ఏడారిలో ఏదీ దారి?

3

– సౌదీలో రోడ్డునపడ్డ తెలంగాణ బిడ్డలు

– స్వదేశానికి రప్పించే ప్రయత్నం చేయాలి

– కేంద్రానికి కేటీఆర్‌ లేఖ

హైదరాబాద్‌,మే3(జనంసాక్షి): కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్‌కు రాష్ట్ర మంత్రి కెటి రామారావు లేఖ రాశారు. సౌదీలోని బిన్‌లాడెన్‌ కంపెనీ 50 వేల మంది కార్మికులను తొలగించిన అంశాన్ని లేఖలో ప్రస్తావించారు. వీరిలో తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్‌, నిజామాబాద్‌, మెదక్‌, హైదరాబాద్‌ జిల్లాలకు చెందిన వారు ఉన్నారని వివరించారు. రాష్టాన్రికి తిరిగి రావాలనుకున్న వారికి దౌత్యపరమైన సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. రాష్టాన్రికి తిరిగి వచ్చేవారిని అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. సౌదీలోని అతిపెద్ద నిర్మాణ సంస్థ బిన్‌ లాడెన్‌ గ్రూప్‌ నుంచి ఉద్యోగులను తొలగిస్తుండడంపైన  మంత్రి   మంగళవారం లేఖ రాశారు. గత ఆరు నెలలుగా బిన్‌ లాడెన్‌ కంపెనీ ఉద్యోగులను తొలగిస్తున్నదని, ఇప్పటికే సుమారు 50 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించినట్టు వార్తలు వస్తున్నాయని కేంద్ర మంత్రికి తెలిపారు. తెలంగాణ నుంచి సౌదీకి వెళ్లే కార్మికులు చాలావరకు నిర్మాణ రంగంలోనే పనిచేస్తున్నారని, ముఖ్యంగా బిన్‌ లాడెన్‌ గ్రూప్లో చాలామంది కార్మికులు పనిచేస్తున్నారన్నారు. ఇప్పటికే చాలామందిని అర్ధాంతరంగా కంపెనీ యాజమాన్యం ఉద్యోగాల నుంచి తొలగించిందని, ఉద్యోగాల్లో కొనసాగతున్నవారికీ గత ఆరు నెలలుగా జీతాల చెల్లింపులు చేయడం లేదని తెలుపుతున్నారని లేఖలో పేర్కొన్నారు. దీంతో ఇక్కడి నుండి వెళ్లిన తెలుగువారు తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారని, వారి వీసాలు సైతం రద్దు కావడంతో వారి కష్టాలు మరింత ఎక్కువవుతున్నాయన్నారు. ముఖ్యంగా రియాద్‌, జెడ్డా, మక్కా, మదీనా, దుబాయ్‌ ప్రాంతాల్లో ఉన్న తెలంగాణ కార్మికుల పరిస్థితి మరింత కష్టంగా ఉందని మంత్రి లేఖలో తెలిపారు. వీసా రద్దయిన చాలామంది కార్మికులు పని లేక పస్తులుంటున్నారని లేఖలో తెలిపారు. అయితే కొంత మంది స్వదేశానికి రావాలని కోరుకుంటున్నారు, కానీ వారికి రావాల్సిన బకాయిలు వస్తేగానీ తిరిగి వెనక్కి వచ్చే పరిస్ధితి లేదన్నారు. బకాయిలు చెల్లించాలంటూ కంపెనీల చుట్టూ తిరుగుతున్నా ఫలితం ఉండడం లేదని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. బిన్‌ లాడెన్‌ కంపెనీ వైఖరిపైన ఆగ్రహంగా ఉన్న విదేశీ కార్మికులు ధర్నాలు చేయడంతో పరిస్ధితి ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో భారత కార్మికుల రక్షణ పట్ల మంత్రి అందోళన వ్యక్తం చేశారు. వారికి సంపూర్ణ రక్షణ అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సుష్మా స్వారాజ్ను కోరారు. ఇప్పటికే తెలంగాణకి పదుల సంఖ్యలో తిరిగి వస్తున్న కార్మికులకి దౌత్యపరమైన పరమైన సహాయాన్ని పెంచాల్సిందిగా మంత్రి కోరారు. కేంద్ర మంత్రితోపాటు సౌదీ రాయబారికి సైతం ఓక లేఖను రాయనున్నట్లు మంత్రి తారక రామారావు తెలిపారు.