ఇది విద్యానామ సంవత్సరం
– ఉపముఖ్యమంత్రి కడియం
హైదరాబాద్,ఏప్రిల్ 11(జనంసాక్షి):2016-2017 విద్యా సంవత్సరాన్ని తెలంగాణ విద్యా సంవత్సరంగా ప్రకటిస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు పెంచేందుకు కృషి చేస్తామని, విద్యా సంస్థలకు అన్ని మౌలిక వసతులు ఉంటేనే అనుమతులు ఇస్తామని స్పష్టం చేశారు. విద్యాశాఖ అధికారులతో సచివాలయంలో ఆయన సవిూక్ష జరిపారు.ఈ విద్యా సంవత్సరం నుండి డిగ్రీ మొదటి సంవత్సరం అడ్మిషన్లు ఆన్ లైన్ ద్వారా నిర్వహిస్తామని కడియం శ్రీహరి చెప్పారు. మండలాల వారిగా ఎడ్యుకేషనల్ ప్రొఫైల్ తయారు చేస్తామని, అన్ని విద్యాసంస్థల్లో ఈ సంవత్సరం నుండి మంచినీరు అందించాలని నిర్ణయించామని తెలిపారు. అన్ని జూనియర్, డిగ్రీ, ఫార్మా కాలేజీల్లో బయోమెట్రిక్ విధానం, సీసీ కెమెరాలు జూన్ 13 కల్లా ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు.టెట్ రిజల్ట్స్ వచ్చే సరికల్లా టీచర్ రేషనలైజేషన్ చేసి డీఎస్సీ నిర్వహిస్తామని కడియం శ్రీహరి ప్రకటించారు. స్కూల్ ఫీజులను నియంత్రించే విధంగా వారంలోగా చర్యలు తీసుకుంటామన్నారు. స్కూళ్లలో అకడమిక్ బుక్స్ మాత్రమే వాడాలని స్పష్టం చేశారు. తనిఖీలు చేయాలని డి.ఇ.ఓ లను ఆదేశించారు. అకడమిక్ క్యాలెండర్ పాటించని స్కూళ్లపై చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రతి నెల అన్ని యూనివర్సిటీల హెచ్‌ఓడీలు, రిజిస్ట్రార్ లతో సమావేశం నిర్వహిస్తామన్నారు.