ఈజిప్టు విమానం హైజాక్‌ కథ సుఖాంతం

3

– మాజీ భార్య కోసం హైడ్రామా

– పోలీసుల అదుపులో హైజాకర్‌

కైరో,మార్చి29(జనంసాక్షి):  ఈజిప్టు హైజాక్‌ ఘటన ఎట్టకేలకు ముగిసింది. ఈజిప్టు విమానాన్ని హైజాక్‌ చేసిన వ్యక్తిని సైప్రస్‌ అధికారులు అరెస్టు చేశారు. ఈ మేరకు సైప్రస్‌ విదేశాంగ శాఖ ధ్రువీకరించింది. విమానంలో బందీలుగా ఉంచిన వారందరినీ అధికారులు సురక్షితంగా బయటకు పంపించారు. హైజాకర్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. 55 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బందితో అలెగ్జాండ్రియా నుంచి కైరోకు బయలుదేరిన విమానం కొన్ని గంటల్లో గమ్యాన్ని చేరుకోవాల్సి ఉండగా హైజాక్‌ అయిన సంగతి తెలిసిందే. అత్యవసర పరిస్థితుల్లో విమానాన్ని సైప్రస్‌లో దించేశారు. అలెగ్జాండ్రియా నుంచి కైరో వెళ్తున్న ఈజిప్ట్‌ ఎయిర్‌ సంస్థకు చెందిన ఎమ్‌ఎస్‌181 విమానం మంగళవారం హైజాక్‌కు గురైంది. మొదట చాలా మంది హైజాకర్లు ఉన్నారని, ఉగ్రవాద చర్యేమో అని భావించినా.. చివరకు విమానంలో ఒకే హైజాకర్‌ ఉన్నట్లు తేలింది. ఈజిప్టుకు చెందిన ఓ వ్యక్తి విమానాన్ని హైజాక్‌ చేసి, సైప్రస్‌లోని లార్నాకా విమానాశ్రయంలో ల్యాండ్‌ చేయించాడు. తొలుత హైజాకర్‌ నుంచి ఎలాంటి సమాచారం గానీ, డిమాండ్లు గానీ రాలేదు. కొద్దిసేపటికి సైప్రస్‌ అధికారులు సిబ్బంది సాయంతో హైజాకర్‌తో చర్చలు జరిపారు. దాంతో ముందు మహిళలను, చిన్నారులను విమానం నుంచి దింపేశారు. మరికొద్ది సేపటికి సిబ్బంది మినహా ప్రయాణికులందరినీ విడిచిపెట్టాడు. ఈ క్రమంలో హైజాకర్‌ తన డిమాండ్లను చెప్పేందుకు ఓ ఇంటర్‌ప్రెటర్‌ కావాలని డిమాండ్‌ చేశాడు. హైజాకర్‌ మాజీ భార్య సైప్రస్‌లో ఉంటుంది. దీంతో తన భార్యను కలవాలనుందంటూ హైజాకర్‌ ఓ లేఖను ఎయిర్‌పోర్టులోకి విసిరేశాడు. తన భార్యను చూడాలని, అందుకే హైజాక్‌ చేశానని పేర్కొన్నాడు. దీంతో అధికారులు అతడి భార్యను ఎయిర్‌పోర్టుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే కొద్ది సేపటికే తాను టర్కీ వెళ్లాలని డిమాండ్‌ చేశాడు. దీంతో అధికారుల్లో సందేహాలు మొదలయ్యాయి. ఇది ఉగ్రవాద చర్య కాదని, అతనికి అసలు ఉగ్రవాదులతో సంబంధం లేదని సైప్రస్‌ అధ్యక్షుడు నికోస్‌ అనాస్తాసియాడేస్‌ తెలిపారు. ఈజిప్టు జైల్లో ఉన్న మహిళా ఖైదీలను విడుదల చేయాలని హైజాకర్‌ డిమాండ్‌ చేస్తున్నట్లు సైప్రస్‌ విూడియా చెబుతోంది. తన పేరు సైఫ్‌ ఎల్డిన్‌ ముస్తఫా అని, తాను ఈజిప్టు మాజీ సైనికుడినని హైజాకర్‌ పేర్కొన్నట్లు విూడియా తెలిపింది. అయితే దీనిపై కైరో అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అసలు హైజాకర్‌ ఏం కావాలని డిమాండ్‌ చేస్తున్నాడో అర్థంగాక అధికారులు సతమతమయ్యారు. హైజాకర్‌ వద్ద బెల్టు బాంబు ఉన్నట్లు విమానం నుంచి సురక్షితంగా బయటకొచ్చిన ప్రయాణికులు చెప్పారు. అయితే హైజాకర్‌ ఓ పిచ్చోడిలా ప్రవర్తిస్తున్నాడని సైప్రస్‌ విదేశాంగ శాఖ చెబుతోంది. ఈ ఘటన కారణంగా సైప్రస్‌ నుంచి వెళ్లాల్సిన పలు విమానాలకు అంతరాయం ఏర్పడింది. విమానాలు ఆలస్యమవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులు ఈ విమానాన్ని హైజాక్‌ చేశారని వార్తలు రావడం.. ప్రపంచవ్యాప్తంగా అప్రమత్తత, ఆందోళన వ్యక్తమైంది. తీరా ఆరా తీస్తే.. సీఫ్‌ ఎల్డిన్‌ ముస్తాఫా అనే ఈజిప్టు వ్యక్తి  ఈ విమానాన్ని హైజాక్‌ చేసినట్టు తేలింది. తన మాజీ భార్యను చూసేందుకే ఈ ఘనుడు ఇంతటి డ్రామాకు తెరతీశాడు. మొత్తానికి హైడ్రామాకు తెరపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.