ఇంటర్ విద్యార్థలకు ఉచిత విద్య
– విద్యశాఖ మంత్రి కడియం
హైదరాబాద్,జూన్24 (జనంసాక్షి):
తెలంగాణలో జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు ఫీజులు మాఫీ చేయడమే గాకుండా, ఉచితంగా పుస్తకాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం అయ్యే ఖర్చును ఇంటర్ బోర్డు భరిస్తుంది. కళాశాలల్లో చదివే విద్యార్థులందరికీ ఉచిత పాఠ్య పుస్తకాలు అందజేస్తామని తెలంగాణ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. దీనిద్వారా రాష్ట్రంలో ఇంటర్ చదివే లక్షా 30వేల మంది విద్యార్థులకు లబ్ది చేకూరనున్నట్లు తెలిపారు. వారి ఐడెంటిటీ కార్డు ఆధారంగా వారికి పుస్తకాలు అందేస్తామని అన్నారు. అలాగే ధ్రువపత్రాల కోసం ఇకపై ఎవరూ ఇంటర్‌బోర్డుకు రావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. బుధవారం ఇంటర్‌బోర్డు కార్యాలయంలో సవిూక్ష నిర్వహించిన అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బోర్డులో చోటుచేసుకునే అవినీతిని అరికట్టేందుకు ఆన్‌లైన్ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. ఆలస్యం, అవినీతి ఆరోపణల నుంచి ఇంటర్ బోర్డును బయట పడేసేందుకు ప్రక్షాళన చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు శ్రీహరి తెలిపారు. జులై 1 నుంచి ఆన్‌లైన్‌లో 22 సేవలు అందిస్తామని వెల్లడించారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పూర్తిగా ఉచిత విద్యను అందిస్తామన్నారు. 402 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో లక్షా 17వేల మంది విద్యార్థులు చదువుతున్నారన్నారు. ఈ ఏడాది నుంచి ఎలాంటి ఫీజు వసూలు చేయమని చెప్పారు. ఫీజుల మొత్తం దాదాపు రూ.9 కోట్లను ఇంటర్ బోర్డు భరిస్తుందని చెప్పారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు పంపిణీ చేస్తామన్నారు. అర్హులైన కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులరైజ్ చేస్తామని కూడా ప్రకటించారు. ఖాళీ పోస్టులకు వెంటనే నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించారు.
కేసునుంచి బాబు తప్పించుకోలేరు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినంత మాత్రాన చంద్రబాబు చట్టం నుంచి తప్పించుకోలేడని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తేల్చి చెప్పారు. మే ఎవరి ఫోన్లను ట్యాపింగ్ చేయలేదు. టేపుల్లోని వాయిస్ తనదో … కాదో చంద్రబాబు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ట్యాపింగ్ పేరుతో కేసు పక్కదోవ పట్టించే ప్రయత్నంచేస్తున్నారని ఆరోపించారు. ఫోన్ టాపింగ్ కు ,రికార్డింగ్ కు తేడా తెలియని పరిస్థితిలో ఎపి ప్రభుత్వం ఉందని శ్రీహరి అన్నారు. ఫోన్ టాపింగ్ కు తెలంగాణ ప్రభుత్వం ఎక్కడా పాల్పడలేదని ఆయన స్పష్టం చేశారు. ఫోన్ టాపింగ్ అంటూ గగ్గోలు పెడుతున్నది అసలు కేసును పక్కదారి పట్టించడానికేనని ఆయన ఆరోపించారు.ఎన్ని డ్రామాలు అడినా కేసు నుంచి తప్పించుకోలేరని చంద్రబాబును ఉద్దేశించి కడియం వ్యాఖ్యానించారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని,చంద్రబాబు సి.ఎమ్. అయినా తప్పు చేస్తే చట్టం ప్రకారం విచారణ ఎదుర్కోవలసిందేనని కడియం స్పష్టం చేశారు. అసలు స్టీఫెన్‌సన్‌కు ఫోన్ చేసింది నిజమా కాదా అన్నది ఎందుకు వెల్లడించడం లేదన్నారు.