ఎవ్వరన్నారు నేను తెలంగాణకు వ్యతిరేకమని
తెలంగాణ కావాలని కేసీఆర్ కంటే ముందే డిమాండ్ చేశా
దమ్ముంటే సీమాంధ్ర నేతలు రాజీనామా చేయాలి : దానం
హైదరాబాద్, జనవరి22 (జనంసాక్షి):
రాష్ట్ర విభజనపై మంత్రి దానం నాగేందర్ మరోసారి మాట మార్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తాను వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. తానెప్పుడూ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడలేదన్నారు. ప్రత్యేక తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడినట్లు ఎవరైనా నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. రాష్ట్ర విభజనపై హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా.. మంత్రి ముఖేశ్‌గౌడ్, తాను కట్టుబడి ఉంటామని తెలిపారు. తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వ నిర్నయం ఉంటుందని మంత్రి దానం నాగేందర్ విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణ ఇవ్వాలంటూ సంతకాలు చేసిన 41 మంది ఎమ్మెల్యేలలో తాను కూడా ఉన్నానని, సంతకాలు చేయించిందేనని తనని చెప్పారు. రాష్టాన్న్రి విభజిస్తే రాజీనామా చేస్తామంటున్న సీమాంధ్ర నేతలు ఎంత త్వరగా చేస్తే అంత మంచిదని సలహా ఇచ్చారు. ఎన్నికల్లో ఓడిపోతమనే భయంతోనే వారు రాజీనామాల డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. దానం నాగేందర్ మంగళవారం హైదరాబాద్‌లో విూడియాతో మాట్లాడారు. సీమాంధ్రులకు అమ్ముడుపోయి తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని కొందరు ఆరోపిస్తున్నారని, అమ్ముడు పోవాల్సిన అవసరం తమకు లేదన్నారు. ప్రత్యేక తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడినట్లు ఎవరైనా నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. హైదరాబాద్‌లో ఉన్న వారు తెలంగాణకు వ్యతిరేకం అని తప్పుడు ప్రచారం జరుగుతోందని అన్నారు. హైదరాబాద్ వాసులెవరూ రాష్ట్ర విభజనకు వ్యతిరేకం కాదన్నారు. తెలంగాణను అడ్డుకొనేందుకు సీమాంధ్ర నేతలు రాజీనామాల డ్రామాలు ఆడుతున్నారని దానం విమర్శించారు. వారు ఎంత త్వరగా రాజీనామా చేస్తే అంత మంచిదని, ఇప్పుడు సమైక్యాంధ్ర అని ఎగురుతున్న వారెవ్వరూ ఎన్నికల్లో గెలవరని చెప్పారు. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే సీమాంద్ర నేతలు రాజీనామా నాటకాలాడుతున్నారని ధ్వజమెత్తారు. వారికి దమ్ముంటే రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. హైదరాబాద్ మా అమ్మ సొత్తు అబ్బ సొత్తు అని అంటున్న విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఎక్కడి నుంచి వచ్చారని ప్రశ్నించారు. హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగమన్నారు. లగడపాటి లాంటి వారి వల్లే తెలంగాణ ఉద్యమం బలోపేతమైందన్నారు. హైదరాబాద్ ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్ చేశారు కదా? అని విలేకరులు ప్రశ్నించగా… హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తామంటేనే ప్రత్యేక రాష్ట్రం కోరినట్లు తెలిపారు. రాజధాని నగరం కేంద్ర పాలిత ప్రాంతం కారాదనే ఆ విధంగా మాట్లాడినట్లు వివరణ ఇచ్చారు. హైదరాబాద్‌లో రెఫరెండం నిర్వహించాలని టీడీపీ నేత సుధీశ్ రాంబోట్ల డిమాండ్ చేయడంపై దానం స్పందించారు. ఆయన ఎక్కువగా మాట్లాడడం సరికాదని, సుధీశ్ బతకడానికోసం హైదరాబాద్‌కు వచ్చిన సంగతి మర్చిపోవద్దని హితవు పలికారు. తెలంగాణకు తాను వ్యతిరేకం కాదని, బడుగు, బలహీన వర్గాలకు ప్రాధాన్యం ఉండేలా సామాజిక తెలంగాణ కావాలని ఆయన అన్నారు.