ఉత్తరాఖండ్ అడవుల్లో కార్చిచ్చు
ఉత్తారాఖండ్,మే1(జనంసాక్షి):దావానలంతో ఉత్తరాఖండ్ అడవులు దహించుకుపోతున్నాయి. 88 రోజుల క్రితం ప్రారంభమైన కార్చిచ్చు ఇంతవరకు ఏడుగురి ప్రాణాలను కబళించింది. మూడువేల ఎకరాల్లో అడవులు ఆహుతయ్యాయి. జంతువులతోపాటు, పర్యావరణంపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ కార్చిచ్చు వెనుక కలప మాఫియా హస్తం ఉందని అనుమానిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో స్వల్పంగా ప్రారంభమైన మంటలు ఇప్పుడు అదుపు చేయలేని స్థాయికి చేరాయి. తొలుత చిన్న మంటలే కదా… వాటంతట అవే ఆరిపోతాయన్న అటవీ శాఖ అధికారుల మితివిూరిన విశ్వాసం ఇప్పుడు ప్రమాదకర స్థాయికి చేర్చింది.
ఎనిమిది జిల్లాలో అడవులు సర్వనాశం…
ఫిబ్రవరిలో మంటలను గర్తించినప్పుడే నియంత్రణ చర్యలు చేపట్టి ఉంటే ఇప్పుడీ పరిస్థితి వచ్చేది కాదని అంటున్నారు. మొదట ఒక ప్రాంతంలో ప్రారంభమైన కార్చిచ్చు 1200 ప్రాంతాలకు విస్తరించింది. ఉత్తరాఖండ్ అడవుల్లో ఫిబ్రవరి నుంచి 922 అగ్నిప్రమాదాలను గుర్తించారు. క్రమక్రమంగా విస్తరించిన బడబాగ్ని ఎనిమిది జిల్లాలలోని అడవులను సర్వనాశనం చేసింది. చమోలి, పౌరి, రుద్రప్రయాగ, తెహ్రీ, ఉత్తరకాశీ, అల్మోరా, పితోర్‌గఢ్, నైనీటాల్ జిల్లాల్లోని వనాలు కార్చిచ్చు ప్రభావానికి గురయ్యాయి. ఎనభై ఎనిమిది రోజులుగా ప్రజ్వరిల్లుతోన్న దావాగ్నికి వేలాది ఎకరాల అడవులు కాలి బూడిదయ్యాయి. వీటిలోని ఎన్నో ఫల, పుష్ప, వృక్ష, జీవ, జంతు జాతులు నాశనమయ్యాయి. ఆరువేల మంది సిబ్బంది ప్రయత్నిస్తున్నా… కార్చిచ్చు అదుపులోకి రావడంలేదు. వీరిలో మూడు కంపెనీల జాతీయ విపత్తు స్పందన బృందాల సభ్యులు, రాష్ట్ర విపత్తుల స్పందన బృందాల సభ్యులు, సైనికులు కూడా ఉన్నారు. మంటలను ఆర్పేందుకు ఓఎ-17 హెలికాప్టర్లను కూడా రంగంలోకి దింపారు. నైనీటాల్ సవిూపంలోని భీమ్‌టాల్, పౌరీ జిల్లాల్లో వీటిని అందుబాటులో ఉంచారు.మంటలు ఆర్పేందుకు హెలికాప్టర్ బృందాలు చేసిన ప్రయత్నం విఫమయ్యింది. దావానలంతో అటవీప్రాంతమంతా దట్టమైన పొగలు వ్యాపించడంతో హెలికాప్టర్ల ద్వారా నీరు వెదజల్లేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు. పొగల కారణంగా సెగలు రగులుతున్న ప్రదేశాలను గుర్తించడం కష్టం కావడంతో హెలికాప్టర్లు వెనుతిరిగాయి.
కేంద్రం దృష్టి..
రద్రప్రయాగ జాతీయ రహదారి వెంబడి కార్చిచ్చును అదుపు చేసేందుకు ఆర్మీ అగ్నిమాపక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నా… మంటలు అదుపులోకి రావడంలేదు. ఉత్తరాఖండ్ అడవుల్లో మంటలు అంతకంతకు విస్తరిస్తుండటంతో కొత్త ప్రాంతాలకు దావానలం వ్యాప్తికి సంబంధించిన సమాచారాన్ని అందించేందుకు ఉపగ్రహం సహాయంతో అలారాన్ని ప్రారంభించారు. దీని ఆధారంగా ఏయే ప్రాంతాలకు మంటలు విస్తరిస్తున్నాయన్న సమాచారాన్ని సంక్షిప్త సందేశాల ద్వారా సంబంధిత అధికారులకు చేరవేస్తున్నారు. ఉత్తరాఖండ్ కార్చిచ్చుపై కేంద్రం దృష్టి సారించింది. ప్రమాద ఘంటికల తీవ్రతను గుర్తించిన పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవ్‌దేకర్… అగ్నిమాపక చర్యలకు 5 కోట్ల రూపాయలు కేటాయించినట్టు ప్రకటించారు. ప్రధాన మంత్రి కార్యాలయంతోపాటు ¬ంమంత్రిత్వ శాఖ అధికారులు కూడా ఎప్పటికప్పడు కార్చిచ్చు ప్రభావాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఈ దావానలం వెనుక టింబర్ మాఫియా హస్తం ఉండొచ్చని అనుమానిస్తున్న అధికారులు ముందుగా మంటలను అదుపు చేయడం పైనే దృష్టి పెట్టారు. కార్చిచ్చు పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాత దీనికి ఎవరు కారకులన్న అంశంపై దృష్టి పెడతామని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవ్‌దేకర్ చెప్పారు. అయితే మంటలు ఎప్పుడు అదుపులోకి వస్తాయన్న అంశంపై ఎవరూ స్పష్టత ఇవ్వలేకపోతున్నారు.