ఆర్‌బీఐ నూతన ద్రవ్యపరపతి విధానం
కీలక వడ్డీ రేట్లు తగ్గింపు : దువ్వూరి
ముంబయి, జనవరి 29 (జనంసాక్షి):
రిజర్వ్ బ్యాంకు అఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మంగళవారం నాడు ద్రవ్య పరపతి విధానాన్ని ప్రకటించింది. త్రైమాసిక ద్రవ్య పరపతి విధానాన్ని సమీక్షించిన అనంతరం వివరాలను ఆర్‌బీఐ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు ప్రకటించారు. కీలక వడ్డీ రేట్లను, నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్), రెపో, రివర్స్ రెపో రేట్లను తగ్గించారు. 2012 తరువాత మళ్లీ ఆర్‌బీఐ వడ్డీ రేట్లను తగ్గించింది. కీలక వడ్డీ రేట్లు 25 బేసిస్ పాయింట్స్ తగ్గంచింది. సీఆర్‌ఆర్, రెపో, రివర్స్ రెపో రేట్లను పావు శాతం(0.25) తగ్గించింది. అయితే మార్కెట్ వర్గాలు ఈ తగ్గింపును అర శాతం (0.50) వరకు ఆశించాయి. ఈ సారి సమీక్షలో అనూహ్యంగా ఆర్‌బీఐ సీఆర్‌ఆర్ రేట్లను కూడా తగ్గించింది. ఈ తగ్గింపుతో రెపో రేటు 7.75 శాతంగాను, సీఆర్‌ఆర్ 4.5 శాతంగాను ఉన్నాయి. వడ్డీ రేట్లు తగ్గింపు వల్ల ఇకపై రుణాలు మరింత చౌకగా లభ్యమయ్యే అవకాశం ఉంది. గృహ, వాహన రుణాల ఈఎంఐలపై పావు శాతం మేరకు వడ్డీ తగ్గే అవకాశం ఉంది. ఆర్‌బీఐ తాజాగా ప్రకటించిన విధానంతో వ్యవస్థలోకి రూ.18వేల కోట్లు అందుబాటులోకి రానున్నాయి. 2012-13లో వృద్ధి శాతాన్ని 5.8 నుంచి 5.5 శాతానికి ఆర్‌బీఐ తగ్గించింది. ఆర్‌బీఐ ద్రవ్య పరపతి సమీక్షతో స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. దాదాపు 50 పాయింట్స్ పైగా లాభంలో సెన్సెక్స్ ఉండగా, నిఫ్టి 20 పాయింట్లకు పైగా లాభాల్లో కొనసాగుతోంది. డిసెంబర్ నాటికి మూడేళ్లలో అతి తక్కువగా 7.18 శాతం ఉన్న ద్రవ్యోల్బణం 2013-14 ఆర్థిక సంవత్సరానికి యథాతథంగా ఉండే అవకాశం ఉంది. తాజా విధానంతో రూపాయి మారకం విలువ 53.79 వద్ద స్థిరంగా ఉంది. మొత్తం మీద మార్కెట్ వర్గాలను పూర్తిగా నిరాశ పరచకుండా కొంతలో కొంత ఊరట కల్పించడంతో స్టాక్ మార్కెట్లు దూకుడు మీద ఉన్నాయి.