ఇతర రాష్ట్రాల వాహనాలకు పన్ను నిర్ణయం సముచితం
తెలంగాణ సర్కారు ఇకపై ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలోకి వచ్చే వాహనాలకు రవాణా పన్ను విధించేందుకు నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1 నుంచి పన్ను వడ్డన అమలు చేస్తామని సోమవారం రాత్రి తెలంగాణ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రధానంగా ఆర్టీసీకి గండి కొడుతున్న ప్రయివేటు ట్రావెల్స్ ఆగడాలకు అడ్డుకట్టపడనుంది. ఈ నిర్ణయంతో బెంబేలెత్తిపోయిన ట్రావెల్ ఏజెన్సీలు బస్సులు నిలిపివేస్తున్నరు. అయితే దీనికి విరుగుడుగా ఆర్టీసీ హైదరాబాద్ నుంచి విశాఖ, విజయవాడ, తిరుపతి తదితర ప్రాంతాలకు దాదాపు వందకుపైగా బస్సులను సిద్ధం చేసింది. అవసరమైతే మరిన్ని అదనపు బస్తులు వేస్తామని ప్రభుత్వ రంగ సంస్థ ఆర్టీసీ స్పష్టం చేసింది. నూతన పన్ను విధానం వల్ల తెలంగాణ ప్రభుత్వానికి యేటా 50 కోట్ల రూపాయల పైచిలుకు ఆదాయం సమకూరనుంది. అయితే నూతన పన్ను విధానం రద్దు చేయాలంటూ ఆంధ్రకు చెందిన పలు ప్రయివేటు వాహనాల యజమాన్య సంఘాలు బంద్ పాటిస్తున్నాయి. దీంతో 80 శాతం వరకు రవాణా బంద్ అయిపోయింది. పన్ను విధానం మార్చేవరకు ప్రయివేట్ ట్రావెల్ బస్సులు నడపబోమని ఆంధ్ర ట్రావెల్ ఏజెన్సీలు తేల్చిచెప్తున్నాయి. నూతన పన్ను విధానం వల్ల ప్రధానంగా ప్రయివేటు ట్రావెల్ బస్తులపై అధికంగా భారం పడనుంది. 3 నెలల పన్ను మొత్తం జాతీయ పరిమితి ఉన్న వాహనాలకు ఒక్కో సీటుకు 3675 రూపాయలు కాగా, రాష్ట్ర పరిమితి ఉన్న వాహనాలకు 2625 రూపాయలు భారం పడనుంది. ఇలా బస్కుకు లక్ష 25వేల నుంచి లక్షన్నర వరకు పన్ను భారం పడుతుంది. ఇవేకాక కాకినాడ,విశాఖ, కృష్ణపట్నం పోర్టు తదితర ప్రాంతాల నుండి హైదరాబాద్ వచ్చే లారీలపై కూడా అదనపు పన్ను భారం పడనుంది. ఇన్నాళ్లూ యధేచ్చగా ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టి కోట్లు దండుకున్న ట్రావెల్ మాఫియా ఇక పన్ను రూపంలో అంతా కక్కాల్సిన పరిస్థితి రావటంతో మొండికేస్తున్నారు. అయినా సరే తగ్గేదే లేదని తెలంగాణ రవాణా మంత్రి మహేంధర్‌రెడ్డి స్పష్టంతేశారు. ఇన్నాళ్లూ ప్రదానంగా ట్రావెల్ బస్తుల దోపిడీ యధేచ్చగా సాగింది. దీనికితోడు ట్రాఫిక్ జాంలు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా సీమాంధ్రుల దోపిడీ కొనసాగుతోంది. ఏ రంగంలో చూసినా వారి దోపిడీ ఇంకా ఆగలేదు. విభజన చట్టం ప్రకారం.. తెలంగాణకు కేటాయించిన విద్యుత్ సరఫరా చేయడంలో కుట్రలు చేశారు. అదేకోవలో.. తెలంగాణ ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చే ఆర్టీసిని ప్రైవేట్ ట్రావెల్స్ రూపంలో కొల్లగొడుతున్నారు. తెలంగాణ ఆర్టీసికి ఇవ్వాల్సిన పర్మిట్లను ఇవ్వకుండా.. సీమాంధ్ర బస్సులను యథేచ్ఛగా నడుపుతున్నారు. ఈ విధంగా రోజుకు సగటున 1500 ప్రైవేట్ బస్సులను నడుపుతూ.. తెలంగాణ ఆర్టీసికి కోట్ల రూపాయల గండికొడుతున్నారు. 