ఎట్టకేలకు డీకే రవి మృతిపై సీబీఐ విచారణ

5

బెంగళూరు,మార్చి 23 (జనంసాక్షి): ఐఏఎస్‌ అధికారి డి.కె.రవి మృతి ఘటనపై సీబీఐ విచారణకు కర్ణాటక ప్రభుత్వం అంగీకరించింది. కర్ణాటక సర్కారు అంగీకరిస్తే సీబీఐతో విచారణ చేయిస్తామని కేంద్రం ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. రవి మృతిపై గత కొద్ది రోజులుగా నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రవి ఆత్మహత్య చేసుకున్న తీరుపై కర్ణాటకోల అనుమానాలు వ్యక్తం అయ్యాయి. దీంతో చట్టసభల్లో ఆందోళన వ్యక్తం అయ్యింది. ఈ వ్యవహారంతో దిగివచ్చి ఐఏఎస్‌ అధికారి డీకే రవి మృతిపై సీబీఐ విచారణకు కర్ణాటక ప్రభుత్వం అంగీకరించింది. ఇక రవి మృతిపై సీబీఐ విచారణ చేయనుంది. కర్ణాటక ప్రభుత్వం అంగీకరిస్తే సీబీఐ విచారణ చేయిస్తామని ఇటీవలే కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. డీకే రవి అనుమానస్పద మృతిపై కర్ణాటకలో నిరసనలు

వెలువెత్తుతున్నాయి. ఇదిలావుంటే ఆయన మృతిపై అనేక అనుమానాలు వస్తున్నాయి. ఆత్మహత్య చేసుకోవడం వెనక మాఫియా హస్తముందని కొందరు అంటుంటే పన్నుల ఎగవేతదారులే హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని కొందరు వాదించారు. అయితే మరో కొత్తకోణం ఇందులో వెలుగుచూసింది. ఆత్మహత్యకు పాల్పడిన ఐఏఎస్‌ అధికారి రవి తన సహచర మహిళా అధికారిని వేధించేవాడా? ఆయన వేధింపులతో విసుగెత్తిన ఆమె రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిందా? అవుననే అంటోంది మెయిల్‌ టుడే కథనం. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీఐడీ అధికారులను ఉటంకిస్తూ ఆ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. ఆ కథనం ప్రకారం రవి తనకు తరచుగా ఫోన్లు చేసి, మెసేజ్‌లు పంపుతూ వేధించాడని మాండ్య జిల్లా పంచాయత్‌ సీఈఓ రోహిణి సింధూరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కౌశిక్‌ ముఖర్జీకి లేఖరాశారు. ఈ విషయాన్ని సీఐడీకిచ్చిన వాంగ్మూలంలోనూ అంగీకరించారు. ఐఏఎస్‌ శిక్షణలో వారిద్ద రూ బ్యాచ్‌మేట్లు. రవి ప్రవర్తనతో ఇబ్బందులకు గురైన రోహిణి తన సొంత రాష్ట్రమైన ఆంధప్రదేశ్‌ వారి సాయం తీసుకోవాలని భావించిందని సీఐడీ అధికారులు పేర్కొన్నారు. రవి ప్రవర్తనపై రెండు నెలల క్రితం ఏపీ సీఎం సలహాదారునికి ఆమె ఫిర్యాదు చేసిందని, ఆయన సూచన మేరకే రోహిణి కర్ణాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసిందని, ఈ విషయాన్ని సీఐడీ అధికారి వెల్లడించారని ఆ కథనం సారాంశం. ఈ లేఖ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కార్యాలయంలో ఉందా, లేదా అన్న విషయాన్ని సీఐడీ ధ్రువీకరించలేదు. ఆ ఏపీ సీఎం సలహాదారు ఎవరో కూడా వెల్లడికాలేదు. చంద్రబాబు సలహాదారుడిని ప్రశ్నించే అధికారం కర్ణాటక సీఐడీకి లేనందున ఇప్పటికైనా కేసును సీబీఐకి అప్పగించాలని విపక్షాలు డిమాండ్‌చేస్తున్నాయి. రోహిణి వాంగ్మూలంతో సీఐడీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ప్రశ్నించాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఈ నేపథ్యంలో దర్యాప్తు నిష్పాక్షికంగా సాగుతుందని ఎలా నమ్మగలమని మాజీ సీఎం కుమారస్వామి పేర్కొన్నారు. ఈ కేసును సీబీఐకి అప్పగించేలా కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించాలని బీజేపీ ఎంపీ ప్రతాప్‌ సింహ సోనియాకు లేఖ రాశారు.సోనియా కూడా ఇందుకు సిఎం సిద్దరామయ్యకు సూచన చేశారు. దీంతో

ఇక ఈ కేసును సీబీఐకి అప్పగించడంతో నిజనిజాలు వెల్లడి కానున్నాయి. విచారణ వేగవంతం కానుంది.