ఇలాగే ఉంటే ‘ప్యాకేజీ’లే అంటారు

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ ఊపందుకున్న ప్రతిసారి ఏదో పరిష్కారం చూపబోతున్నామంటూ కేంద్ర ప్రభుత్వం మీడియాకు లీకులివ్వడం పరిపాటిగా మారింది. టీ జేఏసీ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన చలో అసెంబ్లీ కార్యక్రమం తీవ్ర నిర్బంధం మధ్య కూడా విజయవంతం కావడంతో కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం దీనికి ఏదో ఒక ముగింపు ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ పరిష్కారం పదిజిల్లాల్లోని నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేది కాకుండా దానికి ప్రత్యామ్నాయాలు చూపేదిగా ఉండబోతుందని ఏఐసీసీ కార్యలయం, టెన్‌ జన్‌పథ్‌ నుంచి మీడియాకు లీకులందతున్నాయి. తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌కు ప్రత్యామ్నాయంగా తెలంగాణ ప్రాంతానికి భారీ ప్యాకేజీ ఇచ్చి దాని అమలుకు సాధికారిత కమిటీ ఏర్పాటు చేయడం, రాయలసీమ, తెలరగాణ జిల్లాలను కలిపి గ్రేటర్‌ తెలంగాణ ఏర్పాటు, తెలంగాణకు చెందిన నాయకులకు ముఖ్య పదవులు కట్టబెట్టడం లాంటివెన్నో వినవస్తున్నాయి. నాలుగు దశాబ్దాల తెలంగాణ ఉద్యమాన్ని, 12 రోజుల సీమాంధ్ర స్పాన్సర్డ్‌ ఉద్యమాన్ని కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం ఒకే ఘాటన కట్టింది. కొందరు వ్యక్తుల చేతుల్లో డబ్బులు పోసి, ఉదయం నుంచి చీకటి పడే వరకూ 12 రోజులు నడిపించిన కృత్రిమ ఉద్యమాన్ని చూసి కేంద్రం బెంబేలెత్తిపోయింది అనేకన్నా సీమాంధ్ర లాబీయిస్టుల తాయిళాలకు లొంగిందనే ఆరోపణలే నిజమని ఇప్పుడు తెలంగాణ పౌరసమాజమంతా పేర్కొంటోంది. తెలంగాణ ప్రాంతంలోని నీళ్లు, నిధులు, ఉద్యోగాలు, వనరుల దోపిడీకి అలవాటు పడ్డ సీమాంధ్ర పెత్తందారులు, వాటివల్ల బిలియనీర్ల అవతారం ఎత్తిన ఒకనాటి సామాన్యులు వాటిని దూరం చేసుకోవడానికి ఇష్టపడటం లేదు. హైదరాబాద్‌ గ్రేటర్‌ నగరంగా విస్తరించడం వల్ల ఎక్కువగా లబ్ధి పొందింది కూడా సీమాంధ్ర పెత్తందారులే. సర్కారులోని తమ ప్రాంతం పెద్దలను ప్రసన్నం చేసుకున్న సదరు వ్యక్తులు వేలాది ఎకరాల ప్రభుత్వ భూములను అప్పనంగా పొందారు. ఇప్పుడు తెలంగాణ ఏర్పడితే వారి దోపిడీకి అడ్డుకట్ట పడుతుంది. హైదరాబాద్‌ చుట్టూ విస్తరించిన ఉన్న వ్యాపార కార్యకాలపాలు ఆగిపోతాయి. నిజాం సర్కారు నుంచి బదలాయించిన భూములను స్వరాష్ట్రంలో తెలంగాణ ప్రజలు మళ్లీ వెనక్కు తీసుకోవచ్చు. ఇవన్నీ జరుగకుండా ఉండాలంటే ప్రత్యేక రాష్ట్రం ఇవ్వకూడదు. ఒకవేళ ఇచ్చినా హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలి. రంగారెడ్డి, నల్గొండ, మెదక్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాలు ఉనికిని కోల్పోవాలి. ఇదీ సీమాంధ్ర పెత్తందారుల