ఏదీ మహిళలకు భద్రత?

భారత దేశంలో మహిళల పట్ల జరుగుతున్న అఘాయిత్యాలు, అరాచకాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయే తప్ప తగ్గటంలేదు. నిత్యం ఎక్కడో అక్కడ ఏదో ఒక సంథటన జరుగుతునే ఉంది. మహిళల పట్ల జరుగుతున్న ఘోరాలకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిన మరో ఘటన గోవాలో సాక్షాత్తూ కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీకి ఎదురైన సీసీ కెమెరా అనుభవం. సెలవుపై గోవాకు వెళ్లిన స్మృతి అక్కడి ఫ్యాబ్‌ ఇండియా అనే వస్త్ర దుకాణంలోని ట్రయల్‌ రూంలో బట్టలు మార్చుకునేందుకు వెళ్లారు. చుట్టూ పరిసరాల్ని నిశితంగా పరిశీలించిన ఆమె అక్కడ వెంటిలేటర్‌పై అమర్చిన సీసీ కెమెరాను గమనించి షాక్‌కు గురయ్యారు. ఖంగుతిన్న ఆమె వెంటనే తన భర్త జుబిన్‌కు సమాచారమిచ్చారు. వెంటనే స్థానిక బీజేపీ ఎమ్మెల్యే అక్కడికి చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేసి నిందితులను అరెస్టు చేయించారు. ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. కానీ ఇదే పరిస్థితిని ఒక సాధారణ మహిళ ఎదుర్కొని ఉంటే పరిస్థితి మరోలా ఉండేదేమో. సాక్షాత్తూ కేంద్ర మంత్రి వెళ్లిన దుకాణంలోనే పరిస్థితి ఇలా ఉంటే ఇక సామాన్య మహిళల మానానికి ఏపాటి రక్షణ ఉందో అర్థం చేసుకోవచ్చు. గత నాలుగు నెలలుగా గోవాలోని ఫ్యాబ్‌ ఇండియాలో ఈ తంతు సాగుతున్నట్లు పోలీసు విచారణలో తేలింది. సదరు షాపులో దుస్తులు ఎంపిక చేసుకుని మార్చుకునేందుకు ట్రయల్‌ రూంకు వెళ్లిన స్మృతి ఆమె సహచరురాలు ఒకరు ఈ కెమెరాను గమనించి హెచ్చరించటంతో అప్రమత్తమయ్యారు. దీంతో స్మృతీఇరానీకి పెనుముప్పుతప్పింది. ఈ ఒక్కచోటే కాకుండా దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఏం జరుగుతోందో అని. కేంద్ర మంత్రి పరిస్థితే ఇలా ఉంటే ఇక సామాన్య మహిళల పరిస్థితి ఏంటని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. మహిళల పట్ల జరుగుతున్న అఘాయిత్యాలు రోజురోజుకూ కొత్త మార్గాలను వెతుక్కుంటున్నాయి. ఇటీవల కాలంలో జరుగుతున్న అత్యాచారాలు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. మొన్న నిర్భయ, నిన్న అభయ, నేడు మరొకరు, రేపు ఇంకొకరు, ఇలా మహిళలపై ఏదో ఒక రకంగా అణచివేత, దాడులు సాగుతూనే ఉన్నాయి. ఆఖరికి నిర్భయ చట్టం వచ్చినా కూడా మహిళల పట్ల వైఖరి మార్చుకోవటంలేదు మృగాళ్లు. దీనికి కారణం చట్టాలు సరిగా అమలు కాకపోవడమే అనే విమర్శలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి. దేశంలో మహిళా బిల్లును కూడా ఆమోదింపజేసుకోలేకపోవడానికి పురుషాధిక్యత ఎంతుందో అర్థం చేసుకోవచ్చు. నాటకీయ పరిణామాల మధ్య రాజ్యసభలో ఆమోదం పొందిన మహిళా బిల్లు లోక్‌సభలో ప్రవేశ పెట్టడానికి నాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ఎంత దాటవేత ధోరణి ప్రదర్శించిందో అంతకు రెట్టింపు ధోరణి నేటి భాజపా నేతృత్వ ఎన్‌డీఏ సర్కారు ప్రదర్శిస్తోంది. ఇక సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్‌ లాంటి నేతలైతే