ఎండాకాలం నీటిఎద్దడి లేకుండా చూడండి

5
అధికారులతో మంత్రి కేటీఆర్‌ సమీక్ష

హైదరాబాద్‌ ఏప్రిల్‌ 6 (జనంసాక్షి): ఎండాకాలంలో తాగునీటి ఎద్దడి లేకుండా అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని పంచాయితీరాజ్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ సూచించారు. సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో మంత్రి కేటీఆర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రాష్ట్రంలో విద్యుత్‌ కోతలు లేనందున వేసవిలో తాగునీటి సమస్యలు లేకుండా చూడాలని కలెక్టర్లకు మంత్రి ఆదేశించారు. తెలంగాణలో విద్యుత్‌ సరఫరా పెరిగిందని ఆయన అన్నారు. తాగునీటి సమస్య నివారణకు ప్రభుత్వం రూ.263 కోట్ల నిధులను కేటాయించిందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఈ నిధులతో గ్రామాల్లో సమస్య రాకుండా చూడాలని అన్నారు. అవసరమైతే మరిన్ని నిధులు ఇస్తామని మంత్రి చెప్పారు. గ్రామాల్లో తాగునీటి సరఫరా తీరుపై ప్రతిరోజు నివేదికలు తెప్పించుకుని అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. ఆర్డబ్ల్యూఎస్‌ సమన్వయంతో తాగునీటి సరఫరా చేయాలని కేటీఆర్‌ చెప్పారు. గతంలో ఉపయోగించిన ప్రైవేట్‌ బోరు బావుల బకాయిలు చెల్లిస్తం అని హావిూ ఇచ్చారు. అందుబాటులో ఉన్న అన్ని నీటి వనరులను ఉపయోగించుకోవాలని సూచించారు. పంటలు వేయని రైతుల నుంచి ప్రైవేట్‌ బోరు బావులను తీసుకోవాలని అన్నారు. అవసరమైతే జనావాసాలకి ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేయాలని మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. జిల్లా యంత్రాంగం రూపొందించిన గ్రామస్ధాయి వేసవి తాగునీటి ప్రణాళికను కచ్చితంగా అమలు చేయా చెప్పారు. తాగునీటి సరఫరాకు నిధులు, విద్యుత్‌ అందుబాటులో ఉన్నందున రాబోయే రెండు నెలలు జిల్లా యంత్రాంగం చురుగ్గా పనిచేయాలని మంత్రి సూచించారు. జిల్లాల్లో ఉపాధి హావిూ పథకాన్ని మరింత వేగంగా అమలు చేయాలని కేటీఆర్‌ అధికారులకు ఆదేశించారు. అన్ని గ్రామాల్లోనూ ఉపాధి హావిూ పనులు ప్రారంభించాలని, దీని కోసం ఎంపీడీవోలు చురుగ్గా పని చేయాలని అన్నారు. తెలంగాణలో కొంత కరువు పరిస్ధితులు ఏర్పడిన నేపథ్యంలో ఉపాధి హావిూ పనుల ద్వారా ప్రజలకు ఉపశమనం కలుగుతుందని కేటీఆర్‌ చెప్పారు. ఉపాధి పనులు కోసం అడిగిన ప్రతి ఒక్క అర్హునికి జాబ్‌ కార్డు ఇవ్వాలని ఆదేశించారు. ఏప్రిల్‌ 9,10న జరగనున్న సమావేశానికి పూర్తి ప్రగతి నివేదికతో కలెక్టర్లు రావాలని మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు.