ఈపీఎఫ్‌ పన్నుపై సర్కారు వెనకడుగు

3

న్యూఢిల్లీ,మార్చి8(జనంసాక్షి):ఉద్యోగుల భవిష్య నిధి ఈ.పి.ఎఫ్‌ పై పన్ను విధించాలని వార్షిక బడ్జెట్‌ లో ప్రతిపాదించిన కేంద్రం.. దానిపై వెనక్కి తగ్గింది. ఉద్యోగులు, విపక్షాల నుంచి ఈ ప్రతిపాదనపై తీవ్ర వ్యతిరేకత రావటంతో ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ సందర్భంగా తొలిసారిగా కేంద్రం ఈ ప్రతిపాదన చేసింది. విదేశాల్లో మాదిరిగా ఉద్యోగులకు ఆర్థిక భద్రత ఉండాలనే ఉద్దేశంతో కేంద్రం ఈపీఎఫ్‌ పై పన్ను వేసే ప్రతిపాదన చేసింది. పన్ను విధించటం కారణంగా ఉద్యోగులు తన భవిష్య నిధిని తీసుకోకుండా ఉంటారని? ఈ కారణంగా వారికి ఆర్థిక భద్రత ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ తెలిపారు. విదేశాల్లో ఇలాంటి పద్దతే ఉందని ఆయన గుర్తుచేశారు. ఐతే, కేంద్రం ప్రతిపాదించిన విధానంపై ఉద్యోగులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉద్యోగులే కాకుండా విపక్షాలు సైతం ఈ ప్రతిపాదనను గట్టిగా వ్యతిరేకించాయి. ఈ.పి.ఎఫ్‌ అనేది ఉద్యోగులకు ఎంతో కీలకమైన ఆర్థిక భద్రతకు సంబంధించిన అంశమని తెలిపాయి. ఇలాంటి వాటిపై పన్ను వేయటం మధ్య తరగతి ఉద్యోగులపై భారం మోపటం లాంటిదేనని స్పష్టం చేశాయి. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే పోరాటం తప్పదని కాంగ్రెస్‌ సైతం హెచ్చరించింది. అన్ని వర్గాలను నుంచి వ్యతిరేకత రావటంతో ఆర్థిక మంత్రి జైట్లీ ఈ అంశంపై వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించారు. కానీ, ఆయన ఇచ్చిన వివరణతో ఉద్యోగ సంఘాలు సంతృప్తి చెందలేదు. దీంతో ఈ.పి.ఎఫ్‌ పై తీసుకున్న నిర్ణయం కచ్చితంగా డ్యామేజ్‌ చేస్తుందని కేంద్రం గ్రహించింది. స్వయంగా ప్రధానమంత్రి కార్యాలయం సైతం ఈ నిర్ణయంపై మరోసారి ఆలోచించాలని ఆర్థిక మంత్రిని కోరింది. ప్రధాని సైతం జైట్లీతో ఈ అంశంపై చర్చించారు. చివరగా ఈ ప్రతిపాదనను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. బడ్జెట్‌ పై చర్చ సందర్భంగా అన్ని అంశాలపై వివరణ ఇస్తానని అరుణ్‌ జైట్లీ తెలిపారు. ఈ.పి.ఎఫ్‌ లో ఏప్రిల్‌ 1 తర్వాత నుంచి దాచుకొనే మొత్తాలను వెనక్కి తీసుకోవాలనుకున్నప్పుడు 60 శాతం మొత్తం విూద ఆదాయం పన్ను చెల్లించాల్సి ఉంటుందని కేంద్రం తెలిపింది. 40 శాతంపై మాత్రం ఎలాంటి పన్ను ఉండదని ప్రకటించింది. ఈ నిర్ణయం అమలై ఉంటే దాదాపు ఆరున్నర కోట్ల మంది ఉద్యోగులపై భారం పడేది.