ఆప్ నుంచి వేటు పడింది, ఒంటరయ్యారు
దిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ రెండోసారి ప్రమాణస్వీకారం చేసిన కొద్దిరోజుల్లోనే ఆమ్‌ఆద్మీ పార్టీలో అసమ్మతికి తెరలేపిన నేతలు యోగేంద్రయాదవ్, ప్రశాంత్‌్‌్‌భూషణ్‌లను పార్టీ జాతీయ కార్యవర్గం నుంచి తొలగిస్తూ సంచలనాత్మక నిర్ణయం వెలువడింది. గత కొంత కాలంగా ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌పై విమర్శలు చేస్తున్న ఈ ఇరువురు నేతలను గతంలోనే పార్టీ పీఏసీ నుంచి తొలగిస్తూ తీర్మాణం చేశారు. అయినా వ్యవహారశైలి మారకపోవటంతో ఇప్పుడు ఏకంగా పార్టీ జాతీయ కార్యవర్గం నుంచే తొలగిస్తూ పార్టీ జాతీయ కమిటీ నిర్ణయం తీసుకుంది. పార్టీ వ్యవస్థాపకుల్లో ముందున్న ఈ ఇరువురి నేతలు పార్టీలో ఇంతటి ఘోర పరిస్థితిని ఎదుర్కోవటానికి కారణాలు లేకపోలేదు. తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పుడు కేజ్రీవాల్‌కు పూర్తి మెజారిటీ లేదు. అప్పుడు కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేశారు. కానీ కేజ్రీవాల్‌కు అది నచ్చలేదు. పార్టీ సిద్ధాంతాలకు కాంగ్రెస్, బీజేపీ లాంటి సాంప్రదాయ పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం వ్యతిరేకం. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ మద్దతు తీసుకున్నారు. అయితే కేవలం 49 రోజుల్లోనే రాజకీయ చిత్రం మారింది. కేజ్రీవాల్‌పై ఒత్తిడి పెరిగింది. ప్రజా సమస్యలపై ముఖ్యమంత్రి హోదాలో ఉన్నా రోడ్లెక్కి ధర్నాలు చేసిన చరిత్ర కేజ్రీవాల్‌ది. అలాంటి నేత సంప్రదాయ పార్టీ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటే విపక్షాలు విమర్శించకుండా ఉంటాయా. దేశ గతిని మార్చాలన్న దూరదృష్టితో రాజకీయ రంగంలో అడుగుపెట్టిన కేజ్రీవాల్ ఆదిలోనే హంసపాదు ఎదురు కానుండటాన్ని పసిగట్టారు. భవిష్యత్తుకు బంగారు బాటలు పడాలంటే రాజీనామా చేయటం తప్పదని భావించారు. ఆచరించారు. దాంతో చేతకాక వదిలేశాడని ప్రతిపక్ష పార్టీల నుండి తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నారు. లోక్ సభ ఎన్నికల్లో హస్తినలోని 7స్థానాల్లో ఆప్‌కు డిపాజిట్టు కూడా రాలేదు. అయినా వెరవకుండా చేసిన తప్పుకు క్షమాపణలు చెప్పి తిరిగి ప్రజల మన్ననలు పొందారు. కేజ్రీవాల్ సారథ్యంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘనవిజయం సాధించింది. ఏ పార్టీకీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా మెజారిటీ సాధించింది. కేజ్రీవాల్ సగర్వంగా ముఖ్యమంత్రి పదవిని అలంకరించారు. కానీ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన కొద్దిరోజులకే ఆప్‌లో అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యాయి. పార్టీ వ్యవస్థాపక సభ్యులైన యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్‌లు కేజ్రీవాల్ వ్యవహారశైలి సరిగా