనకు దిగారు. హైదరాబాద్‌లోని ఏపీ డీజీపీ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తోన్న తెలంగాణ జర్నలిస్టు సంఘాల నేతలను, జర్నలిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. టీ న్యూస్‌కు నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ శనివారం  డీజీపీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొన్నారు. చంద్రబాబుకు, ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఓటుకు నోటు కేసులో దొరికిన చంద్రబాబు తెలంగాణపై విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు.  ఆందోళన ఉధృతం కావడంతో పోలీసులు జర్నలిస్టులను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. శుక్రవారం అర్ధరాత్రి ఏపీ విశాఖ జిల్లా పోలీసు అధికారి హైదరాబాద్‌లోని టీ న్యూస్‌ ఛానల్‌కు నోటీసులు జారీ చేసారు. దీంతో  జర్నలిస్టు సంఘాలు ఆందోళన చేయాలని నిర్ణయించాయి.  ఈమేరకు ఇవాళ నగరంలోని ఏపీ డీజీపీ కార్యాలయం ఎదుట జర్నలిస్టు సంఘాల ఆద్శర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు జర్నలిస్టులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. ఏపీ సీఎం చంద్రబాబుకు, ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏపీ పోలీసుల పక్షపాత వైఖరిని ఖండిస్తున్నామని నినాదాలు చేశారు. ఖబర్దార్‌ చంద్రబాబు అంటూ నినదించారు.

తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలు

ఏపీ సర్కారు తీరుపై సర్వత్రా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. టీ న్యూస్‌ ఛానల్‌కు  నోటీసులు ఇవ్వడంపై తెలంగాణ వ్యాప్తంగా పది జిల్లాల్లో నిరసనలు ఉవ్వెత్తున లేచాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో జర్నలిస్టుల సంఘాల ఆద్వర్యంలో జర్నలిస్టులు, న్యాయవాద జేఏసీ ఆధ్వర్యంలో న్యాయవాదులు, టీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు, తెలంగాణ వాదులు పలుచోట్ల నిరసనలు వ్యక్తం చేస్తూ శాంతియుత ఆందోళనలు చేపట్టారు. కొన్ని చోట్ల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దిష్టి బొమ్మను దహనం చేశారు. తెలంగాణ విూడియా గొంతు నొక్కేందుకు ఏపీ సర్కారు కుట్రలు చేస్తుందని నినాదాలు చేశారు. కరీంనగర్‌ జిల్లాలో పలుచోట్ల ఏపీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా తెలంగాణ వాదులు, జర్నలిస్టులు, న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. విూడియాకు ఏపీ సర్కారు సంకెళ్లు వేసేందుకు కుట్ర పన్నుతుందని నినాదాలు చేశారు. మెదక్‌ జిల్లా దుబ్బాకలో జర్నలిస్టులు, న్యాయవాదులు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దిష్టి బొమ్మను దహనం చేశారు. సంగారెడ్డిలో ఐబీ గెస్ట్‌ హౌజ్‌ నుంచి బస్టాండ్‌ వరకు జర్నలిస్టులు ర్యాలీ నిర్వహించారు. సంగారెడ్డి బస్టాండ్‌ వద్ద ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ ర్యాలీలో జర్నలిస్టులు, ప్రజాసంఘాలు, అఖిలపక్షం నేతలు పాల్గొన్నారు. నిజామాబాద్‌ జిల్లాలో ఆందోళనులు వెల్లువెత్తాయి. ఎల్లారెడ్డి, కామారెడ్డి, బోధన్‌, బిచ్కుంద, భాన్సువాడ, కోటగిరి, బాల్కొండ, ఆర్మూర్‌, తాడ్వాయ్‌లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మను దహనం చేశారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.  జిల్లాలో టీయూడబ్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు. వైరా, కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లందు, మణుగూరు, భద్రాచలం, సత్తుపల్లిలో శాంతియుత ఆందోళనకు దిగారు.

చంద్రబాబు ప్రభుత్వం ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నదని హైదరాబాద్‌లో జర్నలిస్ట్‌ సంఘాల నేతలు మండిపడ్డారు. బాబు తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి  మిడీయాను నియంత్రించాలని చూస్తున్నారని విమర్శించారు. టి.న్యూస్‌కు నోటీస్‌ ఇవ్వడం ఇందులో భాగమేనన్నారు. విూడియా స్వేచ్ఛను హరిస్తే చూస్తూ ఊరుకోబోమని అన్నారు. తెలంగాణ విూడియాపై ఆంధ్రా సర్కార్‌ పెత్తనాన్ని వ్యతిరేకిస్తూ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో టీ న్యూస్‌ ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది.ప్రెస్‌ అకాడవిూ చైర్మన్‌ అల్లం నారాయణ, దేవులపల్లి అమర్‌, శైలేష్‌ రెడ్డి, టంకశాల అశోక్‌, గౌరీశంకర్‌,వినయ్‌ కుమార్‌  తదితరులు మాట్లాడారు. చేసిన తప్పులో ఇరుక్కున్న బాబు ఎపి ప్రజల  దృష్టిని మళ్లించేందుకు ఈ రకంగా ప్రయత్నం చేశారని అన్నారు. విూడియా స్వేచ్ఛకు ఎక్కడ భంగం వాటిల్లినా ఊరుకోబోమన్నారు. గతంలో స్ట్రింగ్‌ ఆపరేషన్ల ద్వారా ఎన్నో అక్రమాలను విూడియా వెలుగులోకి తెచ్చిందన్నారు.   ఈ సందర్భంగా అల్లం నారాయణ మాట్లాడుతూ  విద్వేషాలను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్న బాబు, ఆయన మంత్రివర్గానికి ఖబడ్దార్‌ అని హెచ్చరించారు. అన్ని విషయాలపై అవగాహన ఏర్పరుచుకుని మాట్లాడితే బాగుంటుందని సూచించారు. చంద్రబాబు అవినీతిని బయటపెట్టిన టీ న్యూస్‌ను అభినందిస్తున్నానని తెలిపారు. టీ న్యూస్‌కు నోటీసులు జారీ చేయడం దారుణమన్నారు. నోటీసులు విత్‌ డ్రా చేసుకునేంత వరకు ఉద్యమం కొనసాగుతదని స్పష్టం చేశారు. ఆంధ్రా పోలీసులు విూడియా సంస్థ వద్దకు రావడం పత్రికా స్వేచ్ఛకు విరుద్ధమన్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిర పరచడానికి చంద్రబాబు చాలా కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రేవంత్‌రెడ్డిని కనుమరుగు చేసేందుకు బాబు చాలా ప్రయత్నం చేశారని పేర్కొన్నారు.