ఎమ్మెల్యేల సంఖ్య పెరగడం పార్టీలకు అవసరం

ఎమ్మెల్యేలు సక్రమంగా పనిచేస్తే వారి నియోజకవర్గాలు అద్దంలా కాకున్నా కనీస వసతులు ఉన్నా ప్రాంతాలుగా అభివృద్ధి చేసుకోవచ్చు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాప్రతినిధులు కీలక భూమికలో ఉన్నారు. ప్రభుత్వం వారి ద్వారానే ఏర్పడుతుంది. కానీ ఎన్నికలు ఖరీదు కావడం, ఓట్ల కోసం విపరీతంగా ఖర్చు చేయడంతో ప్రజాప్రతినిధులకు అభివృద్ది కన్నా తాము పెట్టిన ఖర్చుకు రెండింతలు ఎలా సంపాదించాలన్న ఆలోచనలో ఉంటున్నారు. ప్రజలకన్నా వ్యక్తిగత పరమావధి పెరిగింది. దీంతో సమస్యలు పక్కదారి పట్టాయి. అందుకే వారి జీతభత్యాలు పెంచాలని, సౌకర్యాలు పెంచాలన్న డిమాండ్‌ పెరుగుతూ వస్తోంది. ఇందుకు అనుగుణంగా ఇప్పుడు తెలుగు రాష్టాల్ల్రో వారికి భారీగా జీతభత్యాలు పెరిగాయి. వీరంతా నియోజకవర్గాల్లో కనీస వసతులకు కృషి చేస్తే ప్రజలకు అగచాట్లు తప్పుతాయి. సమస్యలను గుర్తించి ప్రాధాన్యతా క్రమంలో వాటిని ముందుకు తీసుకుని వెళ్లే వారు వేళ్లవిూద లెక్కపెట్టగలిగిన వారు మాత్రమే ఉన్నారు. తాగు,సాగునీరు, మురుగునీటి పారుదల, పర్యావరణం, విద్య,వైద్యం ఇలా అనేక రంగాలు కునారిల్లడానికి ఎమ్మెల్యేలు లేదా ఎంపీలు చైతన్యంగా లేకపోవడమే కారణంగా చెప్పుకోవాలి. వీరివల్ల ఖజానాపై భారం పడుతుందన్న అపోహ ప్రజల్లో పెరగకుండా చూసుకోవాలి. ఇప్పుడు పెంచిన జీతాల విషయంలో ఇదే చర్చ సాగుతోంది. దీనికితోడు నియోజకవర్గాల సంఖ్య కూడా ఇక భారీగా పెరగనుంది. విభజన చట్టం మేరకు కొత్తగా సీట్ల సంఖ్యను పెంచాల్సి ఉంది. ఇందుకు అనుగుణంగా రాష్టాల్రు కోరుకుంటున్నాయి. కేంద్రం కూడా చురకుగా కదులుతోంది.  ఇందులో భాగంగా తెలుగు రాష్టాల్ల్రో  అసెంబ్లీ స్థానాల పెంపుపై చర్చకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న 175 శాసనసభ నియోజకవర్గ స్థానాలను 225కు, తెలంగాణలో ప్రస్తుతం  ఉన్న 119 అసెంబ్లీ స్థానాలు  153 స్థానాలకు పెంచాలని విభజన చట్టంలో పేర్కొన్నారు. అయితే ఇప్పటి వరకూ ఆ చట్టానికి సంబంధించి కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అయితే సీట్లను పెంచితే రాజకీయంగా అవసరం కనుక రెండు రాష్టాల్రల్లో అధికారంలో ఉన్న చంద్రులు అసెంబ్లీ స్థానాల పెంపుకోసం కేంద్రంతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నాయి. ఇలా రెండేళ్ల తరవాత ఇప్పుడా ఫైలుకు కదలిక వచ్చింది. వచ్చే ఎన్నికల నాటికి బహుశా ఈ కోరిక నెరవేరేలా జాబితా సిద్దం కానుంది. ఇందులో భాగంగా  కేంద్ర న్యాయశాఖ కార్యదర్శితో కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడు సమావేశ మయ్యారు. శాసనసభ స్థానాల పెంపు అంశంపై చర్చించారు.