ఆర్‌డీఎస్‌పై చర్చిద్దాం రండి

4

– కర్ణాటక నీటిపారుదల శాఖ మంత్రికి హరీశ్‌ లేఖ

హైదరాబాద్‌,ఏప్రిల్‌ 13(జనంసాక్షి): మహబూబ్‌ నగర్‌ జిల్లాలోని రాజోలి బండ డైవర్షన్‌ స్కీమ్‌ (ఆర్‌.డి.ఎస్‌) సమస్యపై కర్ణాటకతో తెలంగాణ ప్రభుత్వం త్వరలో చర్చలు జరపనుంది. ఈ మేరకు కర్ణాటక నీటిపారుదల శాఖ మంత్రి ఎం.బి.పాటిల్‌ కు మంత్రి హారీష్‌ రావు లేఖ రాశారు. కర్ణాటక, తెలంగాణ అంతర్రాష్ట్ర ప్రాజెక్టుగా ఉన్న ఆర్‌.డి.ఎస్‌ వివిధ కారణాలతో తెలంగాణ రైతులకు నీరందించలేకపోతున్నదని హరీష్‌ రావు ఆ లేఖలో పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న కాలంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిపాదించిన పనులు సైతం మూడేళ్ళుగా పెండింగ్‌ లో ఉన్నట్టు మంత్రి గుర్తు చేశారు.ట్రిబ్యునల్‌ అవార్డు ప్రకారం 15.9 టిఎంసిల ద్వారా మహబూబ్‌ నగర్‌ జిల్లాలో 87 వేల 5వందల ఎకరాలకు ఆర్డిఎస్‌ నుంచి సాగునీరందవలసి ఉండగా.. 5 నుంచి 6 టిఎంసిల నీరు కూడా రావడం లేదని హరీష్‌ రావు వివరించారు. సమైక్యపాలకుల నిర్లక్ష్యంతో ఏనాడు 20 వేల ఎకరాలకు కూడా సాగునీరు నోచుకోలేదని చెప్పారు. ఆర్‌.డి.ఎస్‌ కర్నాటకలో నలభై కిలోవిూటర్లు ప్రవహించిన తర్వాత తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. కర్నూలు రైతులు తరచూ తూములు పగులగొట్టడం, కర్ణాటక రైతులు అక్రమంగా నీటిని తరలించుకొని పోవడం వంటి సమస్యలతో ఆర్డీఎస్‌ ద్వారా రావాల్సిన నీరు రావడం లేదని మంత్రి పేర్కొన్నారు. ఆర్డీఎస్‌ ఆధునీకరణ కోసం జరుగుతున్న ప్రయత్నాలకు కర్ణాటక సహకరించడం లేదని హరీష్‌ రావు విమర్శించారు. ఆర్‌.డి.ఎస్‌ ఆధునీకరణలో భాగంగా బ్యారేజీ ఎత్తు 15 సెం.విూ. పెంచడానికి, లైనింగ్‌ మరమ్మతులకు సంబంధించి గత ఎపి ప్రభుత్వం 72 కోట్లు మంజూరు చేసి, అందులో 58 కోట్లను కర్ణాటక ప్రభుత్వం వద్ద డిపాజిట్‌ చేసిన విషయాన్ని మంత్రి తన లేఖలో గుర్తుచేశారు. బ్యారేజి స్థలం కర్ణాటక భూభాగంలో ఉన్నందున డిపాజిట్‌ చేశారని తెలిపారు.కర్నూలు జిల్లా రైతాంగం తరచూ ఆర్డీఎస్‌ వద్ద ఆందోళనలకు దిగి శాంతిభద్రతల సమస్యలను సృష్టిస్తున్నందున క్షేత్ర స్థాయిలో ఆర్డీఎస్‌ సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకునీదామని ఇరిగేషన్‌ మంత్రి సూచించారు. తేదీ, స్థలాన్ని సూచిస్తే తాము కర్నాటకతో చర్చిస్తామని హరీష్‌ రావు అన్నారు. దీనిపై చొరవ చూపి స్పందించాలని కోరారు.