ఆ ఇద్దరి వెలి
జాతీయ కార్యవర్గం నుంచి యోగేంద్రయాదవ్ ప్రశాంత్ భూషణ్‌ల వేటు
న్యూఢిల్లీ,మార్చి28(జనంసాక్షి): ఆప్‌లో గత కొంతకాలంగా నెలకొన్న సంక్షోభానికి తెరపడింది. వ్యవస్థాపక సభ్యులు యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్‌లపై ఆప్ జాతీయ కార్యవర్గం వేటు వేసింది. ఈ ఘటన సంచలనం సృష్టించిన క్షణంలోనే ఆమ్‌ఆద్మీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రముఖ సామాజిక ఉద్యమకారిణి మేధాపాట్కర్ ప్రకటించారు. గత లోక్‌సభ ఎన్నికల్లో ఆమె ఆప్ తరఫున ముంబయిలోని లోక్‌సభ నియోజకవర్గంలో పోటీచేశారు.ఆప్ అధినేత, దిల్లీ సీఎం అరవింద్ కేజీవ్రాల్‌పై బహిరంగ విమర్శలు చేసిన యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్‌లపై వేటు వేయాలన్న డిమాండ్ వస్తోంది. దీంతో అదను చూసి ఇప్పుడు ఈ ఇద్దరి నేతలపై వేటు పడింది. యోగేంద్రయాదవ్, ప్రశాంత్‌భూషణ్‌లను ఆప్ జాతీయ కార్యవర్గం నుంచి తొలగించారు. దిల్లీలో జరిగిన ఆప్ జాతీయ కార్యవర్గ సమావేశానికి కేజీవ్రాల్‌తో పాటు ఆప్ ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా అసమ్మతి నేతలు యోగేంద్రయాదవ్, ప్రశాంత్ భూషణ్‌లపై వేటు వేస్తూ ఆప్ జాతీయ కార్యవర్గం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ్యులు ఆమోదించారు. ఆప్ జాతీయ కార్యవర్గ సమావేశం అనంతరం యోగేంద్రయాదవ్ విూడియాతో మాట్లాడుతూ…. జాతీయ మండలి సమావేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆరోపించారు. తమ సభ్యులను చితక బాది.. ముందస్తు వ్యూహం ప్రకారం తీర్మానం ఆమోదింపచేసుకున్నారని విమర్శించారు. ఈ విషయంపై యోగేంద్ర యాదవ్ స్పందించారు. ఆప్ కార్యకర్తలు గూండాల్లా వ్యవహరించారని ధ్వజమెత్తారు. ఆప్‌లో ఇలాంటి రాజకీయాలు సరికాదన్నారు. పక్కా స్కిప్టుత్రోనే ఇదంతా చేశారని పేర్కొన్నారు. అంతా రహస్యంగా జరిగిపోయిందన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి రోజును కోరుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్నాళ్లు తమకు మద్దతిచ్చిన కార్యకర్తలు, సానుభూతిపరులకు క్షమాపణలు చెబుతున్నానని యాదవ్ తెలిపారు. యాదవ్, భూషణ్‌లపై వేటుకు అనుకూలంగా 200 మంది సభ్యులు సంతకాలు చేయగా, 23 మంది సభ్యులు వ్యతిరేకించారు. కేజీవ్రాల్ ప్రసంగం పూర్తికాగానే నిలబడి గోపాల్‌రాయ్‌ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నట్టు ప్రకటించారు. కొందరు సభ్యులు వ్యతిరేకించినా పట్టించుకోలేదు, మధ్యలో మనీశ్‌సిసోడియా లేచి తీర్మానంపై ఓటింగ్ నిర్వహించేశారని ఆరోపించారు. సమావేశం అనంతరం ప్రశాంత్ భూషణ్ విూడియాతో మాట్లాడుతూ… ఆప్ కార్యవర్గ సమావేశానికి గూండాలను తీసుకొచ్చారు.. మా ఎమ్మెల్యేలే కొందరు గూండాగిరి చేశారని ఆరోపించారు. తమకు మద్దతుగా నిలిచిన సభ్యులను చితకబాదారని, సమావేశంలో ఒక్క అంశానికి జవాబు చెప్పలేదని వివరించారు. పార్టీ లోక్‌పాల్, తటస్థ పరిశీలకుడు లేకుండా ఓటింగ్ అధికారంగల సభ్యులు ఎంతమంది అన్నదీ అర్థం లేకుండా… గొడవ, గందరగోళం మధ్య తీర్మానం ఆమోదించారని తెలిపారు. ఇదంతా పూర్తిగా ముందస్తు ప్రణాళిక ప్రకారం జరిగిందేనని ప్రశాంత్ భూషణ్ స్పష్టం చేశారు.