ఇంజనీరింగ్‌పై రాజీలేదు

4

నాణ్యతా ప్రమాణాలకే ప్రాధాన్యత

ఫీజు రీఇంబర్స్‌మెంట్‌ కొనసాగుతుంది: కడియం

హైదరాబాద్‌,మార్చి17(జనంసాక్షి): ఇంజనీరింగ్‌ విద్యావిధానాంలో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని, తెలంగాణ శాసనసభలో ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి అయిన కడియం శ్రీహరి స్పష్టం చేశారు.  ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఎగవేయడానికి కాలేజీలను మూస్తున్నారన్న ఆరోపణలను ఆయన తిప్పి కొట్టారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గతంలో జరిగిన తప్పులను చూస్తూ ఊరుకోరాదనే ఉద్దేశంతో వ్యవహరిస్తున్నామని అన్నారు. ఇంజీరింగ్‌లో నాణ్యమైన బోధన జరగాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యమన్నారు.   బోధనా రుసుముల అంశంపై చర్చ సందర్భంగా  అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సభనుంచి వాకౌట్‌ చేస్తున్నట్లు కాంగ్రెస్‌ శాసనసభాపక్ష ఉప నేత జీవన్‌రెడ్డి, భాజపా శాసనసభాపక్షనేత లక్ష్మణ్‌ ప్రకటించారు. ఆతర్వాత ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ… కాంగ్రెస్‌ వారు కూడా అవినీతిపై మాట్లాడుతున్నారని విమర్శించారు. బోధనా రుసుముల పథకానికి తూట్లు పొడిచే ఉద్దేశం తమకు లేదన్నారు. ఇంజినీరింగ్‌ విద్యార్థుల గౌరవం పెంచేందుకు ప్రభుత్వం యత్నిస్తోందన్నారు. అంతకుముందు ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చ సాగింది. పలువురు పలు అంశాలను ప్రస్తావించారు. ఫీ రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి ప్రభుత్వంపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పాలని బీజేపీ సభ్యులు డిమాండ్‌ చేశారు. భారం తగ్గించుకోవడానికే కళాశాలల మూతకు ప్రయత్నిస్తున్నారని బిజెపి సభ్యుడు లక్ష్మణ్‌ ఆరోపించారు. ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుందని కళాశాలలు తగ్గించే ఉద్దేశం తమకు లేదని మంత్రి కడియం శ్రీహరి స్పష్టం చేశారు. తెలంగాణ విద్యార్థుల ఆత్మగౌరవం దెబ్బతీసేలా ప్రభుత్వం తీరు ఉందని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌ విమర్శించారు. ఇలా ఇంజినీరింగ్‌ కళాశాలల ప్రమాణాలు, ఫీజు రియింబర్స్‌మెంట్‌పై శాసనసభలో వాడి వేడి చర్చ జరిగింది. కావాలనే పలు ఇంజినీరింగ్‌ కళాశాలలకు అనుమతులు రద్దు చేశారని, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ భారం తగ్గించుకునేందుకు ప్రభుత్వం యత్నిస్తుందని విపక్షాలు వ్యాఖ్యానించాయి. విపక్షాల వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తీవ్రంగా స్పందించారు. ఇంజినీరింగ్‌ కళాశాలల ప్రమాణాలు పాటించకపోవడానికి గత ప్రభుత్వాలే కారణమని పేర్కొన్నారు. ఇష్టమొచ్చినట్లు అనుమతులు ఇవ్వడం వల్లే ఆయా కళాశాలలు ప్రమాణాలు పాటించలేదని తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 163 ఇంజినీరింగ్‌ కళాశాలు ఉండగా అందులో 29 మైనార్టీ కళాశాలలున్నాయి. ప్రమాణాలు పాటించని 16 కళాశాలలపై కేసులు నమోదు చేశామని వెల్లడించారు. రెండు విడతలుగా ఫిజికల్‌ ఇన్‌స్పెక్షన్‌ చేసిన తర్వాత జేఎన్టీయూ ప్రమాణాలు పాటించని కళాశాలలపై చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. సాంకేతిక కళాశాలల ప్రమాణాలపై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇంజినీరింగ్‌ విద్యాప్రమాణాలను పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని ఉద్ఘాటించారు. రాష్ట్రంలో 1,76,770 ఇంజినీరింగ్‌ సీట్లు ఉండగా, గతేడాది 76,594 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయని తెలిపారు. ఇంకా లక్ష సీట్లు భర్తీ కాలేదు. మరీ ఏం చేయాలి. సీట్లు భర్తీ కానీ కళాశాలలను కొనసాగించాలా అని ప్రశ్నించారు. ఇంజినీరింగ్‌ విద్యలో నాణ్యత లేకుండా పోతోందని చెప్పారు. ప్రమాణాలను మెరుగుపర్చే విధంగా కళాశాలకు ఆదేశాలు ఇస్తున్నామని తెలిపారు. తమకు ఎలాంటి కళాశాలపై కక్ష లేదని స్పష్టం చేశారు. ఆయా కళాశాలల్లో ల్యాబ్‌లు, కంప్యూటర్లు, బోధనా సిబ్బంది లేరన్నారు. వసతులు లేవన్నారు. ఇవన్నీ చూస్తూ ఊరుకోవాలా అన్నారు. కళాశాలల మూతవల్ల అందులో ఉన్న విద్యార్థులకు నష్టం జరక్కుండా చూస్తామన్నారు. అలాగే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విషయంలో ఏ ఒక్క విద్యార్థికి అన్యాయం జరగనివ్వమని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం చెల్లించని బకాయిలను ఈ ప్రభుత్వం విడుదల చేసిందని గుర్తు చేశారు. గత ప్రభుత్వాలు తప్పు చేస్తే తమ ప్రభుత్వాన్ని నిలదీయడమేంటని ప్రశ్నించారు. రీయింబర్స్‌మెంట్‌ చెల్లించకపోవడం వల్ల ఒక్క విద్యార్థయినా చదవు మానేసిండని రుజువు ఉంటే చూపండి? దానికి ప్రభుత్వం బాధ్యత వహిస్తుందని కడియం స్పష్టం చేశారు. విద్యార్థులందరికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లిస్తామని స్పష్టం చేశారు. 16 లక్షల మంది విద్యార్థులకు 2,500 కోట్లు చెల్లిస్తున్నామని తెలిపారు. రీయింబర్స్‌మెంట్‌ తగ్గించుకునే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని తేల్చిచెప్పారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో అవినీతి జరిగిందని ప్రభుత్వానికి ఇంత వరకు ఫిర్యాదు రాలేదని చెప్పారు. ఈ ప్రభుత్వం వందకు వంద శాతం నీతిగా పని చేస్తుందని స్పష్టం చేశారు. 371 డీ ఆర్టికల్‌ ప్రకారం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కొనసాగిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ఫీజు రియింబర్స్‌మెంట్‌పై, ఇంజినీరింగ్‌ కళాశాలల అంశంపై ప్రత్యేక చర్చ నిర్వహించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఉద్ఘాటించారు.

విపక్షాల దాడి

ఫీజు రియింబర్స్‌మెంట్‌ ఎత్తేయడానికే ప్రభుత్వం కుట్ర చేస్తోందని బిజెపి సభ్యులు లక్ష్మణ్‌, కిసన్‌ రెడ్డిలు ఆరోపించారు. ఇది కావాలనే చేస్తున్నారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరవాతనే ఇలా చేస్తున్నారని అన్నారు. కోళ్ల షెడ్లలో నడుస్తున్న కళాశాలల వివరాలు వెల్లడించాలని లక్ష్మణ్‌ డిమాండ్‌ చేశారు. మూతవల్ల విద్యార్థుల నస్టపోతారని అన్నారు. విద్యావ్యవస్థనే అస్తవ్యస్థంగా ఉందని ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్‌ అన్నారు. దీనిపై అఖిలపక్షం పెట్టి చర్చించాలన్నారు. మైనార్టీ విద్యా సంస్థలకు మరోమారు అవకాశం ఇవ్వాలన్నారు. సుప్రీం ఆదేశాల మేరకు నిర్ణయాలు తీసుకోవాలన్నారు.