ఈస్ట్‌కోస్టు యాజమాన్యంపై చర్యలకు డిమాండ్‌

శ్రీకాకుళం, జూలై 17 : పర్యావరణ అనుమతులు లేకుండా నిర్మాణ పనులు చేపట్టిన ఈస్ట్‌కోస్టు ఎనర్జీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కారకాపల్లి థర్మల్‌ విద్యుత్‌ ప్రాజెక్టు వ్యతిరేక పోరాట కమిటీ డిమాండ్‌ చేసింది. సంతబొమ్మాళి మండలం కాకరాపల్లిలో ఈస్ట్‌కోస్టు ఎనర్జీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ నిర్మించతలపెట్టిన విద్యుత్తు ప్రాజెక్టుకు వ్యతిరేకంగా మూడేళ్లుగా పోరాటం చేస్తున్నామని మాజీమంత్రి తమ్మినేని సీతారాం, త్రాండ్ర ప్రకాష్‌, ఎస్‌.రామిరెడ్డి కలెక్టర్‌కు వివరించారు. కలెక్టర్‌ కార్యాలయంలో జరిగిన ఫిర్యాదుల విభాగంలో దీనిపై వినతినిచ్చారు. గత ఏడాది ఫిబ్రవరి 28న పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు రైతులు మృతి చెందిన ఘటన తరువాత కేంద్ర పర్యావరణ, అటవీశాఖ వెంటనే నిర్మాణపనులను నిలుపుదల చేసిందని పేర్కొన్నారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు పనులు చేపట్టవద్దని ఆదేశించినప్పటికి, చట్టవిరుద్దంగా పనులు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కంపిణీకి 34 అనమతులు వచ్చాయని యాజమాన్యం చెబుతందని అనుమతులు వస్తే ధ్రువపత్రాలు తమకు అందజేయాలని కోరారు. జిల్లా యంత్రాంగం తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని, లేకుంటే జరగబోయే పరినామాలకు ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుందని అన్నారు. కలెక్టర్‌ను కలసినవారిలో ఎ.హన్నూరావు, పి.పాపారావు, చారప సుందర్‌లాల్‌, నేతింటి నీలంరాజు, దువ్వాడ శ్రీనివాస్‌, అసిరయ్య తదితరులు ఉన్నారు.