ఇంకా ఎన్ని లేఖలు రాస్తారు?

తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రత్యేక రాష్ట్ర కోసం ప్రజల నుంచి ఒత్తిడి పెరిగిన ప్రతిసారి వేస్తున్న ఎత్తుగడలు, డొమ్మరిగడ్డలు చూస్తే వారికి కనీసం ఆత్మాభిమానం ఉందా అనే అనుమానం తలెత్తుతోంది. తెలంగాణ ప్రజలంతా ఒకే డిమాండ్‌తో రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతుంటే వీరు మాత్రం పదవులను అంటిపెట్టుకొని సీమాంధ్ర పాలకులు వేసే ఎంగిలి మెతుకుల్లాంటి పదవుల కోసం అర్రులు చాస్తున్నారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నెల రోజుల్లోగా తెలంగాణపై తేల్చేస్తామని మాట తప్పిన తర్వాత మళ్లీ ఆత్మబలిదానాలు మొదలయ్యాయి. ఉజ్వల భవిత ఉన్న తెలంగాణ యువత ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను తెలిపేందుకు మళ్లీ ఆత్మహత్యలను ఆశ్రయిస్తున్నారు. ఎంతో మంది తల్లులకు కడుపుకోత మిగిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో మృతుల కుటుంబాలను పరామర్శించలేని స్థితి కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులది. వారు కనీసం గ్రామాల్లోకి కూడా వెళ్లలేనంతగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈనేపథ్యంలోనే తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు శుక్రవారం మళ్లీ లేఖల డ్రామాకు తెరతీశారు. తెలంగాణపై త్వరగా తేల్చాలంటూ ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీకి లేఖ రాశారు. ప్రత్యేక రాష్ట్ర కోసం ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దంటూ విజ్ఞప్తి కూడా చేశారు. తెలంగాణ కోసం అది చేస్తాం.. ఇది చేస్తామంటూ చెప్పుకోవడం వీరికి కొత్తేమి కాదు. అధిష్టానాన్ని ఇరుకపెడతామంటూ ప్రగల్భాలు పలికి వీరు ఇరుకున పడ్డ సందర్భాలెన్నో.. అధిష్టానంపై ఒత్తిడి పెంచుతామని బీరాలు పోయి వీరు ఒత్తిడి ఎదుర్కొన్న పరిస్థితులు అనేకం. అలాంటి నేతలు రాసే లేఖలకు అధిష్టానం పెద్దలు అంతగా స్పందిస్తారనుకోవడం అత్యాశే అవుతుంది. కేవలం తాము తెలంగాణ కోసం పోరాడుతున్నామని చెప్పుకోవడానికి మినహా తెలంగాణ సాధనకు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రాసిన లేఖ ఎంతమాత్రం ఉపయోగపడవు. వీరి సిగ్గుమాలిన రాజకీయాలను చూసి ప్రతి తెలంగాణ బిడ్డ తల్లడిల్లుతున్నారు. సీమాంధ్ర కాంగ్రెస్‌ నేతలు తెలంగాణకు వ్యతిరేకంగా ఏకతాటిపైకి వచ్చి ఢిల్లీ పెద్దలపై ఒత్తిడి పెంచి రావాల్సిన ప్రకటనను అడ్డుకున్నారు. తమ అక్రమ సామ్రాజ్యాలు ఎక్కడ కదలిపోతాయోనని వారంతా ఒక్కటైనపుడు నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్షను చాటేందుకు ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు ఎందుకు సంఘటితం కారు? ప్రజల ఆకాంక్ష, ఆత్మగౌరవాన్ని మించినది వారికేం ఉంటుంది? అంటే ఒక్కరి వద్ద సమాధానముండదు. ఎప్పుడో ఒక్కరోజు కంటితుడుపు చర్యగా జై తెలంగాణ అని బూటకపు ప్రకటనలు చేసి చేతులు దులుపుకోవడం మినహా వారు పెద్దగా తెలంగాణ కోసం చేసిందేమి లేదు. అదే పార్టీకి చెందిన కొందరు ఎంపీలు ప్రత్యేక రాష్ట్రం కోసం అధినేత్రి సోనియాగాంధీ సమక్షంలో పార్లమెంట్‌ నిండు సభలో జై తెలంగాణ నినాదాలు చేసినా వీరిలో చలనముండదు. వాళ్లు పదవులకు రాజీనామా చేసేందుకు ఒక్కడుగు ముందుకేసినా వీరు కనీసం ఆ దిశగా ప్రకటన కూడా జారీ చేయరు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిన 2009లో కేంద్రం తెలంగాణ ఇచ్చినట్టే ఇచ్చి మోసం చేస్తే తట్టుకోలేక ఇప్పటి వరకు వెయ్యి మంది విద్యార్థులు, యువకులు ఆత్మహత్య చేసుకున్నారు. ఉద్యమానికి స్ఫూర్తివంతమైన కేంద్రంగా నిలిచిన ఉస్మానియా యూనివర్సిటీ కూడా బలిదానాలకు కేంద్రంగానే మారింది. యాదయ్య ఎన్‌సీసీ గేట్‌ ఎదుటే ఆహుతైపోయాడు. అలా బలిదానం చేసిన విద్యార్థుల మృతదేహాలపై తెలంగాణ సాధన కోసం ఏదో చేస్తామంటూ ప్రమాణం చేసిన ఈ నాయకులు ఇంతవరకు చేసిందేమి లేదు. పదువులు పట్టుకు వేల్లాడటం, తమ వారికి కార్పొరేషన్‌ పదవులు ఇప్పించుకునేందుకు కాంట్రాక్టులు దక్కించుకునేందుకు పైరవీలు చేయడం మినహా అధిష్టానంపై నిజాయితీగా ఒత్తిడి చేసింది లేదు. అప్పుడు జై తెలంగాణ అని గర్జించి మంత్రి పదవులు దక్కించుకున్న కొందరు ఇప్పుడు కేంద్రంపై తమకు నమ్మకముందని, తెలంగాణ వస్తుందంటూ బూటకపు ప్రకటనలు చేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దాదాపు తెలంగాణ ఇవ్వబోమనే స్థాయిలో ప్రకటన చేసినా వారికి ఇంకా నమ్మకముందంటే ఎవరిని మోసం చేస్తున్నారు? మళ్లీ లేఖల పేరుతో నడిపే మంత్రాంగం వెనుక మతలబు ఏమిటి? ఇంకా మోసం చేయాలని చూస్తే తరిమి కొట్టడం ఖాయం. రాయబేరాల లేఖలు కాదు స్పీకరుకు రాజీనామా లేఖలు ఇచ్చి తెలంగాణ కోసం కొట్లాడాలి.