ఇక ప్రతి ఊరిలో బార్‌

కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఓ కొత్త కానుకనిచ్చింది. ఉన్న ఊళ్లోనే తాగినోళ్లకు తాగినంత అనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. అందుకోసం ఇటీవలే ఓ పాలసీని కూడా పాస్‌ చేసింది. ఇంతకాలం మద్యం షాపుల వరకే సర్కారు పర్మిషన్లు ఇవ్వడం పరిమితమయ్యేది. ఇప్పుడు వాటి పక్కనే పర్మిట్‌ రూంలు ఏర్పాటు చేసుకోవచ్చని ఏలిన వారు తేల్చిచెప్పారు. మందుబాబులు బాటిళ్లు కొనుక్కొని దూరంగా పోయి కష్టపడి తాగేకంటే ఎక్కడైతే వైన్స్‌కు పర్మిషన్‌ ఇచ్చారో, ఆ పక్కనే మద్యం తాగేందుకు పర్మిట్‌ ఇస్తున్నారు. ఇందుకోసం మద్యం వ్యాపారులు రూ. 2 లక్షలు అదనంగా చెల్లించాలని నిర్దేశించారు. ఇకపై ప్రతి మద్యం షాపు పక్కనే యంచక్కా కూర్చొని మందుబాబులు పీకల్దాక తాగొచ్చు. సరిపోకపోతే పక్కనే ఉన్న షాపులోంచి మళ్లీ తెప్పించుకోవచ్చు. ఇలా తాగినోళ్లకు తాగినంత. ప్రజల జేబులకు చిల్లు పెట్టే ఈ పథకాన్ని ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ఇటీవల ప్రకటించింది. రాష్ట్రంలో 2013 -14 ఆర్థిక సంవత్సరంలో ప్రజలతో మద్యం తాగించడం ద్వారా రూ. 12 వేల కోట్ల ఆదాయం సమకూర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి నూతన ఎక్సైజ్‌ పాలసీ అనే పేరు పెట్టింది. ఈ పాలసీకి పథకాల సృష్టికర్తగా తనకు తాను చెప్పుకునే ముఖ్యమంత్రి కిరణ్‌ ఆమోద ముద్ర వేశారు. ప్రజలందరితో తాగించి ఆ నిషాతో ఖజానాకు కిక్కెంచాలని సంకల్పించారు. ఇందుకోసం ఊరుకో బారుకు తెరతీశారు. కాస్త జనాభా ఉన్న ప్రతి ఊరిలో మద్యం షాపు, దాని పక్కనే పర్మిట్‌ రూమ్‌కు లైసెన్స్‌ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారు. ఇంతకాలం కొన్ని చోట్ల అక్రమంగా నిర్వహిస్తున్న సిట్టింగ్‌ వల్ల కోల్పోయే ఆదాయాన్ని చట్టం బద్ధం చేసుకోవడమే ప్రభుత్వ లక్ష్యమన్నట్లుగా నూతన మద్యం పాలసీని రూపొందించారు. ‘మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం’ అనే స్టిక్కర్‌ ప్రతి సీసాపై ముద్రించి మరీ అందరితో తాగిస్తున్న ఎక్సైజ్‌ శాఖ రాష్ట్ర ఖజానాకు పెద్ద ఆదాయ వనరు. ఇప్పుడు కిరణ్‌ సార్‌ ఏ కొత్త స్కీం పెట్టాలన్నా దానికి ప్రజల రక్తాన్ని మద్యం రూపంలో పీల్చడమే శరణ్యం. అందుకోసమే ఊరికో బారు. ఒకప్పుడు గ్రామాల్లో మద్యం తాగేవారిని హీనంగా చూసేవారు. ఇప్పుడు సీన్‌ రివర్స్‌ అయింది. తాగుబోతులకు సర్కారే పెద్ద గుర్తింపునిస్తోంది. వారికోసం పెద్ద యంత్రంగాన్నే ఏర్పాటు చేసి మందు సరఫరా చేస్తోంది. ఇప్పుడు రక్షిత మంచినీళ్లు దొరకని ఊళ్లున్నాయేమో గాని మద్యం దొరకని ఊళ్లు మాత్రం లేవు. మందుబాబులు రాష్ట్ర ఖజానాకు మహారాజ పోషకులు. తాగేవారిని ఈసడించుకునే రోజుల నుంచి ఇంతటి అద్వానస్థితి దిశగా పరివర్తన రావడం, దానికి పాలకులే కారకులు కావడం ప్రజలు చేసుకున్న పాపం. మద్యం అమ్మకాలను నియంత్రించి ప్రజారోగ్యాన్ని కాపాడాల్సిన నైతిక బాధ్యత ప్రభుత్వాలది. కానీ ప్రభుత్వం తన బాధ్యత నుంచి బహుదూరం వెళ్లిపోయింది. పూర్తిగా దిగజారి రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్‌గా మార్యేందుకు పూనుకుంది.