ఆర్‌ఎస్‌ఎస్, మనువాదులకు తలొగ్గను
-ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్
నాగపూర్,ఏప్రిల్ 11(జనంసాక్షి):మనువాదం ముందు కానీ, ఆర్‌ఎస్‌ఎస్ ముందు కానీ తాను తలొగ్గేది లేదని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. తాను ఎవరికీ భయపడును కాబట్టే, బీజేపీ తనను టార్గెట్ చేస్తున్నట్లు రాహుల్ విమర్శించారు. బీజేపీ ప్రభుత్వ పరిపాలనను చూస్తే, ఆర్‌ఎస్‌ఎస్ సభ్యులే ఓఎస్డీలుగా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని రాహుల్ గాంధీ అన్నారు. దేశంలో ఆర్‌ఎస్‌ఎస్ వ్యక్తులు లేని వర్సిటీ ఏదీ లేదని, నిమ్న వర్గాలకు విద్య అందకుండా చేయడమే బీజేపీ ఉద్దేశమని రాహుల్ ఫైరయ్యారు. పంచాయతీ రాజ్ వ్యవస్థను బీజేపీ నాశనం చేస్తుందని, దాని వల్ల హర్యానా రాష్ట్రంలో చాలా మంది దళిత మహిళలు ఎన్నికల్లో పోటీచేయలేకపోయారన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు మాత్రం మనువాద రక్షణ కోసం ప్రయత్నిస్తున్నాయని రాహుల్ విమర్శించారు. అంబేద్కర్ జయంతి ఉత్సవం సందర్భంగా నాగపూర్‌లో జరిగిన బహిరంగ సభలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.