ఆర్టీసీలో సమ్మె సైరన్‌

2

15నుంచి సమ్మెకు దిగుతాం

సంస్థ ఎండీకి నోటీసులు

హైదరాబాద్‌,ఏప్రిల్‌2(జనంసాక్షి): మళ్లీ ఆర్టీసీలో సమ్మె  సైరన్‌ మోగింది. ఆర్టీసీ  సమ్మెకు తమకు ఇష్టం లేదని కానీ యాజమాన్యం మొండి వైఖరి అవలింబిస్తోందని ఇయూ, టీఎంయూ నేతలు పేర్కొన్నారు. ఈనెల 15వ తేదీ నుండి సమ్మెలోకి వెళుతామని ఆర్టీసీ ఎండీకి సమ్మె నోటీసు ఇచ్చినట్లు తెలిపారు. ఆరు దఫాలుగా చర్చలు జరిగిన అనంతరం యాజమాన్యం సానుకూలంగా స్పందించకపోవడంతో ఆందోళన బాట పట్టామన్నారు. బస్‌ భవన్‌ వద్ద భారీ ర్యాలీని ఉద్దేశించి మాట్లాడారు. ర్యాలీ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. అనంతరం అక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. తమ డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని నేతలు పేర్కొన్నారు. సమ్మెకు పోవడం ఇష్టం లేదని, కానీ గత్యంతరం లేని పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తోందన్నారు. యాజమాన్యం మొండి వైఖరి అవలంబిస్తోందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా వేతనాలు ఇవ్వాలని తెలిపారు. మిగతా ఉద్యోగులకు ఇచ్చిన విధంగానే తమకు కూడా జీతాలు ఇవ్వాలన్నారు.  వేతనాల పెంపు, ఆర్టీసీ విభజన..తదితర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఇయూ, టీఎంయూ సంఘాలు నోటీసు ఇచ్చాయి. ఈ నెల 15వ తేదీలోపు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో సమ్మె చేస్తామని హెచ్చరించారు. యూ, టీఎంయూలు ఐక్య కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. పెండింగ్‌ లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని గత కొద్దికాలంగా డిమాండ్‌ చేస్తూ వచ్చారు. ఈ దశలో ఆర్టీసీ ఎండీతో ఎనిమిది దఫాలుగా చర్చలు జరిపారు. కానీ ఎలాంటి పురోగతి లేకపోవడంతో గురువారం చలో బస్‌ భవన్‌ కు పిలుపునిచ్చారు. ఎంప్లాయిస్‌ – టీఎంయూ నేతలు పిలుపుతో హైదరాబాద్లో ఆర్టీసీ బస్సులు నిలిపివేశారు. ఉదయం 11 గంటలకు సుందరయ్య పార్క్‌ నుంచి బస్‌ భవన్‌ వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం బస్‌ భవన్‌ వద్ద బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు జిల్లాల నుంచి ఆర్టీసీ కార్మికులు హైదరాబాద్కు తరలి వచ్చారు. మరోవైపు ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కకపోవటంతో ప్రయాణీకులు ఇబ్బందులు పడ్డారు.