ఎస్సీ వర్గీకరణకు కట్టుబడ్డాం

2

– ఎంపీ వినోద్‌

న్యూఢిల్లీ,మార్చి9(జనంసాక్షి): ఎస్సీ వర్గీకరణ చేయాల్సిందేనని కరీంనగర్‌ పార్లమెంట్‌ సభ్యులు వినోద్‌ తేల్చి చెప్పారు. ఎస్సీ వర్గీకరణ చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిందని గుర్తు చేశారు.  ఎస్సీ సమాజికవర్గానికి న్యాయం చేయాలంటే వర్గీకరణ అవసరమని సీఎం కేసీఆర్‌ ఉద్యమ సమయంలో చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో పట్టుబట్టి చట్టం చేసినా సుప్రీంకోర్టు కొట్టేసింది. సుప్రీంకోర్టు తీర్పును అధిగమించాలంటే ఆర్టికల్‌ 341ను సవరించాలని ఉషామెహరి కమిటీ సిఫారసు చేసింది. 341(3) ఎస్సీ వర్గీకరణ అంశాన్ని స్పష్టం చేస్తోంది. పార్లమెంట్‌లో ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ బిల్లు రెండు మూడు రోజుల్లో చర్చకు రానుంది. ఎస్సీ, ఎస్టీలలో కొన్ని కులాల సవరింపుపై మోడీ ప్రభుత్వం బిల్లు పెట్టింది. రాష్ట్రంలో ఎక్కువ సంఖ్యలో ఉన్న ఎస్సీ సమాజిక వర్గానికి న్యాయం జరిగినప్పుడే తెలంగాణ అభివృద్ధి జరిగినట్లవుతుంది. ఎస్సీ వర్గీకరణ జరిగినప్పుడే మాలలకు, మాదిగ వర్గానికి అన్ని రంగాల్లో సముచిత స్థానం దొరుకుతుంది. గతంలో ఎస్సీ వర్గీకరణ అమలు జరిగిన సందర్భంలో విద్య, ఉద్యోగాల్లో అందరికీ న్యాయం జరిగిందని తెలిపారు. మాదిగా రిజర్వేషన్‌ ఆధ్వర్యంలో జంతర్‌మంతర్‌ వద్ద జరిగిన ఆందోళనలో ఆయన మాట్లాడారు. వారికి అండగా ఉంటామని ప్రకటించారు. ఇదిలావుంటే  అచ్చంపేట మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ చారిత్రాత్మక విజయం సాధించిందని ఎంపీ జితేందర్‌రెడ్డి తెలిపారు. చరిత్రలోనే 20కి 20 సీట్లు సాధించిన పార్టీగా టీఆర్‌ఎస్‌ రికార్డు సృష్టించిందన్నారు. సీఎం కేసీఆర్‌ పాలనపై ప్రజలకు ఉన్న విశ్వాసం ఈ ఎన్నికల ద్వారా మరోసారి రుజువైందని వెల్లడించారు. ఈ గెలుపుతో మరింత బాధ్యతతో ప్రభుత్వం అభివృద్ధి పథకాలు తీసుకువస్తుంది. సీఎం కేసీఆర్‌ నాయకత్వంపై విశ్వాసముంచి విజయాన్ని అందించిన ప్రజలందరికి కృతజ్ఞతలు తెలిపారు. ఆయన కూడా జంతర్‌ మంతర్‌ ఆందోళనలో పాల్గొన్నారు.