లేదంటూ, పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం కరువైందంటూ విమర్శలకు తెరలేపారు. ఆ విమర్శల స్థాయిని రోజురోజుకూ పెంచుతూ పార్టీకి, దిల్లీ ప్రభుత్వానికి తలనొప్పులు తెచ్చిపెట్టే ప్రయత్నంచేశారు. పార్టీ అంతర్గత వేదికల్లో చర్చించాల్సిందిపోయి మీడియాకెక్కడంతో సంచలన విజయాలు నమోదు చేసిన ఆమ్‌ఆద్మీ పార్టీ ఇరకాటంలో పడింది. సంచలనాలకు నెలవైన దిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆది నుంచి కార్పొరేట్ మీడియాకు వ్యతిరేకం. ఇటువంటి నేపథ్యంలో ఈ ఇరువురు నేతలూ పార్టీ వ్యవస్థాపక సభ్యులు కావటంతో మీడియా కూడా వారి విమర్శలను సాకుగా చూపి మరో జనతా అంటూ ఆప్‌పై విమర్శనాత్మక కథనాలు ప్రసారం చేశాయి. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనాయకత్వం మాత్రం ఈ ఇరువురు నేతల వెనుక అదృశ్య శక్తులు ఉన్నాయని అంటోంది. అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులకే ఇలాంటి పరిణామాలు చోటుచేసుకోవడం నిజంగా అనుమానాస్పదమే. అచంచల విశ్వాసంతో హస్తిన అధికారం కట్టబెట్టిన ప్రజలు ఆమ్‌ఆద్మీలో అంతర్గత కుమ్ములాటలను కోరుకోవట్లేదు. అవినీతిని అంతమొందించే దిశగా ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా కేజ్రీవాల్ సర్కారు వడివడిగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఆమ్‌ఆద్మీపార్టీలో ఇలాంటి అంతర్గత కుమ్ములాటలను సహించే పరిస్థితిలో హస్తిన ప్రజలు లేరు. అందుకే రెబెల్ నేతలపై వేటు వేయాల్సిందేనని జనబాహుళ్యం నుంచి డిమాండ్లు సైతం వచ్చాయి. ప్రజా మద్దతు ఉండటంతో ఆప్ అధినేత కేజ్రీవాల్ జాతీయ కమిటీ సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. దీంతో ఇరువురు నేతలపై జాతీయ కమిటీ నుంచి వేటు పడింది. నిజానికి గతంలోనే ఈ ఇరువురి నేతలపై పీఏసీ నుంచి వేటు పడినా పరిస్థితికి తగ్గట్టు మారలేక విమర్శలు పెంచటంతో పార్టీలో మెజీరిటీ అభిప్రాయానికి తలవంచక తప్పలేదు. ఏదేమైనా పార్టీలో జరుగుతున్న విషయాలను అంతర్గతంగా చర్చించుకోకుండా రచ్చకెక్కడం, వేటుపడినా గొడవ సద్దుమణిగేందుకు ప్రయత్నించకపోవడం ఇరువురు నేతలపై వేటుకు దారితీసింది. ఇప్పటికైనా ఇలాంటి నేతలు పార్టీ మూల స్థంబాన్ని గౌరవించటం నేర్చుకోవాలి. పార్టీ గెలుపులో ఎవరెంత కృషి చేసినా జనం నమ్మేది ఒక్క అధినేతనే. అధినేతను చూసే జనం ఓటేస్తారనేది ఇటీవల కాలంలో పలు సందర్భాల్లో ఋజువవుతోంది. తమ బాగోగులు చూస్తూ, అభివృద్ధికి బాటలు వేసే నేతలనే ప్రజలు ఎన్నుకోవటం మొదలైంది. భారత దేశ రాజకీయాల్లో త్వరలోనే పెనుమార్పులకు అవకాశం ఉంది. అందుకే పార్టీల్లో ఉండే నేతలు అధినేత బాటలో నడుస్తూ ప్రజాసేవకు ముందుకు వస్తే తప్పక ప్రజాదరణ ఉంటుంది అంతేకానీ ధిక్కార ధోరణితో పోతే వేటు పడి భవిష్యత్తు అంధకారంగా మారటం ఖాయం. కాబట్టి ప్రజాజీవితంలో ఉన్నప్పుడు ఆచితూచి అడుగులేయాల్సిన అవసరం ఉందని గుర్తించాలి.