1987లో ఎన్టీరామారావు కాలంలో ఎపిఎస్ఆర్టీసి 90 శాతం వరకు జాతీయీకరణ జరిగింది. మిగతా 10 శాతం ప్రైవేట్ ట్రావెల్స్ ఉన్నాయి. అవికూడా సీమాంధ్ర రాజకీయ నాయకుల అనుచరులు, అనుయాయులు, రక్తసంబంధీకులు, సీమాంధ్ర పెట్టుబడిదారులకే ఉన్నాయి. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక్కరంటే ఒక్కరికి ఈ ప్రైవేట్ ట్రావెల్స్ నేటికీ లేవు. అంటే వారిపెత్తనం ఏ మేరకు ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు వాటితో ఆర్టీసికి సమాంతరంగా తెలంగాణ ప్రజల ఆదాయాన్ని సీమాంధ్రులు కొల్లగొట్టుకుపోతున్నారనడానికి ఇదొక నిదర్శనం. ప్రైవేట్ ట్రావెల్స్ అన్నీ కేశినేని, పోతుల, కాళేశ్వరి, జెసి దివాకర్‌రెడ్డికి చెందిన పలు పేర్లతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి నేటి నూతన తెలంగాణ రాష్ట్రంలో కూడా చెలామణి అవుతున్నాయి. ఇవన్నీ సీమాంధ్ర రాజకీయ నాయకుల కనుసన్నల్లోనే నడుస్తున్నవి. ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు సీమాంధ్రుల రాజకీయ నాయకుల పలుకుబడిని ఉపయోగించుకుని ఇన్నాళ్లూ అక్రమ సంపాదనకు తెగబడ్డారు. తమ బస్సులకు పర్మిట్లు లేకున్నా ఉన్నట్లు చూపించి తెలంగాణ ప్రభుత్వాన్ని, ఆర్టీఏను మోసం చేస్తున్నారు. ఒక్క బస్సుకు పర్మిట్లు తీసుకుని దానిపేర నాలుగైదు బస్సులకు వర్తింపచేసి అక్రమ రవాణా నడిపిస్తున్నారు. ఒక్క నంబర్‌తో నాలుగైదు బస్సులను తిప్పుతున్నారు. ఇలాంటి డొల్లతనం గతంలో ఆర్టీఏ అధికారులు చేసిన తనిఖీల్లో అనేక సార్లు బయటపడింది. అయినా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. చర్యలు తీసుకోకుండా అక్కడి రాజకీయ పెద్దలు అండగా నిలిచారు. ప్రైవేట్ ట్రావెల్స్ అధిపతులు ఆర్టీఏ నిబంధనలను అతిక్రమిస్తూ స్టేజిక్యారేజీ విధానంలో ప్రజారవాణా కొనసాగించి కోట్లు గడించారు. ప్రైవేట్ ట్రావెల్స్ ఏజెన్సీలు హైదరాబాద్ నగరంలో గల్లీకొకటి వెలుస్తున్నాయి. రకరకాల పేర్లతో దర్శనమిస్తున్నాయి. వాటి బుకింగ్ కోసం ఆన్లైన్ సెంటర్లు కూడా అదే తరహాలో పుట్టుకొస్తున్నాయి. ఏజెంట్ల ద్వారా ఆన్లైన్ బుకింగ్ చేయిస్తున్నారు. తద్వారా ప్రయాణికులకు కుచ్చుటోపీ పెడుతున్నారు. అదే సందర్భంలో తెలంగాణ ఆర్టీసి ఆదాయానికి ఖన్నం వేస్తున్నారు. ట్రావెల్స్ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికుల నుంచి ట్రావెల్స్ యాజమాన్యాలు నిర్ధిష్టమైన ఛార్జీలు కాకుండా సీజన్‌ను బట్టి వసూలు చేస్తున్నారు. పండగలు, పబ్బాలు వచ్చినప్పుడు సాధారణ రోజుల్లో ఉండే ప్రయాణ ఛార్జీలను రెట్టింపు చేసి ప్రయాణికుల ముక్కుపిండి తీసుకుంటున్నారు. దీంతో