ఉగ్రదాడిని ఖండించిన జమ్ము కాశ్మీర్ అసెంబ్లీ
జమ్మూ కశ్మీర్,మార్చి 22 (జనంసాక్షి):
సాంబా, కథువా జిల్లాల్లో ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ తీర్మానం చేసింది. ఉగ్రవాదుల దాడిపై కేంద్ర ప్రభుత్వం పాకిస్థాన్ ను నిలదీయాలని తీర్మానంలో కోరారు. ఇలాంటి ఘటనలు శాంతి ప్రక్రియకు విఘాతం కలిగిస్తాయని అభిప్రాయపడ్డారు. పాకిస్థాన్ శాంతిని కోరుకుంటే ఉగ్రవాదాన్ని నియంత్రించాలని ముఫ్తీ మహ్మద్ సూచించారు. ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని అసెంబ్లీలో ప్రకటించారు. శాంతి ప్రక్రియ ముందుకు సాగాలంటే పాకిస్తాన్ ఉగ్రదాడులను ఆపేయాలని ఆయన డిమాండ్ చేశారు.అంతకుముందు జమ్మూ కశ్మీర్ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలు పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. ఈ సందర్భంగా సీఎం ముఫ్తీ మాట్లాడుతూ సాంబా సెక్టార్‌లో జరిగిన దాడిని సభ ఖండించాలన్నారు. శాంతి, సామరస్యం నెలకొల్పాలంటే పాకిస్తాన్ ఉగ్రదాడులను నియంత్రించాలని ఆయన అన్నారు అప్పుడే శాంతి ప్రక్రియ ముందుకు వెళుతుందని ముఫ్తీ అభిప్రాయపడ్డారు. సరిహద్దుల్లో ఉగ్రవాదులు ఉన్నారని, వాళ్లను అడ్డుకునేందుకు మేం సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.