ఉపసభాపతి కంటతడి

1

హైదరాబాద్‌,మార్చి22(జనంసాక్షి): తెలంగాణ శాసనసభలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే డీకే అరుణ చేసిన వ్యాఖ్యలకు డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డి కంటతడి పెట్టారు. సంస్కారం లేని వారు సభ నడుపుతున్నారని డీకే అరుణ వ్యాఖ్యానించారు. అరుణ వ్యాఖ్యలతో పద్మా దేవేందర్‌రెడ్డి తీవ్ర ఉద్విగ్నతకు లోనయ్యారు. మనస్తాపంతో కన్నీరు పెట్టుకున్నారు. సంస్కారం లేనివాళ్లు సభ నిర్వహిస్తున్నారని కాంగ్రెస్‌ నేత డీకే అరుణ చేసిన వ్యాఖ్యలపై మనస్థాపం చెందిన డిప్యూటీ స్పీకర్‌ సభలోనే కంటతడి పెట్టారు. స్పీకర్‌ను మనస్థాపానికి గురిచేసిన వ్యాఖ్యలపై డీకే అరుణ క్షమాపణ చెప్పాల్సిందే అంటూ అధికార సభ్యులు డిమాండ్‌ చేయడంతో సభలో కొద్దిసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది.  సంస్కారం లేని వారు సభ నడుపుతున్నారు అనడం సంస్కారమా అని మంత్రి హరీష్‌రావు ప్రశ్నించారు. ఆ వ్యాఖ్యలు చేసిన డీకే అరుణతో క్షమాపణ చెప్పించాలని డిమాండ్‌ చేశారు. క్షమాపణ చెప్పకపోతే సస్పెండ్‌ చేయడానికి వెనుకాడమని స్పష్టం చేశారు. ఏపీ శాసనసభలో ఏం జరిగిందో అందరికీ తెలుసు అని చెప్పారు.  కాంగ్రెస్‌ వారు తక్కువ మంది ఉన్నా.. మాట్లాడానికి సమయం ఎక్కువ ఇచ్చామని తెలిపారు. ఒక మహిళ పట్ల ఇలాగే ప్రవర్తిస్తారా అని ప్రశ్నించారు. చైర్‌లో ఉన్న వారిపట్ల అలా మాట్లాడటం సరైంది కాదన్నారు. వ్యాఖ్యలు ఉపసంహరించుకుని బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు. గతంలో పదం జారితే మంత్రులమే క్షమాపణ చెప్పాం.. అది మా సంస్కారమని మంత్రి గుర్తు చేశారు. క్షమాపణ చెప్పాలా వద్దా.. అనేది డీకే అరుణ విచక్షణకే వదిలేస్తున్నానని పద్మా దేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. దీనిపై స్పందించిన డీకే అరుణ… అసలు తాను ఆ మాట అనలేదని ఒక మాట, ఛైర్‌ ను ఉద్దేశించి అనలేదని ఇంకోసారి అన్నారు. చివరకు సంస్కారం లేని వారు సభ నడుపుతున్నారనే మాట మాట్లాడారా? లేదా? చివరి సారిగా చెప్పండని డిప్యూటీ స్పీకర్‌ ప్రశ్నించగా.. మాట్లాడలేదని అరుణ సమాధానమిచ్చారు. అనంతరం సభ ఆ అంశాన్ని వదిలేసి సబ్జెక్టుపై చర్చ ప్రారంభించింది. అయితే  డిప్యూటీ స్పీకర్‌పై చేసిన వ్యాఖ్యలకు గాను డీకే అరుణ బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిందే అని మంత్రి హరీష్‌రావు అన్నారు. సంస్కారం లేని వారు సభ నడుపుతున్నారని డీకే అరుణ అన్నారు…సంస్కారం లేనిది ఆ వ్యాఖ్యలు చేసిన వారికా లేక సభ నడుపుతున్నవారికా అని హరీష్‌ ప్రశ్నించారు. సభ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. హుందాగా సభ నడుపుతున్న వారిపై అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. డీకే అరుణ తన వ్యాఖ్యలపై భేషరతుగా క్షమాపణ చెప్పాలని మంత్రి హరీష్‌ డిమాండ్‌ చేశారు. ఛైర్‌కు గౌరవం ఇవ్వడం నేర్చుకోవాలన్నారు.