ఉగ్రవాదం ఉమ్మడి సమస్య

4

– ప్రధాని మోదీ

వాషింగ్టన్‌,ఏప్రిల్‌ 1(జనంసాక్షి):అణు భద్రతకు ప్రపంచ దేశాలు చాలా ప్రాముఖ్యత ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అమెరికాలో జరిగిన అణుభద్రత సదస్సులో ఆయన ప్రసంగించారు. ప్రపంచదేశాలన్నీ ఒకేలా ఆలోచిస్తున్నాయని ఈ ధోరణిలో మార్పు రావాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతి దేశం ఆ టెర్రరిస్టులు విూ దేశం వారు, వారి నుంచి మాకు ముప్పులేదు అనే తీరుగా నేతలు వ్యవహరిస్తున్నారని మోదీ విచారం వ్యక్తం చేశారు. ఉగ్రవాదంపై అన్నిదేశాల నేతలు తమ అందరి సమస్యగా భావించాలని పేర్కొన్నారు. మనం ఇంకా ఉగ్రవాదుల కోసం కంప్యూటర్స్‌, స్మార్ట్‌ ఫోన్లలో వెతుకుతున్నాం… కానీ అంతకంటే మెరుగైన విధానాలు అవలంభించాల్సిన అవసరం ఏర్పదిందని మోదీ అభిప్రాయపడ్డారు. సదస్సుకు హాజరైన ఇరవై దేశాల అగ్రనేతలను ఉద్దేశించి మరిన్ని విషయాలు ప్రస్తావించారు. ఉగ్రవాదులు 21వ శతాబ్దపు అత్యాధునికమైన ఆయుధాలు, టెక్నాలజీ వాడుతున్నారని… అయితే ప్రభుత్వాలు మాత్రం పాత పద్ధతులు, మార్గాలలోనే చర్యలు తీసుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఉగ్రవాదులకు ప్రపంచ వ్యాప్తంగా నెట్‌ వర్క్‌ ఉంటుందని, అందుకు అన్ని దేశాల నేతలు సమిష్టిగా ఈ విషయంపై దృష్టిసారించాలని సూచించారు. ప్రపంచదేశాల భద్రతకు అమెరికా అధ్యక్షుడు ఒబామా ఎంతో సేవ చేశారని మోదీ కొనియాడారు. బ్రస్సెల్స్‌ దాడుల గురించి మాట్లాడుతూ.. అణుభద్రతకు ఉగ్రవాదం పెను ముప్పుగా మారుతుందనడానికి ఇదో ఉదాహరణ అని చెప్పుకొచ్చారు.