ఇద్దరికే మంచి రోజులు

3

జలజాలం భారీ స్కాం

19న ఢిల్లీలో భారీ ర్యాలీ

రాహుల్‌ పాల్గొంటారు.. దిగ్విజయ్‌ సింగ్‌

హైదరాబాద్‌,ఏప్రిల్‌2(జనంసాక్షి): దేశంలో ఇద్దరికే మంచి రోజులు వచ్చాయని వారిద్దరు  ప్రధాని మోడీ, బిజెపి అద్యక్షుడు అమిత్‌ షాలని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌ సింగ్‌ అన్నారు. ప్రజలకు అచ్చే దిన్‌ రాలేదని,కేవలం ఆ ఇద్దరికే అచ్చే దిన్‌ వచ్చిందని ఎద్దేవా చేశారు. భూ సేకరణ బిల్లుపై ప్రభుత్వం బుల్‌ డోజ్‌ చేస్తున్నదని,గతంలో కాంగ్రెస్‌ పార్టీ అన్ని పార్టీల ఏకాభిప్రాయం సాధించి భూ సేకరణ చట్టం తెచ్చిందని ఆయన అన్నారు. గాంధీభవన్‌లో ఆయన పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. సోనియాగాందీపై అభ్యంతర వ్యాఖ్యలు చేసిన గిరిరాజ్‌ సింగ్‌ తీరును ఖండిస్తున్నానని ఆయన చెప్పారు. ప్రధాని మోడీ ఆయనకు మరో ప్రమోషన్‌ ఇచ్చినా ఆశ్చర్యం లేదని దిగ్విజయ్‌ సింగ్‌ అన్నారు. గతంలో మోడీని వ్యతిరేకించేవారు పాక్‌ వెళ్లాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా ప్రధాని చర్య తీసుకోలేదని ,ఇప్పుడు కూడా అలాగే వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వంపైనా కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ చార్జీ దిగ్విజయ్‌ సింగ్‌ ఆరోపణలు గుప్పించారు.  తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్‌ గ్రిడ్‌ పై ఆయన ఆరోపణాస్త్రాన్ని సంధించారు. వాటర్‌ గ్రిడ్‌ పనులలో పెద్ద కుంభకోణం జరుగుతోందని ఆయన ఆరోపించారు. జలజాలంలో అంతా మోసం అని, ముడుపుల కోసమే ఇలా చేస్తున్నారని అన్నారు.  దిగ్విజయ్‌ సింగ్‌ ఈ వ్యాఖ్యలు చేయడం ద్వారా తెలంగాణ లో కాంగ్రెస్‌ పార్టీని పోరాటం చేయాలని సూచించారు. కాగా టిఆర్‌ ఎస్‌ ప్రభుత్వం హావిూలను అటక ఎక్కించిందని కూడా దిగ్విజయ్‌ సింగ్‌ విమర్శించారు. గాందీ భవన్‌ లో ఆయన కాంగ్రెస్‌ నేతలతో సమావేశం అయ్యారు. శాసనసభలో విపక్ష నేత జానారెడ్డి, మండలిలో విపక్ష నేత షబ్బీర్‌ అలీ, పిసిసి అద్యక్షుడు ఉత్తం కుమార్‌ రెడ్డి తదితరులు దిగ్విజయ్‌ తో భేటీ అయ్యారు.  రాష్ట్రంలో పార్టీ బలోపేతం, సభ్యుత్వ నమోదుపై నేతలతో చర్చించారు.  కాంగ్రెస్‌ పార్టీకి పూర్వవైభవం తీసుకురావడానికి క్షేత్ర స్థాయిలో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై చర్చించారు. అలాగే సమావేశం అనంతరం ముఖ్య నేతలతో విడిగా సమావేశం కానున్నారు. కాగా అంతకముందు ఓ ప్రైవేటు కార్యక్రమంలో దిగ్విజయ్‌ పాల్గొన్నారు.