ఉద్యోగుల వాణి వినిపిస్తా
సమరశీలంగా పోరాడతా
దేవీప్రసాద్
హైదరాబాద్,మార్చి2(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర సాధనలో తనతోపాటు ఉద్యమంలో పాల్గొన్న ఉపాధ్యాయులను మరువలేనని ఎమ్మెల్సీ పట్టభద్ర అభ్యర్థి దేవీప్రసాద్ అన్నారు. ఉద్యోగి కంటే పట్టభద్రుల ప్రతినిధిగా మరింత సేవలు అందించేందుకు అవకాశాలు ఉన్నందునే పోటీలోకి దిగానని అన్నారు. ఉద్యమంలో పోషించిన పాత్రనే ఇకముందు కూడా పోషించి సమస్యలను వినిపిస్తానని అన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ పట్టభద్రుల తెరాస అభ్యర్థిగా పోటీ చేస్తున్న దేవీ ప్రసాద్‌కు తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ సంఘం మద్దతు ప్రకటించింది. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న దేవీప్రసాద్‌ను పార్టీ పరంగా పరిగణించకుండా ఆయన వ్యక్తిత్వం, పోరాటతత్వం తెలిసినందునే మద్దతు ఇస్తున్నామని పేర్కొన్నారు. ఇదిలావుంటే తెలంగాణ డీఈడీ, బీఈడీ విద్యార్థి సమాఖ్య ఆవిర్భవించింది. నగరంతో పాటు తెలంగాణ జిల్లాల్లో డీఈడీ, బీఈడీ విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు ఈ సమాఖ్యను ఏర్పాటు చేశారు. ఈ విద్యార్థి సమాఖ్యకు అధ్యక్షుడిగా కొండా గణెళిష్, ఉపాధ్యక్షులుగా శేఖర్, మస్తాన్, రమేష్, ప్రధానకార్యదర్శిగా వరుణ్, కార్యనిర్వాహక కార్యదర్శిగా నగేష్‌లతో పాటు 30మంది కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.