ఆరోపణలు ఋజువు చేస్తం
వేదిక ఏర్పాటు చేయండి..పొన్నం
హైదరాబాద్,మార్చి 4(జనంసాక్షి): తెలంగాణ మంత్రి జగదీశ్‌రెడ్డిపై తాము చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నామని, రుజువు చేసేందుకు తాము సిద్ధమని కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ విషయంలో విచారణ జరిపించాల్సింది పోయి సిఎం కెసిఆర్ తను దారినపోయే దానయ్యగా అభివర్ణించడం ఆయన పెత్తందారీ విధానాలకు నిదర్శనమని అన్నారు. ఉద్యమంలో తాను బాగా పనిచేస్తున్నానని అన్న కెసిఆర్ ఇవాళ దారిన పోయే దానయ్యగా అబివర్ణించడం చూస్తుంటే, మంత్రిని వెనకేసుకుని వస్తున్నారని అర్థం అవుతుందన్నారు. బుధవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ ముడుపులకు సంబంధించి తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు. ప్రతి జిల్లాకు వెళ్లి ప్రజల వద్ద వాస్తవాలు వెల్లడిస్తామన్నారు. రాజయ్యకు ఒకన్యాయం, జగదీశ్‌రెడ్డికి ఒక న్యాయమా అని ఆయన ప్రశ్నించారు. జగదీశ్‌రెడ్డి తప్పులేదని లిఖితపూర్వకంగా సీఎం రాసివ్వాలని పొన్నం డిమాండ్ చేశారు. రాజయ్య ఏం తప్పు చేశారో ఇంతవరకూ వెల్లడించలేదని, బలహీనులే వ్యక్తిగత ఆరోపణలు చేస్తారని పొన్నం అన్నారు. రాజయ్య విషయంలో లేని అభ్యంతరాలు జగదీశ్వర్ రెడ్డి విషయంలో ఎందుకన్నారు. జగదీశ్ రెడ్డి అవినీతిని నిరూపించేందుకు తాము సిద్ధమని అన్నారు. మాజీ ఉపముఖ్యమంత్రి రాజయ్యను గెంటేసిన కేసీఆర్.. జగదీశ్ రెడ్డిని ఎందుకు కాపాడుతున్నారని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ అవినీతి అంశంపై కమిటీ వేస్తే, ఆ కమిటీకి వాళ్ల అవినీతికి ఆధారాలు ఇస్తామని ప్రభాకర్ చెప్పారు.లేకపోతే మంత్రి జగదీశ్ రెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్ క్లీన్ చిట్ అయినా ఇవ్వాలన్నారు. తాము ఎల్లుండి వరకు వేచి చూస్తామని, ఆ తర్వాత ఆధారాలను అవినీతి నిరోధక శాఖకు ఇస్తామని చెప్పారు. తర్వాత అన్ని పార్టీలకూ కూడా జగదీశ్ రెడ్డి అవినీతికి ఉన్న ఆధారాలను పంపుతామన్నారు.