ఎమ్మెల్యే కు ప్రతిపత్రం అందజేత
రంగారెడ్డి /ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 23 (జనం సాక్షి): అటవీశాఖ, దేవాదాయ శాఖ వారి విధుల నిర్వహణ వైఫల్యంతోనే అమ్మవారి విగ్రహం అపహరణకు గురైనట్లు ఆ గ్రామ భక్తులు, ప్రజలు అభిప్రాయపడుతున్నారని సర్పంచ్ పేర్కొన్నారు. యాచారం మండల పరిధిలోని తాడిపర్తిలో నెలకొన్న తాటికుంట మైసమ్మ అమ్మవారి విగ్రహ అపహరణ విషయమై ఆదివారం మండల తెరాస అధ్యక్షులు కర్నాటి రమేష్ గౌడ్, తాడిపర్తి సర్పంచ్ దూస రమేష్, గ్రామ తెరాస అధ్యక్షుడు బైకని మల్లేష్, కార్యదర్శి పాండు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కిషన్ రెడ్డిని కలసి వినతి అందజేశారు. గత మూడు నెలల క్రితం చిరుత సంచరిస్తుందన్న నెపంతో అటవీ ప్రాంతంలో కందకం తీశారని భక్తులు, ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతుండడంతో ఇదే అదునుగా భావించి విగ్రహాన్ని అపహరించారని పేర్కొన్నారు. అమ్మవారి జాతర ఉత్సవాలు తరతరాలుగా జరుపుకుంటున్నారని అటవీశాఖ అధికారులు ఆంక్షలు విధించడంతో ఆలయ ప్రాంగణానికి వచ్చే భక్తులు ఇబ్బందులు పడుతున్నారని సర్పంచ్ వివరించారు. ఆలయ ఆవరణలో దుకాణ సముదాయాల యాజమాన్యాలు, కులవృత్తుల వారిని అటవీ ప్రాంతంలో ఏ కార్యకలాపాలు నిర్వహించరాదని వారిని బయటకు వెళ్ళగొట్టినట్లు వివరించారు. అమ్మవారి ఉత్సవాల నిమిత్తమై అటు భక్తులు, ప్రజలు అమ్మవారికి జరిపించే నిత్యోచిత పూజలు, అభిషేకాలు జరిగేలా ఇందుకు 5 ఎకరాల స్థలాన్ని కేటాయించేలా తమరు ప్రత్యేక చొరవ తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారని సర్పంచ్ పేర్కొన్నారు. స్పందించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ విషయమై స్థానిక పోలీసులతో చర్చించి నిందితులను తక్షణమే పట్టుకునేలా చూస్తామన్నారు. ఆలయ ప్రాంతంలో జరిగే కార్యకలాపాలపై దేవాదాయ, ఆటవిశాఖ, గ్రామస్తుల సమక్షంలో సమస్యను పరిష్కరించేలా చూస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారని పేర్కొన్నారు. కాగా ఎమ్మెల్యే ప్రత్యేక నిధులతో విగ్రహాన్ని పునః ప్రతిష్టిద్దామని ఎమ్మెల్యే వివరించారని సర్పంచ్ పేర్కొన్నారు.