ఆఫ్ఘన్‌లో భారీ భూకంపం

4

– భారత్‌, పాక్‌లో ప్రకంపనలు

న్యూదిల్లీ,ఏప్రిల్‌ 10(జనంసాక్షి): ఆఫ్ఘనిస్థాన్‌లో భారీ భూకంపం సంభవించింది. పాకిస్థాన్‌, ఆఫ్ఘనిస్థాన్‌, తజికిస్థాన్‌ సరిహద్దులో సంభవించిన దీని కారణంగా వచ్చిన భూప్రకంపనలతో పాకిస్థాన్‌తో సహా ఉత్తర భారతం వణికిపోయింది. పాకిస్థాన్‌లో ఇద్దరు మృతి చెందారు. నలుగురు గాయపడ్డారు. భారత రాజధాని దిల్లీ సహా నోయిడా, కశ్మీర్‌, ఉత్తరాఖండ్‌, చండీగఢ్‌లలో ఆదివారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో భూప్రకంపనలు సంభవించాయి. ఈ ఘటనతో ఆయా ప్రాంతాల్లో ప్రజలు ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రకంపనల కారణంగా దిల్లీలో మెట్రో రైల్‌ సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు.

ఆఫ్ఘనిస్థాన్‌లో భారీ భూకంపం

ఆఫ్ఘనిస్థాన్‌లోని హిందుకుష్‌ ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 6.8గా నమోదైంది. ఆప్ఘనిస్థాన్‌లోని హిందుకుష్‌ పర్వతశ్రేణుల్లో భూకంప కేంద్రం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. కాబూల్‌కు ఈశాన్యంగా 282 కి.విూ., ఆష్కాషామ్‌కి 39 కి.విూ. దూరంలో భూ కంప కేంద్రం ఉన్నట్లు తెలిపారు. ఈ భూకంప ప్రభావం 200కి.విూ. విస్తీర్ణంలో బలంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక్కడే ఎందుకంటే..

యునైటెడ్‌ స్టేట్స్‌ జియోలాజికల్‌ సర్వే ప్రకారం భారత ఉపఖండ ఫలకం ఉత్తర దిశగా కదిలినట్లు భావిస్తున్నారు. ఇది యూరేషియా ఫలకాన్ని ఢీకొనడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు భావిస్తున్నారు.పాకిస్థాన్‌లోని పెషావర్‌, చిత్రాల్‌, స్వాత్‌, గిల్గిత్‌, ఫైసలాబాద్‌, లా¬ర్‌ తదితర ప్రాంతాల్లో భూమి కంపించింది. కాబూల్‌, ఇస్లామాబాద్‌లలో ఒక నిమిషం పాటు భవనాలు వూగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రజలంతా భయంతో భవనాల నుంచి బయటకు పరుగులు తీశారు.గత అక్టోబర్‌లో కూడా 7.5 తీవ్రతతో ఇక్కడ భూకంపం నమోదైంది. అప్పుడు కూడా పాకిస్థాన్‌, ఆఫ్గనిస్థాన్‌ ప్రాంతంలో భూమి కంపించగా 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఆఫ్గనిస్థాన్‌లో హిందు కుష్‌ పర్వతాల సవిూపంలో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. యూరేషియన్‌, భారత్‌ ఉపఖండ ఫలకానికి దగ్గరగా ఉండటమే దీనికి ప్రధాన కారణం.