ఉచిత గ్యాస్ సిలిండర్ పొందాలంటే అర్హతలివే

అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ‘దీపం 2.0’ కింద ఉచిత సిలిండర్‌ పథకానికి బుకింగ్స్‌ ను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. 31వ తేదీ నుంచి ఈ ఉచిత సిలిండర్లను అందిస్తున్నారు. ఈ పథకానికి తాము అర్హులమా కాదా? అనే అనుమానాలు లబ్ధిదారుల్లో వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలోని మొత్తం రేషన్‌ కార్డులతో పోలిస్తే అర్హుల సంఖ్య తక్కువగా ఉంది. ఆధార్, రేషన్‌ కార్డు, గ్యాస్‌ కనెక్షన్‌ ఆధారంగా రాయితీ వర్తింపజేస్తున్నామని.. వాటి వివరాలు లేకపోవడంతోనే అర్హుల సంఖ్య తగ్గిందని అధికారులు వివరిస్తున్నారు. రాష్ట్రంలో 1.54 కోట్ల గృహ వినియోగ వంటగ్యాస్‌ కనెక్షన్లు ఉంటే.. తాత్కాలిక అంచనా ప్రకారం ఉచిత సిలిండర్‌కు 1.08 కోట్ల కనెక్షన్లు అర్హత పొందాయి. కానీ, రేషన్‌ కార్డులు 1.48 కోట్లు ఉన్నాయి. కొంత మందికి గ్యాస్‌ కనెక్షన్, రేషన్‌ కార్డులున్నా.. ఆధార్‌ ఇవ్వకపోవడంతో అర్హత పొందలేకపోయారు. వీరంతా ఆధార్‌ అనుసంధానించుకుంటే ‘దీపం 2.0’ పథక అర్హుల సంఖ్య పెరుగుతుంది.  ఈ పథకం విషయంలో ఏవైనా సమస్యలు ఉంటే 1967 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి కూడా తెలుసుకోవచ్చు.
ఉచిత సిలిండర్ పొందాలంటే ఇవి ఉండాల్సిందే..
– వంటగ్యాస్‌ రాయితీ పొందాలంటే రేషన్‌ కార్డు, ఆధార్, గ్యాస్‌ కనెక్షన్‌ తప్పనిసరి.
– కుటుంబ సభ్యులలో ఎవరి పేరుమీద కనెక్షన్‌ ఉందో.. ఆ వ్యక్తి పేరు రేషన్‌ కార్డులో ఉంటే రాయితీ వస్తుంది.
– భార్య పేరుతో రేషన్‌ కార్డు, భర్త పేరుతో గ్యాస్‌ కనెక్షన్‌ ఉన్నా అర్హులే.
– ఒక రేషన్‌ కార్డులోని సభ్యుల పేర్లతో రెండు/మూడు కనెక్షన్లున్నా.. ఒక్క కనెక్షన్‌కే రాయితీ వర్తిస్తుంది.
– టీడీపీ హయాంలో ఇచ్చిన దీపం కనెక్షన్లకూ కూడా ‘దీపం 2.0’ పథకం వర్తిస్తుంది.
– గ్యాస్‌ రాయితీ జమ కావాలంటే ఈ కేవైసీ తప్పని సారిగా పూర్తి చేసుకోవాలి.
– ఈ ఉచిత సిలిండర్ ను ఆన్‌లైన్‌లో లేదా డీలర్‌ వద్దకెళ్లి బుక్‌ చేసుకోవచ్చు.
– సిలిండర్‌ డెలివరీ అయిన 48 గంటల్లో ఇంధన సంస్థలే రాయితీ డబ్బును లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తాయి.
– సమస్యలుంటే 1967 (టోల్‌ ఫ్రీ) నంబరుకు ఫోన్‌ చేయొచ్చు.
– ఇతర వివరాల కోసం గ్రామ/వార్డు సచివాలయాల్లో, తహసీల్దారు కార్యాలయాల్లో పౌర సరఫరాల అధికారుల్ని సంప్రదించవచ్చు.
ఉచిత గ్యాస్ సిలిండర్(దీపం 2.0)కు  రాయితీ పొందేందుకు ఈ కేవైసీ తప్పనిసరి అని ఇంధన సంస్థల డీలర్లు స్పష్టం చేస్తున్నారు. దీంతో లబ్ధిదారులు పెద్దఎత్తున గ్యాస్‌ డీలర్ల వద్దకు వెళ్తుండటంతో అక్కడ రద్దీ మొదలైంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యపై దృష్టి సారించాలి. గతంలో కూడా గ్యాస్‌ సిలిండర్‌ డెలివరీ సమయంలో ఈ కేవైసీ తీసుకోవాలనే ప్రతిపాదన వచ్చింది. తర్వాత దాన్ని అమలు చేయలేదు. ఇప్పటికైనా ఆ విధానం అమలయ్యేలా చూడాలి. గ్రామ/వార్డు సచివాలయ సిబ్బందితో అయినా ఈ కేవైసీని పూర్తి ఈ కేవైసీ తిప్పలు లేకుండా చూడాలని లబ్ధిదారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.