ఎరువులు విత్తనాలు సకాలంలో అందించాలి
గుంటూరు, జూన్ 28 : ఈ ఖరీఫ్‌లో రైతులకు విత్తనాలు, ఎరువులు అందించడంలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది అని తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి, నిమ్మకాయల రాజనారాయణ గురువారం సత్తెనపల్లి స్థానిక ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విత్తనాలు, ఎరువులకు ఎమ్మార్పీ ధరకు నియోజకవర్గంలో ఎక్కడా దొరకట్లేదన్నారు. ఎడాపెడా విద్యుత్ కోతలతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని రాజనారాయణ తెలిపారు. రైతు సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 30వ తేదీన నియోజకవర్గ స్థాయిలో ధర్నా నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. ధర్నాలో రైతులందరూ పాల్గొని తమ సమస్యలను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. పట్టణ పార్టీ అధ్యక్షుడు రామస్వామి మాట్లాడుతూ పురపాలకంలో పారిశుద్ధ్యం అధ్వాన్నంలో ఉన్నప్పటికీ అధికారులు చర్యలు చేపట్టడం లేదన్నారు. వర్షాకాలంలో అనధికార విద్యుత్ కోతలకు ప్రభుత్వ అసమర్ధతే కారణమన్నారు. పట్టణంలో ఉన్న పారిశుద్ధ్య సమస్యను వెంటనే పరిష్కరించాలన్నారు. ఈ సమావేశంలో తెలుగుదేశం నాయకులు కాశీవిశ్వనాధం, పాపారావు, వెంకట కోటయ్య, సాంబశివరావు, రాంచంద్రరావు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.