ఉద్యమంపై సీమాంధ్ర మీడియా కుట్రలు
తెలంగాణ ప్రజల ఆకాంక్షల సాధన కోసం సాగుతున్న ఉద్యమాన్ని అణచివేయడానికి శాయశక్తులా ప్రయత్నించినా సీమాంధ్ర పాలకులు, పెత్తందారులు, వారి చేతిలోని మీడియా తమ ఆటలు సాగకపోవడంతో ఇప్పుడు ఉద్యమాన్ని బజారుకీడ్చే కుయత్నాలకు పాల్పడుతోంది. ఎలాగైనా ఉద్యమాన్ని పలచన చేసి ప్రజల దృష్టిలో చులకన భావం ఏర్పడేలా చూడాలని కుతంత్రాలు సాగిస్తోంది. ఈ కుట్రలు, కుతంత్రాల ఫలితంగానే ఓ సీమాంధ్ర పెత్తందారికి ఒప్పటి బినామీగా చెప్పుకునే వ్యక్తి, ప్రస్తుతం తనకుతానుగా ఎంతో సచ్చీలుడిని అని నిత్యం చెప్పుకునే వ్యక్తి చానెల్‌లో ఉదయం నుంచి రాత్రి వరకూ ప్రసారమైన వరుస కథనాలు. హైదరాబాద్‌లోని ఓ భూ దందాకు మొత్తం తెలంగాణ ఉద్యమానికి ముడిపెట్టే దుష్ట యత్నం చేసింది సదరు చానెల్. తెలంగాణ ఉద్యమం అంటేనే టీఆర్‌ఎస్ అధినేత కె. చంద్రశేఖర్‌రావు అనే దురభిప్రాయాన్ని ఇప్పటికే సీమాంధ్ర ప్రజల్లో చొప్పించిన సదరు మీడియా ఇప్పుడు ఆయన కుమారుడిని సెటిల్‌మెంట్ల కింగ్‌గా చూపే ప్రయత్నం చేసింది. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వచ్చి చేరాడే తప్ప ఆయన పోరాటాన్ని మొదలు పెట్టలేదు. రాజకీయ భాగస్వామి టీఆర్‌ఎస్ అయింది కాబట్టి ఓట్లు.. సీట్ల రాజకీయాలతో రాష్ట్ర ప్రజలందరి దృష్టిలో పడింది కానీ తెలంగాణ ఉద్యమ నిర్మాతలు ప్రజలే. ప్రజల్లోంచి పెల్లుబిన తెలంగాణ ఉద్యమం నాలుగు దశాబ్దాలుగా జ్యోతిలా ప్రజ్వరిల్లుతోంది. ఎవరికి వారే తెలంగాణ పేరు చెప్పుకుని రాజకీయంగా పబ్బం గడుపుకునే ప్రయత్నం చేశారే తప్ప వారేమి ఉద్యమాన్ని ప్రారంభించలేదు. 1969 నుంచి ఇప్పటి వరకూ సాగుతున్న ఉద్యమంలో మొదటి వరుసలో నిలిచేది విద్యార్థులే. ఉద్యోగులు, ప్రజాసంఘాల పాత్ర తక్కువేమి కాదు. రాజకీయ పక్షాలు ఉద్యమమనే గూడులో వచ్చి చేరాయి. కానీ తెలంగాణ ఉద్యమం మొత్తాన్ని కేసీఆర్‌తో ముడిపెట్టిన సీమాంధ్ర మీడియా ఆయన కుటుంబాన్ని అప్రతిష్ట పాలు చేయడం వల్ల మొత్తం తెలంగాణవాదాన్నే నిర్వీర్యం చేసే ప్రయత్నం చేసింది. ప్రత్యేకించి కేటీఆర్‌పై కథనాలు వండి వార్చిన సదరు చానెల్‌కు తెలంగాణ ఉద్యమం జోరుగా సాగుతున్న సమయంలో ప్రజల దృష్టిని మరల్చే కథనాలు ప్రసారం చేయడంలో ప్రత్యేక స్థానమే ఉంది. 2009లో తెలంగాణ ఉద్యమం జోరుగా సాగుతున్న సమయంలో రాజ్ భవన్‌లో అప్పటి గవర్నర్ ఎన్‌డీ తివారీపై ఓ మసాలా కథనాన్ని వండి వార్చింది. ఆ కథనం ద్వారా తన స్వీయ బలహీనతను చాటుకునే ప్రయత్నమూ చేసింది. వ్యక్తుల ఆలోచన తీరు ఎలా ఉంటే వ్యవస్థల పనితీరు అలాగే ఉంటుంది. మసాలా కథనాలకు పెట్టింది పేరైనా చానెల్‌గా పేరు రావడం వెనుక ఆ వ్యవస్థను నడుపుతున్న వ్యక్తుల బలహీనతలు స్పష్ట మవుతున్నాయి. తివారీపై ప్రసారం చేసిన కథనం తెలంగాణ ఉద్యమం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు చేసిందనేనని తర్వాతికాలంలో వికీలీక్స్ బట్టబయలు చేసింది. దానికి ఇప్పటి వరకూ సదరు చానెల్ యాజమాన్యం సమాధానమే చెప్పలేదు. ఇప్పుడూ తెలంగాణ ఉద్యమం హోరెత్తుతోంది. తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన చలో అసెంబ్లీని అడ్డుకునేందుకు