ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు భారీగా జీతభత్యాలు పెంపు

1

హైదరాబాద్‌,మార్చి21(జనంసాక్షి): తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతభత్యాల పెంపు విషయమై శాసనసభ్యుల సౌకర్యాల (ఎమినిటీస్‌) కమిటీ సమావేశమైంది. అసెంబ్లీ కమిటీ హాలులో సమావేశమైన శాసనసభ్యుల సౌకర్యాల కమిటీ ప్రజాప్రతినిధుల జీతభత్యాలు, పింఛనుపై చర్చించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతభత్యాలు రూ. 1.25 లక్షల నుంచి రూ. 3.5 లక్షలకు, వాహన రుణాన్ని రూ. 15 లక్షల నుంచి రూ. 40 లక్షలకు పెంచాలని కమిటీ సిఫారసు చేసింది. మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పింఛను రూ. 50 వేల నుంచి రూ. 65 వేలకు పెంచాలని పేర్కొంది. మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరణానంతరం వారి సతీమణులకూ ఇదే సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పరిమితి లేని వైద్య సౌకర్యం కల్పించాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో స్పీకర్‌ మధుసూదనాచారి, మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌, మంత్రులు హరీష్‌రావు, ఈటెల రాజేందర్‌తో పాటు ఆయా పార్టీల శాసనసభా పక్షనేతలు పాల్గొన్నారు. ఢిల్లీ, జార్ఖండ్‌ శాసన సభ్యులకు ఇచ్చే సౌకర్యాలను పరిశీలించి వాటిని ఇక్కడ కూడా అమలు చేయాలని కోరినట్టు సమాచారం. గృహ సదుపాయాలను కల్పించే బాధ్యత కవిూటికి లేదని వెల్లడించింది. ఆదర్శ్‌ నగర్‌లో ఎమ్మెల్యే క్వార్టర్ల పనుల ఆలస్యంపై కమిటీ ఆగ్రహం వ్యక్తం

చేసింది. ఇచ్చిన గడువు లోపు నిర్మాణపనులను ఎందుకు పూర్తి చేయలేక పోయిందని ఆర్‌ అండ్‌ బీ శాఖను ప్రశ్నించింది.