ఎందుకు దాచిపెట్టాలని చూస్తున్నారు?
ఉత్తరాఖండ్‌లో సంభవించిన పెను విపత్తుకు కారణం మానవ తప్పిదమేనా? అనే సందేహాలు రోజు రోజుకు బలపడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో ఈ అనుమానాలు రోజు రోజుకు బలపడుతున్నాయి. వరుణుడు సృష్టించిన పెను ఉత్పాతానికి ఇప్పటి వరకు ఐదు వేల మందికిపైగా మృత్యువాత పడ్డారని సమాచారం. వారిలో వెయ్యి మృతదేహాలను ఇప్పటి వరకూ స్వాధీనం చేసుకోలేదు. ఎంతమంది గంగలో కలిసిపోయారో? ఎన్ని దేహాల కొండ చరియల శిథిలాల కింద సమాధయ్యాయో లెక్క తెలియని పరిస్థితి. జల ప్రళయం సృష్టించే నాటికి చార్‌ధామ్‌లో అసలు ఎంత మంది యాత్రీకులున్నారో కూడా తెలియదు. వివిధ రాష్ట్రాల నుంచి చార్‌ధామ్ యాత్రకు వెళ్లిన ట్రావెల్ ఏజెన్సీలు, ఇతర వాహనాల ఆధారంగా లెక్కలు కట్టుకోవడం మినహా స్పష్టమైన లెక్కలు లేవు. ప్రముఖ శైవ క్షేత్రంగా పేరున్న కేదార్‌నాథ్‌లో జలప్రలయం ధాటికి గర్భగుడి మినహా ఏమీ మిగల్లేదు. ఒక్కసారిగా ముంచెత్తిన వరదల్లో వందలాది మంది కొట్టుకుపోవడం తాను ప్రత్యక్షంగా చూశానని కేదార్‌నాథ్ ఆలయ పూజారి పేర్కొన్నాడు. జలయ ప్రళయానికి ఉత్తరాఖండ్‌లో 500 రోడ్లు కోతకు గురయ్యాయి. 200లకు పైగా వంతెనలు పనికి రాకుండా పోయాయి. ధారాసు లోయ, గంగోత్రి, ఉత్తరకాశీ, కేదార్‌నాథ్ మృత్యు గుహలుగా మారాయి. కేదార్‌నాథ్‌లో శవాలు గుట్టలుగా పడి ఉండటాన్ని సైన్యం గుర్తించింది. గర్భగుడి లోపల, వెలుపల కూడా మృతదేహాలు పడి ఉన్నాయి. ఎటు చూసినా నీళ్లు.. చెల్లా చెదరుగా పడి ఉన్న మృతదేహాలు, సాయం కోసం ఆర్తనాదాలు. ఉత్తరాఖండ్ శ్మశానాన్ని తలపిస్తోంది. దేశ చరిత్రలో ఏ జల విపత్తు ఇంతటి జన నష్టాన్ని కలిగించలేదు. రోడ్లు, వంతెనలు, భవనాలను ఇంతగా దెబ్బతీయలేదు. గంగ ప్రవాహాగ్నికి భవంతులు పేక మేడల్లా కూలిపోయాయి. ఇప్పటి వరకూ 80 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని సైన్యం, ఉత్తరాఖండ్, కేంద్ర ప్రభుత్వాలు పేర్కొంటున్నాయి. కానీ ఇంకా వేలాదిగా ఉత్తరాఖండ్‌లో యాత్రీకులు చిక్కుకుపోయే ఉన్నారు. వారికి తాగుదామంటే నీళ్లు లేవు. వేలకు కాదు కదా రోజుకు ఒక పూటైనా తిండికి దిక్కులేదు. ఎముకలు కొరికే చలి నుంచి రక్షించుకునేందుకు దుప్పట్లు లేవు. ప్రభుత్వాలు ఇస్తున్న ఆహారం, నీళ్లు ఏ మూలకూ సరిపోవడం లేదు. ఇదే అదనుగా కొందరు స్వార్థ పరులు అధిక ధరకు ఆహారం, నీళ్లు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. ఆపదలో తనది కాని ప్రదేశంలో చిక్కుపోయిన సాటి మనుషులే దయ లేకుండా వ్యవహరిస్తున్నారు. మనుషుల సంగతి సరే కేంద్ర ప్రభుత్వం అంతకంటే నిర్దయగా వ్యవహరిస్తోంది. ఇన్ని వేల మందిని పొట్టబెట్టుకున్న జల ప్రళయాన్ని ఇప్పటి వరకూ జాతీయ విపత్తుగా ప్రకటించలేదు. బాధితుల తరలింపులో ప్రపంచ దేశాల సహాయాన్ని కోరడం లేదు. ఉత్తరాఖండ్‌ను గంగ ముంచెత్తినా ఏ ఒక్క దేశమూ ఆదుకుంటామంటూ స్నేహ హస్తాన్ని అందించలేదు. ఇందుకు కారణమేమిటీ అనే ఆలోచన ప్రజల్లో చాలా ఆలస్యంగా మొలకెత్తింది. ప్రపంచ దేశాల దృష్టిలో ఉత్తరాఖండ్ ఘటన అంత తీవ్రమైనది కాదు అని చూపే ధోరణిని కేంద్రం అవలంబిస్తుందనే సందేహాలు ముసురుకుంటున్నాయి. చిక్కుకుపోయిన యాత్రీకుల తరలింపులోనూ అంతే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ప్రళయం సంభవించినప్పుడు హోరు వానలు కురుస్తున్నాయి. అవి తగ్గుముఖం పట్టగానే సహాయక చర్యలు వేగంగా అందించవచ్చు. కానీ ఏదో చేశాం అనే కోణంలోనే కేంద్రం చర్యలున్నాయని చెప్పకతప్పదు. భారత సైన్యం వద్ద 60 నుంచి 70 మందిని తరలించే ప్రత్యేక హెలీక్యాప్టర్లున్నా బాధితుల తరలింపునకు వాటిని వినియోగించడం లేదు. అలాగని ఉత్తరాఖండ్‌లో సైన్యం చేస్తున్న సేవలను తక్కువ చేయలేం. భారత సైన్యం కొండకోనల్లో చిక్కుకుపోయిన యాత్రీకులను ప్రాణాలకు తెగించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. కానీ సర్కారు పరంగా తీసుకునే చర్యలే అనేక సందేహాలకు తావిస్తున్నాయి. పెను విళయాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించకపోవడంలో కేంద్రం ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదు. జాతీయ విపత్తుగా ప్రకటిస్తే సహాయక చర్యలైనా త్వరతిగతిన అందుతాయనే చిన్న ఆశ. పులిమీద పుట్రలా ఇప్పటికే జల ప్రళయానికి కాకవికలమైన యాత్రికులపై మళ్లీ వరుణుడు పగబట్టాడు. మళ్లీ ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తుండటంతో సహాయక చర్యలకు అంతరాయం వాటిల్లింది. ఫలితంగా వేలాది మంది పర్యాటకులు కేదార్‌నాథ్‌లోనే చిక్కుకుపోయారు. ఇంత జరుగుతున్న కేంద్రం బులి బులి ఏడ్పులు తప్ప పటిష్టమైన చర్యలైతే చేపట్టడం లేదు. ఇంతటి విపత్తును దాచిపెట్ట చూస్తున్న ప్రభుత్వం తీరు నిజంగా క్షమించరానిది.