ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన

5

– 9 మంది ఎమ్మెల్యేలకు రూ.1000 కోట్లు ఇచ్చారు

– ఉత్తరాఖండ్‌ సీఎం హరీశ్‌ రావత్‌

డెహ్రాడూన్‌,మార్చి27(జనంసాక్షి): ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన అమలుకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ పచ్చజెండా వూపారు. రాజకీయ అనిశ్చితి కొనసాగుతున్న ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమలు చేయాలని కేంద్ర మంత్రివర్గం చేసిన సిఫార్సుకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు.

అసలేం జరిగిందంటే..

ఇటీవల ఉత్తరాఖండ్‌లో రాజకీయ అనిశ్చితి నెలకొన్న విషయం తెలిసిందే. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 9మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి, భాజపాకు మద్దతు పలికారు. దీంతో హరీశ్‌ రావత్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం సంక్షోభంలో పడిపోయింది. మరోవైపు తిరుగుబాటు ఎమ్మెల్యేలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి భాజపా సిద్ధమైంది. ఈ నేపథ్యంలో రెండు పార్టీల మధ్య రాజకీయ వివాదం నెలకొంది.

ఇదిలా ఉంటే.. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద స్పీకర్‌ గోవింద్‌సింగ్‌ కుంజ్వాల్‌ తిరుగుబాటు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. అయితే ఈ నోటీసులపై స్టే విధించాలంటూ ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించగా.. వారి వినతిని న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర అనిశ్చితి ఏర్పడటంతో గవర్నర్‌ రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేశారు. దాంతో రాష్ట్ర శాసనసభని సుప్తచేతనావస్థలో ఉంచుతూ రాష్ట్రపతిపాలన విధించారు.

9 మంది ఎమ్మెల్యేలకు వెయ్యి కోట్లు ఇచ్చారు’

ఉత్తరాఖండ్‌ ప్రభుత్వాన్ని, రాష్ట్ర గవర్నర్‌ పై కేంద్రంలోని నరేంద్‌ మోదీ సర్కారు బెదిరింపులకు పాల్పడిందని ముఖ్యమంత్రి హరీష్‌ రావత్‌ వ్యాఖ్యానించారు. 9 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలకు భారీగా ముడుపులు ముట్టాయని, రూ.1000 కోట్లకు పైగా చేతులు మారాయని ఆయన ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తమ పార్టీ నేతలను ప్రలోభపెట్టిందని, తమ ప్రభుత్వాన్ని కూల్చేయడానకి విశ్వప్రయత్నాలు చేసిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలకు ఇక భవిష్యత్తు ఉండదని వారి రాజకీయ జీవితానికి తెరపడినట్లేనని అభిప్రాయపడ్డారు.ఉత్తరాఖండ్‌ లో రాష్ట్రపతి పాలన విధించడం, అందుకు దారితీసిన పరిస్థితులపై ఆయన చాలా ఆగ్రహంగా ఉన్నారు.  కేంద్ర కేబినెట్‌ రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్‌ కు శనివారం సిఫార్స్‌ చేయగా, ఈ విషయాన్ని గవర్నర్‌, రాష్ట్రపతికి సిఫార్సు చేశారు. రాష్ట్రపతిపాలన విధిస్తున్నట్లు ప్రణబ్‌ ముఖర్జీ ఆదివారం నిర్ణయాన్ని ప్రకటించారు.గత రెండు రోజులుగా బీజేపీ కారణంగా రాష్ట్ర రాజకీయాల్లో ఎన్నో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని, బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ చర్యల వల్ల ఇలా జరిగిందని రావత్‌ ఆరోపించారు. 2014 ఫిబ్రవరిలో తాను అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మా ప్రభుత్వాన్ని కూల్చేయాలని బీజేపీ కుట్రలు పన్నిందని, మెజారిటీ సంఖ్యా బలం ఉన్నప్పటికీ ఈ విధంగా జరగడంపై సీఎం హరీష్‌ రావత్‌ విచారం వ్యక్తంచేశారు.