ఇందుకు అనుగుణంగా ¬ం, న్యాయశాఖలు చురుకుగా ఫైళ్లను కదిలించే పనిలో పడ్డాయి. ఏపీలో 225, తెలంగాణలో 153 వరకు శాసనసభ స్థానాల సంఖ్య పెంచాలని విభజన చట్టంలో పేర్కొన్నారని అయితే నియోజకవర్గాల పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో 2020 వరకూ ఇవే స్థానాలు ఉండాలని పేర్కొన్నందున ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టాన్ని యథాప్రకారం అమలు చేస్తే న్యాయపరమైన చిక్కులు వస్తాయని కేంద్ర భావిస్తున్నది. ఇలా న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ఈ వ్యవహారంపై చర్చిస్తున్నామని వెంకయ్య నాయుడు తెలిపారు. అటార్నీ జనరల్‌ అభిప్రాయం వచ్చాక ఈ పక్రియ వేగవంతం కానుందని తెలిపారు.  న్యాయశాఖ.. అటార్నీజనరల్‌ అభిప్రాయం తీసుకుని ¬ంశాఖకు నివేదిస్తుందని, సవరణ బిల్లును ¬ంశాఖ పార్లమెంట్‌ ముందకు తీసుకొస్తుందని వివరించారు. వీలైనంత త్వరగా సవరణ బిల్లు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. మొత్తానికి రైలు పట్టాలకెక్కినట్లే ఉంది. ఇలా వీలైనంత త్వరగా దీనిని ముందుకు తీసుకుని వస్తూ వచ్చే శీతాకాల సమావేశాలకు బిల్లు రెడీ కావచ్చు. సీట్ల సంఖ్య పెరుగుతందని ఇరు రాష్టాల్ర సిఎంలు కూడా

భరోసాతో ఉన్నారు. వచ్చే ఎన్నికల నాటికి పెరిగిన సంఖ్యతో ముందుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ప్రజలపై మరింత భారం పడనుంది.  తెలంగాణలో అదనంగా మరో 33 మంది కొత్తగా ఎమ్మెల్యేలు దర్శనమిస్తారు.అలాగే ఎపిలో మరో 50 మంది శాసనసభ్యులు పెరుగుతారు. మొత్తంగా వీరి రాకతో ఖజానాపై అదనపు భారం పడనుంది. అయితే పార్టీలకు మాత్రం పండగ కానుంది. ఎక్కువ మందికి పోటీ చేసే అవకాశం వస్తుంది. అయితే  బడ్జెట్‌ రెండో దశ సమావేశాల్లో సీట్ల పెంపు బిల్లు తెచ్చే ప్రయత్నం చేస్తున్నామని వెంకయ్య నాయుడు అంటున్నారు. అంటే స్పీడుగా వ్యవహారం ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయి. సీట్లు పెరిగితే తమకూ లాభం చేకూరనుందన్న అంచనాల్లో  బిజెపి ఉంది. ఇకపోతే శాసన సభ్యులకు కేటాయించే నియోజకవర్గ అభివృద్ధి నిధులు రెట్టింపు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇప్పటివరకు రూ.1.5కోట్లు ఇస్తుండగా.. ఇకపై రూ.3కోట్లు ఇవ్వనున్నారు. నిజానికి ఎమ్మెల్యేలు చిత్తశుద్దితో ఈ నిధులను ఖర్చు చేస్తే సమస్యలు పరిష్కారం కాగలవు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల వేతనాలు, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీల పెన్షన్లు, ఇతర అలవెన్సుల సవరణ బిల్లును కూడా అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. దీంతో ఎమ్మెల్యేలకు సరాసరిగా రూ.2.30లక్షలవరకు జీతభత్యాలు పెరగ నున్నాయి. జాతి నిర్మాణంలో పాజిటివ్‌ రోల్‌ పోషించే ప్రజాప్రతినిధులు అవినీతి రహితంగా ఉండేందుకు వారికి కొన్ని వసతులు కల్పించాల్సిన అవసరం ఉందని తెలంగాణ సిఎం కెసిఆర్‌ అభిలషించారు. సిఎం దూరాభారం ఆలోచించి నిర్ణయం తీసుకున్నా అందుకు అనుగుణంగా ఎమ్మెల్యేలు తమ విధులను నిర్వర్తించాలని కోరుకుందాం. పదవి అన్నది అధికారం కోసం  కాకుండా ప్రజల సంక్షేమానికని గుర్తిస్తే మంచిది.