ఉన్నతాశయంతో విద్యార్థులు ముందుకు వెళ్ళాలి
వినుకొండ, జూలై 16 : ప్రతి విద్యార్థి ఉన్నత ఆశయంతో ముందుకు వెళితే అనుకున్న లక్ష్యం సాధించవచ్చని యువశక్తి ఫౌండేషన్ చైర్మన్ లీలావతి సోమవారం ఇక్కడ అన్నారు. పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో మూడు రోజులుగా జరిగిన 20, 20 ముగింపు సభకు ఆమె ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ లీడ్ ఇండియా కార్యక్రమం విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు దోహదపడుతుందని అన్నారు. ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో మెలిగితే ఉన్నత ఆశయాలు సాధించవచ్చని అన్నారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.