ఇకనైనా బీజేపీ పునరాలోచించుకోవాలి
నేషనల్ డెమోక్రాటిక్ అలయెన్స్ (ఎన్‌డీఏ)తో 17 ఏళ్ల బంధాన్ని జనతాదళ్(యునైటెడ్) ఆదివారం తెగతెంపులు చేసుకుంది. జేడీయూ సుదీర్ఘ బంధానికి ముగింపు పలకాలని ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోలేదు. గడిచిన కొద్ది నెలలుగా ఎన్‌డీఏలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న భారతీయ జనతా పార్టీకి జేడీయూ ఈ విషయమై హెచ్చరికలు జారీ చేస్తూనే వచ్చింది. వరుసగా రెండు పర్యాయాలు ప్రతిపక్షానికే పరిమితమైన ఎన్‌డీఏ ఈసారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని చూస్తున్న క్రమంలో ఈ పరిణామం అశనిపాతమే. ఎన్‌డీఏలో అతిపెద్ద పార్టీలు బీజేపీ, జేడీయూ. ఎన్‌డీఏ ఆవిర్భావం నుంచి బీజేపీతోనే జట్టుకట్టి తన మైత్రీబంధాన్ని కొనసాగిస్తోంది జేడీయూ. ఇంతకాలం బీహార్‌లో ఎన్‌డీఏ ప్రభుత్వమే అధికారంలో ఉంది. అధికారానికి సరిపడా సంఖ్యా బలమున్నా సంకీర్ణ ధర్మానికి లోబడి నితీశ్‌కుమార్ సంకీర్ణ ప్రభుత్వాన్నే కొనసాగిస్తున్నాడు. బీహార్‌లో జేడీయూ, బీజేపీ కూటమి దెబ్బకు లాల్‌ప్రసాద్‌యాదవ్ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్ చావుదెబ్బ తింది. ఇంతకాలం బీజేపీ, జేడీయూ పటిష్టమైన మైత్రీబంధాన్ని కొనసాగించడానికి కారణం బీజేపీ తన సహజ సిద్ధాంతాలను కాస్త పక్కకుపెట్టడమే. భారతీయ జనతాపార్టీ రాజకీయ పార్టీయే అయిన సంఘ్ పరివార్, ఆర్‌ఎస్‌ఎస్ కనుసన్నల్లోనే కార్యకలాపాలు కొనసాగిస్తోంది. సెక్యులర్ దేశంలో మత రాజకీయాలతో అధికారం రాదని గుర్తించిన బీజేపీ ఆర్‌ఎస్‌ఎస్, సంఘ్ పరివార్ నుంచి కాస్త దూరం జరిగినట్టు చూపి సెమీ సెక్యూలర్ ఎజెండాతో ముందుకుసాగింది. బీజేపీ ఎజెండాలో ప్రధానమైనవి అయోధ్యలో రామాలయ నిర్మాణం, కామన్ సివిల్ కోడ్, ఆర్టికల్ 370 అమలు. వీటివల్ల మైనార్టీలు తమను ఆదరించరని గుర్తించిన బీజేపీ వాటి నుంచి కాస్త పక్కకు జరిగి లౌకికవాద పార్టీగా చెప్పుకునేందుకు వివిధ ప్రయత్నాలు చేసింది. ఫలితంగా వివిధ పార్టీలతో కలిసి ఎన్‌డీఏ కూటమి ఆవిర్భవించింది. రెండు పర్యాయాలు ఆ కూటమి కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. లౌకికవాదిగా పేరున్న అటల్‌బిహారీ వాజపేయి భారత ప్రధానమంత్రి అయ్యారు. భారతీయ జనతా పార్టీ ఇద్దరు పార్లమెంట్ సభ్యుల నుంచి అధికారం అందిపుచ్చుకునే స్థాయికి చేరుకోవడంలో సీనియర్ నేత లాల్‌కృష్ణ అద్వానీ పాత్ర అంతాఇంతా కాదు. దుందుడుకు స్వభావమున్న అద్వానీని ప్రధానిగా ఎవరూ అంగీకరించరని ముందే గుర్తించిన బీజేపీ లౌకికవాది వాజపేయిని ముందుపెట్టి అధికార పీఠం దక్కించుకోగలిగింది. తర్వాతికాలంలో అద్వానీ కూడా లౌకికవాదిగా పేరు తెచ్చుకునేందుకు ఉబలాడపడ్డాడు. పాకిస్థాన్ పర్యటనలో మహ్మద్ అలీ జిన్నాను పొడిగి సంఘ్ పరివార్, ఆర్‌ఎస్‌ఎస్ ఆగ్రహానికి గురయ్యాడు. అయినా వెనుదిరిగకుండా లౌకికవాదాన్నే భుజానికెత్తుకున్నాడు. వాజపేయి, అధ్వానీ తర్వాత జనాకర్షక నేతలకు బీజేపీలో కొదవ లేకపోయినా హిందువుల ఓట్లు గంపగుత్తాగా కొళ్లగొట్టాలనే లక్ష్యంతో బీజేపీ పక్కా హిందుత్వవాదిగా పేరున్న గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీని ప్రధాని అభ్యర్థిగా ముందుకు తెచ్చే ప్రయత్నాలు ప్రారంభించింది. ఈమేరకు భాగస్వామ్యపక్షాలను, దేశ ప్రజలను ఉద్యుక్తం చేసేందుకు మోడీని ప్రమోట్ చేసే పనిలో బీజేపీ అగ్రనాయకత్వం కొన్నాళ్లుగా నిమగ్నమైంది. నిత్యం మోడీని నామమే పఠిస్తూ, జపిస్తూ ధన్యమవుతోంది. గుజరాత్‌లో అధికారం అందిపుచ్చుకున్న తర్వాత మోడీ నేతృత్వంలో జరిగిన ఘోర మారణకాండ దేశ ప్రజలకే కాదు.. ప్రపంచం వ్యాప్తంగా సుపరిచితమే. 2002లో గోద్రా నరమేధంలో మూడు వేల మందికిపైగా ఊచకోతకు గురయ్యారు. వారందరినీ ప్రభుత్వ పర్యవేక్షణలోని కొన్ని సంఘాలు, సమూహాలు మట్టుబెట్టాయనే ఆరోపణలున్నాయి. ఇందుకుతగ్గ ఆధారాలు తమ వద్ద ఉన్నాయని అమెరికా గూడచర్య సంస్థ సీఐఏ ప్రకటించింది. ఇప్పటి వరకూ అగ్రరాజ్యంలో పర్యటించేందుకు మోడీకి వీసా కూడా ఇవ్వలేదు. దేశీయ దర్యాప్తు సంస్థలు మోడీని నిర్దోషిగా పేర్కొనవచ్చేమోగాని ప్రజల దృష్టిలో మోడీ దోషే. గుజరాత్ దారుణ మారణకాండను ఇప్పటికీ మర్చిపోలేని స్థితిలో గోద్రా ప్రజలున్నారు. అంటే ఊచకోత తీత్రవ ఎంతస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఊచకోత తాలూకూ హృదయ విదారక దృశ్యాలు ఇప్పటికీ గుజరాతీల మనస్సుల నుంచి పోలేదు. అలాంటి మోడీని దేశంలో అత్యధిక జనాభా ఉన్న హిందువుల ప్రతినిధిగా ప్రమోట్ చేసే పనిలో బీజేపీ తలమునకలై ఉంది. ఈ పరిణామాన్ని పార్టీకి జవసత్వాలిచ్చిన ఎల్‌కే అద్వానీ సహా పలువురు సీనియర్ నేతలు వ్యతిరేకించినా వెనక్కు తగ్గలేదు. 17 ఏళ్లుగా రాజకీయ భాగస్వామ్యపక్షంగా జేడీయూ జట్టు వీడినా పట్టువీడలేదు. భారతీయ జనతా పార్టీ లౌకికవాదాన్ని వీడి తన వెనకటి ఎజెండా వైపునకు వెళ్తున్నట్లుగా అనిపిస్తోంది. ఈ క్రమంలో సొంతపార్టీ నేతలు వ్యతిరేకించినా, మిత్రులు వీడిపోయినా పర్వాలేదన్నట్టుగా వ్యవహరిస్తోంది. కానీ ఈ పరిణామం బీజేపీని ఒంటరిని చేస్తుంది. మోడీనే ఓట్లు కురిపిస్తాడనే అంచచల విశ్వాసం ఆ పార్టీకి ఉండటంలో ఆంతర్యమేమిటోగానీ బీజేపీ వేస్తున్నది తప్పటడుగునేనని అద్వానీ ఆదివారం రాజ్‌నాథ్‌తో వ్యాఖ్యానించారు. లౌకిక దేశంలో లౌకికవాదాన్ని వీడి ముందుకు సాగాలనుకుంటే అది బీజేపీ మనుగడకే ప్రమాదం తేవచ్చు. ఇప్పటికైనా బీజేపీ పునరాలోచించుకొని లౌకిక ఎజెండా భుజానికెత్తుకుంటేనే ఆ పార్టీకి మంచిది.