ప్రయాణికుల జేబులకు పెద్దమొత్తంలో చిల్లులు పడుతున్నాయి. వీరి దోపిడీ ప్రయాణికులకు మింగుడుపడకపోయినా తప్పని పరిస్థితుల్లో వారు నిర్ణయించిన ఛార్జీలు చెల్లించక తప్పడం లేదు. తెలంగాణలో సీమాంధ్రులు రోజుకు సగటున 1500 ట్రావెల్స్ బస్సులను నడుపుతున్నారు. ఒక్కో బస్సుకు సుమారుగా రూ.20 వేల ఆదాయం వస్తోంది. ఇలా రోజుకు రూ.3 కోట్ల మేరకు తెలంగాణ ప్రభుత్వ ఆదాయాన్ని కొల్లగొడుతున్నారు. ఈ లెక్క ప్రకారం ఒక్క నెలకు రూ.90 కోట్లు అక్రమంగా తీసుకుపోతున్నారు. జూన్ 2న తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి అక్టోబర్ వరకు రూ.450 కోట్ల తెలంగాణ ఆర్టీసి ఆదాయాన్ని దోచుకెళ్లారని అర్థమవుతోంది. లాభార్జనే ధ్యేయంగా నడుపుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో ప్రయాణికులకు భద్రత కొరవడింది. అందుకు ట్రావెల్ యాజమాన్యాలు ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. బస్సుల ఫిట్నెస్ను పట్టించుకోరు. పైపై మెరుగులు దిద్ది ప్రయాణికులను ఆకర్షిస్తున్నారు తప్ప భద్రత విషయంలో పకడ్బంధీ చర్యలు తీసుకోవడం లేదని పలు సందర్భాల్లో జరిగిన ప్రమాదఘటనలు తెలుపుతున్నాయి. ఇద్దరు డ్రైవర్లకు ఒక్క డ్రైవర్‌తోనే బస్సు నడిపించడం. లైసెన్స్ క్లీనర్లతో పని చేయించుకోవడం. బస్సుల్లో సాధారణంగా 51 సీట్లు మాత్రమే ఉండాలి. ఈ సంఖ్యనే ఆర్టీఏకు చూపి పర్మిట్లు పొందుతారు. కానీ.. బస్సుల్లో సీట్ల సంఖ్యను 51 నుంచి 60, 65 వరకు పెంచుతారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడడం వల్ల తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఈ ప్రమాదాలు ట్రావెల్స్ బస్సులతోనే సంభవించడం పరిశీలించాల్సిన అంశం. దీన్నిబట్టి ట్రావెల్స్ బస్సుల్లో భద్రత ఎంత కట్టుదిట్టంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. షిరిడీ వెళ్తూ లోయలో పడిన కాలేశ్వరి బస్సు దుర్ఘటన, పాలెం వద్ద తగలబడిన బస్సు ప్రమాదం.. ఇలా చెప్పుకుంటూ పోతే ట్రావెల్స్ ప్రమాదాల లిస్టు చాంతాడంత ఉంది. ఇలాంటి ప్రమాదాల్లో వందల మంది తెలంగాణ బిడ్డలు ప్రాణాలు కోల్పోతే ఏ ఒక్కరి కుటుంబానికైనా ఆర్థిక సాయం చేసిన పాపానపోలేదు. తెలంగాణ సర్కారు నూతన పన్ను విధానం నేపథ్యంలో అక్రమార్జనకు తెగబడ్డ ప్రయివేటు ట్రావెల్స్ బస్సులపై కొరడా ఝులిపింఛటం ఖాయంగా కనిపిస్తోంది. ప్రయివేటు ట్రావెల్స్ మొండికేస్తే ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పుడు వాటి స్థానంలో బస్సులను నడిపేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. ఇలా ఆర్టీసీ రూపంలో ఆదాయం, పన్నుల రూపంలో ఆదాయంతో ప్రభుత్వ ఖజానా మరింత పటిష్టం కానుంది. మొత్తానికి తెలంగాణ సర్కారు తీసుకున్న నిర్ణయం అంతా హర్షింతదగిందే.