కుట్ర. ఈ కుట్రను ఏ స్థాయిలోనైనా ఒత్తిడి తేవడం ద్వారా సాకారం చేసుకుంటున్నారు. సీమాంధ్ర రాజకీయశక్తులు, పెత్తందారులు. ఇందుకు వారికి పార్టీలు అడ్డుకావు. రాజకీయ కట్టుబాట్లు అడ్డంకి కాబోవు. పిడికెడు మంది వ్యక్తులు సామూహిక ప్రయోజనాల కోసం నాలుగున్నర కోట్ల మంది ప్రజల ఆకాంక్షను బలిపెట్టేందుకు ఎంతకైనా తెగిస్తున్నారు. ఇందుకోసం పార్టీల జెండాలు పీకి పక్కన పడేసి ఏకమవుతున్నారు. కేంద్రంలో తెలంగాణపై కాస్త కదలిక రాగానే శవాలపై రాబందులు వాలినట్లు ఢిల్లీ పెద్దల ఎదుట వాలిపోతున్నారు సీమాంధ్ర పెత్తందారులు. తెలంగాణను కొళ్లగొట్టి కూడబెట్టిన కోట్లాది రూపాయలు హస్తిన పెద్దలకు కానుకగా సమర్పించుకొని తూచ్‌ మనిపిస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీకి తెలంగాణపై మోసం చేయడం కొత్తకాదు. 1969లో ఇందిరాగాంధీ హయాంలో మొదలైన కాంగ్రెస్‌ పార్టీ దాటవేత ధోరణి, నిర్లక్ష్యపూరిత వైఖరి సోనియా, రాహుల్‌ గాంధీ హయాంలోనూ కొనసాగుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సీమాంధ్ర పాలనలో తరతరాలుగా నష్టపోయిన తెలంగాణ ప్రజానీకం స్వరాష్ట్రాన్ని, స్వపరిపాలననూ, ఆత్మగౌరవాన్ని కోరుకుంటూ తెలంగాణ సాధన కోసం పోరాడుతున్నారు. 2009లో ఈ ఉద్యమం తారస్థాయికి చేరింది. ఊరూవాడ ఒక్కటై తెలంగాణ కోసం పోరుదారిన నడిచాయి. ప్రజలంతా రోడ్లపైకే వచ్చి వంటావార్పులతో రాస్తాబంద్‌ చేశారు. పాఠశాలలు, కళాశాలలు బంద్‌ అయ్యాయి. ఉద్యోగులు కార్యాలయాలు వీడి వీధుల్లోకి వచ్చారు. పోలీసులు తప్ప తెలంగాణ జిల్లాల్లోని అన్ని శాఖల ఉద్యోగులు, కార్మికులు, వృత్తి పని చేసుకునే వాళ్లు ఉద్యమంలో భాగస్వాములయ్యారు. వారి ఆందోళనలు, పోరాటాలకు విద్యార్థులు నేతృత్వం వహించారు. పల్లెపల్లె, ఇళ్లిల్లూ ఉద్యమంలో భాగస్వామ్యం కావడంతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఆ ప్రకటన తర్వాతే సీమాంధ్ర కుట్రల రాజకీయాలు మొదలై కొనసాగుతున్నాయి. సీమాంధ్ర పాలకులు ఉద్యమంపై ఉక్కుపాదం మోపేందుకు చేయని ప్రయత్నాలు లేవు. అయినా చలో అసెంబ్లీ సక్సెస్‌ అయింది. ఈ నేపథ్యంలో కేంద్రంలో కాస్త కదలిక రాగా, దానిని అడ్డుకునేందుకు మళ్లీ సీమాంధ్ర పెత్తందారులు కుట్రలు మొదలు పెట్టారు. ఇలాంటి సమయంలో ఎవరి దారిన వారే పోతే మొదటికే మోసం వచ్చే అవకాశాలు లేకపోలేదు. ప్రజలంతా రోడ్లపైకి వచ్చి ఉద్యమాన్ని హోరెత్తించకపోతే కేంద్రం మీడియాకు ఇచ్చిన లీకులను నిజం చేసి తెలంగాణకు ప్యాకేజీ ప్రకటించి చేతులు దులుపుకోవచ్చు. ఇప్పుడు తెలంగాణ ప్రజలంతా ఏకం కావాలి. తెలంగాణను అడ్డుకునేందుకు సీమాంధ్ర నేతలు ఎలాగైతే పార్టీలు జెండాలు పక్కన బెట్టారో తెలంగాణ నేతలు అదే పద్ధతి అనుసరించాలి. లేకపోతే నాలుగు దశాబ్దాల ఆకాంక్ష సాకారం కాకుండాపోయే ప్రమాదముంది.