సీమాంధ్ర సర్కారు పన్నిన కుట్రల తర్వాత పది జిల్లాల ప్రజల తమ ఆకాంక్షల సాధన కోసం పోరు దారిన నడిచేందుకు ఉద్యుక్తమవుతున్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కారు పెట్టిన తీవ్ర నిర్బంధాన్ని, ఐదంచెల భద్రతా వలయాలను ఛేదించుకొని తెలంగాణవాదులు రాష్ట్ర శాసన సభ ఎదుట టీ జేఏసీ జెండాతో జై తెలంగాణ అని నినదించారు. తీవ్ర నిర్బంధాన్ని, అణచివేత, భద్రత వలయాలను దాటుకొని తెలంగాణవాదులు అసెంబ్లీ వైపు దూసుకురావడంతో సీమాంధ్ర సర్కారుకే కాదు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికీ దిమ్మ తిరిగింది. దీంతో తెలంగాణ సమస్యకు ఏదో ఒక ముగింపు పలకాలని ప్రయత్నిస్తోంది. ఇందులో బాగంగానే తెలంగాణకు ప్రత్యేక అభివృద్ధి మండలి, ప్యాకేజీ, గ్రేటర్ తెలంగాణ, రెండో ఎస్సార్సీ అంటూ మీడియాకు లీకుల మీద లీకులిస్తోంది. ఏ లీకు వల్ల ఎలాంటి ప్రతిస్పందన వస్తుంది అనేది క్షుణ్నంగా అధ్యయనం చేస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఉద్యమంపై మళ్లీ విషం చిమ్మే ప్రయత్నాన్ని సీమాంధ్ర మీడియా తన భుజాలపైకి ఎత్తుకుంది. అందులో భాగంగానే హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు బిల్డర్ల మధ్య నెలకొన్న వివాదాన్ని కేటీఆర్‌కు, టీఆర్‌ఎస్‌కు చెందిన మరో ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డికి అంటగట్టింది సదరు చానెల్. ఈ వ్యవహారం ఇప్పుడే వెలుగు చూసింది కాదు గత ఫిబ్రవరిలో జరిగింది. ఈ విషయాన్ని సదరు చానెలే పేర్కొంది. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఎందుకు బయటపెట్టలేదు. ఎవరితోనైనా ఏదైనా లాలూచీకి ప్రయత్నించారా? లేదా ఇంకేదైనా ప్రయోజనాలు నెరవేర్చుకునేందుకు ఇంతకాలం తొక్కిపెట్టారా? అనే ప్రశ్నలను తెలంగాణ ప్రజలు సంధిస్తున్నారు. కేటీఆర్, ఏనుగు రవీందర్, మందా జగన్నాథంను ఈ వ్యవహారంలో దోషులుగా చూపి మొత్తం తెలంగాణ ఉద్యమానికే మకిలి అంటించే ప్రయత్నం చేసింది సదరు చానెల్. కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు ఆ పార్టీని వ్యతిరేకించే వారంతా పోలోమని ఫోన్‌లైన్లలోకి, లైవుల్లోకి వచ్చి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేశారు. ఈ మొత్తం ఎపిసోడ్‌లో సూత్రదారి సదరు చానెల్ అయినా తెరవెనుక అనేక మంది పాత్రదారులు ఉన్నారనడంలో ఎలాంటి సందేహం అక్కరలేదు. కేటీఆర్‌పై ప్రసారమైన కథనాలతో ఆ పార్టీ శ్రేణులు ఆగ్రహించి దాడులకు దిగితే తెలంగాణ ఉద్యమంలో హింస ఉందనే మరో తప్పుడు ప్రచారం కూడా చేసుకోవచ్చనేది సీమాంధ్ర పెత్తందారుల దింపుడుకళ్లం ఆశ. సీమాంధ్ర పెత్తందారులకు తెలంగాణ ఏర్పాటు వల్ల నష్టం, ఆ నష్టాన్ని ముందే ఊహించిన సదరు పెత్తందారులు 2009 నుంచి ఇప్పటి వరకు చేయని కుతంత్రాలు, కుట్రలు లేవు. తెలంగాణ ఉద్యమంపై, ఉద్యమ నాయకులపై విషం చిమ్మడం ద్వారా ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను పలుచన చేయాలనేది సీమాంధ్ర పాలకులు, పెట్టుబడిదారులు, మీడియా ప్రయత్నం. అలాంటి ప్రయత్నాలు ఎంతోకాలం సాగబోవు. కావాలని తెలంగాణ ఉద్యమంపై బురద చల్లాలనే ప్రయత్నాలకు సమాధానం ఇచ్చి తీరుతుంది.