ఎలా జరిగిందో తెలియదు

5

– అందుకే దైవలీలా అన్నాం

– విచారణలోనే తేలుతుంది

– ఐయూఆర్‌సీసీ ప్రతినిధులు

కోల్‌కతా,ఏప్రిల్‌ 1(జనంసాక్షి):

హైదరాబాద్‌/కోల్‌కతా,ఏప్రిల్‌ 1(జనంసాక్షి): కోల్‌కత్తాలో ఫ్లైఓవర్‌ కూలిన ఘటనలో ఐయూఆర్‌ఆర్‌సీసీ ప్రతినిధులు వివరణ ఇచ్చారు. అసలు దుర్ఘటన ఎలాజరిగిందో తెలియదని

అన్నారు. అందుకే దీనిని దైవలీల అన్నామని అన్నారు. కోల్‌కతా సిటీలో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కూలిన ఘటనలో మృతుల సంఖ్య 24కు చేరుకుంది. బ్రిడ్జి నిర్మాణ సంస్థ ఐవీఆర్‌సీఎల్‌ హైద్రాబాద్‌కు చెందినది కావడంతో ఇక్కడి కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు.  బ్రిడ్జి కూలడానికి అనేక కారణాలు ఉన్నాయని ఆ సంస్థ  తెలిపింది. బాంబు పేలుడు వల్ల కూడా బ్రిడ్జి కూలే అవకాశం ఉందని, ఆ కోణంలోనూ విచారణ నిర్వహించాలని ఆ సంస్థ యజమానులు భావిస్తున్నారు. తాము గతంలో అనేక నిర్మాణాలుచేపట్టామని, ఎక్కడా ఎప్పుడూ పొరపాటు జరగలేదన్నారు. ఈ ఘటనపై ఐవీఆర్‌ సీ ఎల్‌ కంపెనీ ప్రతినిధులు శుక్రవారం విూడియాతో మాట్లాడారు. నగరంలోని బంజారాహిల్స్‌ లో ఉన్న కార్యాలయంలో ఈ విలేకరుల సమావేశం జరిగింది. తాము 27 సంవత్సరాలుగా ఈ నిర్మాణ రంగంలో ఉన్నామని తెలిపారు. 2009 నుంచి ఈ ఫ్లై ఓవర్‌ పనులు జరుగుతున్నాయని కంపెనీ హెచ్‌ఆర్‌ ఆపరేషన్స్‌ పాండురంగారావు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే తమ టెక్నికల్‌ టీం వెంటనే కోల్‌కతకు బయలుదేరిందని తెలిపారు. ఎక్కడా డిజైన్‌ లో లోపాలు లేవని స్పష్టం చేశారు. ప్రమాదం విషయం తెలుసుకుని తాము షాక్‌ తిన్నామని, ఘటనపై ప్రభుత్వానికి సహకరిస్తున్నామని తెలిపారు. ఈ కంపెనీలో ఆరు వేల మంది పని చేయడం జరుగుతోందన్నారు. కంపెనీపై దుష్పచ్రారం సాగుతోందని, విూడియా కూడా ఒక్కటి చెబితే ఒకటు రాస్తోందని అసహనం వ్యక్తం చేశారు.  బ్రిడ్జి కూలిన ఘటన ప్రమాదవశాత్తు జరిగిందని హైదరాబాద్‌లో ఉన్న అధికారులు స్పష్టం చేశారు. యాక్ట్‌ ఆఫ్‌ గాడ్‌ అన్న ప్రకటనపై ఐవీఆర్‌సీఎల్‌ లీగల్‌ హెడ్‌ సీత సమాధానం ఇచ్చారు. ఆ మాట ఒక భావన మాత్రమే అని ఆమె చెప్పారు. ఫ్లై ఓవర్‌ కూలిపోవడంపై షాక్‌ తిన్నామని దీన్ని నిర్మాణం చేపడుతున్న ఐవీఆర్‌ సీఎల్‌ కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. బ్రిడ్జి కూలిందన్న విషయంపై విచారణాధికారులు పూర్తి వివరాలు వెల్లడిస్తారన్నారు. పై వంతెన నిర్మాణ పనులు చేపట్టిన హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని ఐవీఆర్‌సీఎల్‌ కార్యాలయానికి సీఐడీ, ఎస్‌బీ, కోల్‌కతా పోలీసులు చేరుకున్నారు. ఘటనకు సంబంధించి నిర్మాణ సంస్థ ప్రతినిధులను విచారించారు. మరోవైపు వంతెన కూలిపోవడానికి గల కారణాలపై కోల్‌ కతా ప్రభుత్వాధికారులు అన్వేషణలు మొదలు పెట్టారు. నగరంలోని బంజారాహిల్స్‌ లో ఉన్న కంపెనీ కార్యాలయానికి కోల్‌ కతా నుండి రెండు బృందాలు వస్తున్నట్లు సమాచారం. నిర్మాణంలో ఉపయోగించిన నిర్మాణ సామాగ్రీని అధికారుల ఎదుట పెడుతామని కంపెనీ యాజమాన్యం పేర్కొంటోంది. ఇందులో ఎవరి వైఫల్యం ఉందో రానున్న రోజుల్లో తేలనుంది. అయితే ఐవీఆర్‌సీఎల్‌ సంస్థపై బ్రిడ్జి కూలిన ఘటనలో మర్డర్‌ కేసు నమోదు చేశారు. ఐపీసీ 304వ సెక్షన్‌ ప్రకారం ఆ కేసును నమోదు చేశారు. కోల్‌కొతా పోలీసులు కంపెనీకి చెందిన అయిదుగురు ఉద్యోగులను కూడా అరెస్టు చేశారు. పశ్చిమ్‌బంగా రాజధాని కోల్‌కతాలో గురువారం మధ్యాహ్నం నిర్మాణంలో ఉన్న పైవంతెన కూలిపోయిన ఘటనలో తొలుత  21 మంది మృతిచెందగా…శుక్రవారం  ఉదయానికి ఆ సంఖ్య 25కి చేరింది. శిథిలాల కింద 150 మందికిపైగా చిక్కుకుని ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. రెండో రోజు కూడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదం జరిగిన వెంటనే దాదాపు 300 మంది సైన్యంతోపాటు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలతోపాటు రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందాలు, పోలీసు, ఫైర్‌ సిబ్బంది  ఘటన స్థలానికి చేరుకుని..  వెంటనే సహాయచర్యలు ప్రారంభించారు. ఫ్లై ఓవర్‌  నిర్మిస్తున్న హైదరాబాద్‌కు  చెందిన ఐవీఆర్సీఎల్‌ కంపెనీ కార్యాలయాన్ని కోల్కతాలో ఉన్నతాధికారులు సీజ్‌ చేశారు. గరంలోని ఠాగూర్‌ కూడలి వద్ద నిర్మిస్తున్న ఫ్లై ఓల్గ/వర్‌ గురువారం కూలిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో తొలుత 21 మంది మరణించగా… 88 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను నగరంలోని వివిధ ఆసుపత్రులకు తరలించి… చికిత్స అందిస్తున్నారు. వారిలో మరో ముగ్గురు శుక్రవారం మరణించారు. ఈ ఘటనలో గాయపడిన మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యలు వెల్లడించినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో మరణించిన వారికి, గాయపడిన వారికి ప్రభుత్వం నష్ట పరిహారం ప్రకటించిన సంగతి తెలిసిందే.