మహిళా బిల్లు ఊసెత్తితేనే ఒంటికాలిపై లేస్తారు. ఇలాంటి నేతలు చట్టసభల్లో సభ్యులుగా ఉంటే మహిళా బిల్లుకు మోక్షం ఎలా లభిస్తుంది. వీరి సంగతి అలా ఉంటే బయట సామాన్యులకంటే ఎక్కువ కష్టాలు ప్రజాప్రతినిధులుగా చట్టసభల్లో ఉన్న మహిళలు ఎదుర్కొంటున్న దుస్థితి దాపురించింది. ఓ నేత మహిళల రంగు గురించి మాట్లాడితే మరో నేత వారి కట్టుబొట్టు గురించి కించపరిచే వ్యాఖ్యలు చేస్తారు. ఇలా చట్టసభల్లోనే మహిళల పట్ల నీఛభావం ఉన్న నేతలు పదవులు వెలగబెడుతుంటే ఇక మామూలు స్త్రీల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. మహిళల పట్ల ఇంత నీఛంగా ప్రవర్తిస్తున్నా దుండగులను శిక్షించటంలో మాత్రం వ్యవస్థ విఫలమవుతోంది.     ఇక కొన్ని సంఘటనలైతే మరీ దారుణం. వ్యక్తిగత వ్యవహారాలను వీడియోలుగా చిత్రీకరించి మహిళలను బెదిరించి లొంగదీసుకుంటున్న ఘటనలు అనేకం వెలుగుచూశాయి. కొన్ని సందర్బాల్లో ఎంఎంఎస్‌ స్కాండల్స్‌ బాదిత మహిళలు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. ఇటీవల నిర్భయ కేసు నిందితుడు ముకేష్‌ సింగ్‌ బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మహిళల పట్ల నేరగాళ్ల మైండ్‌ సెట్‌ ఎలా ఉంటుందో కళ్లకుకట్టింది. అయినా మహిళల భద్రతకు ఏర్పాటు చేసిన చట్టాల అమలుతీరులో మాత్రం ధోరణి మారటంలేదు. మహిళల పట్ల ప్రభుత్వాధినేతలకున్న బాధ్యత ఎప్పటికఫ్పుడు వివిధ రూపాల్లో బయటపడుతూనే ఉంది. ఆత్మగౌరవ నినాదంతో ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ స్వపరిపాలనలో ఒక్క మహిళ కూడా మంత్రివర్గంలో లేకపోవడం వివక్షకు అద్దంపడుతున్నది. చట్టసభల్లో ఉన్నత పదవుల్లో మహిళల ప్రాతినిథ్యం సంగతి పక్కనపెడితే 67ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో మహిలలకు కనీస రక్షణ కూడా కల్పించలేని స్థితిలో మన యంత్రాంగం ఉండటం సిగ్గుచేటు. ఇంతటి బలమైన వ్యవస్థ ఉన్నా చట్టాల అమలులో కచ్చితంగా వ్యవహరించకపోవడం, మామూళ్ల మత్తులో జోగుతూ నిందితులను చూసీచూడనట్లు వ్యవహరించటం, మీడియాలో సంచలనమైతే తప్ప ఘటనల పట్ల పెద్దగా స్పందించకపోవడం పరిస్థితికి అద్దం పడుతోంది. సాక్షాత్తూ కేంద్ర మంత్రికే ఇంతటి చేదు ఘటన ఎదురైందంటే మన యంత్రాంగం ఎంతటి మత్తులో జోగుతోందో అర్థం చేసుకోవచ్చు. మన నిఘా వ్యవస్థ పనితీరుపై ఇలాంటి ఘటనలు నీలినీడలు కమ్ముతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం మేల్కొని, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని వస్త్ర దుకాణాల్లో తనిఖీలు నిర్వహించి మహిళలను ఆగౌరవపరుస్తున్న వారిని కఠినంగా శిక్షించి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడాల్సిన అవసరముంది. మహిళలకు చట్టసభల్లో కనీస ప్రాతినిధ్యం కల్పించకున్నా వారి జీవితాలను చిద్రంచేసే ఇలాంటి కిలాడీల భరతం పట్టాలి. తనిఖీల్లో చిత్తశుద్ధితో వ్యవహరించి అసాంథిక కార్యకలాపాలకు పాల్పడుతున్నవారిని కఠినంగా శిక్షించాలి. తద్వారా మహిళలపట్ల ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగంపై ఉంది.