ఏపీ మంత్రి రావెల తనయుడిపై నిర్భయ కేసు
హైదరాబాద్,మార్చి5(జనంసాక్షి):ఆంధ్రప్రదేశ్ మంత్రి రావెల కిషోర్‌బాబు తనయుడు సుశీల్‌కు బంజారాహిల్స్ పోలీసులు నోటీసులు జారీచేశారు. మహిళను వేధించిన కేసులో విచారణకు హాజరుకావాలంటూ 41ఏ సీఆర్‌పీసీ కింద నోటీసులిచ్చారు. మంత్రి తనయుడు తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఓ వివాహిత ఆరోపించింది. నడుచుకుంటూ వెళ్తున్న తనపై మంత్రి తనయుడు చేయి పట్టి కారులోకి లాగేందుకు ప్రయత్నించాడని ఆమె తెలిపింది. ఈ ఘటనలో స్థానికులు అతడిని దేహశుద్ధి చేసినట్లు సమాచారం. అయితే తన యజమాని కుమారుడిపై కొందరు దాడి చేశారని కారు డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈఘటనపై బాధితురాలు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతిని వేధించిన కేసులో విచారణకు రావాలని పోలీసులు నోటీసులో కోరారు. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ పదమూడులో అంబేద్కర్ బస్తీలో నివసించే ఒక టీచర్ ను సుశీల్ , అతని డ్రైవర్ అప్పారావు వేధించారని అభియోగంగా ఉంది.స్థానికులు వీరిద్దరిని కొట్టి పోలీసులకు అప్పగించారు. మంత్రి కుమారుడు అని తెలియడంతో అతనిని తప్పించడానికి ప్రయత్నించారని పోలీసులపై ఆరోపణలు వచ్చాయి. కాని అతని పేరును బాధితురాలు చెప్పకపోవడం వల్ల సుశీల్ పేరును ఎప్ ఎఫ్ ఐ ఆర్ లో చేర్చలేదని బంజారాహిల్స్ పోలీసులు చెప్పారు. ఆ తర్వాత బాధితురాలు సుశీల్‌ను గుర్తు పట్టడంతో అతని పేరు కూడా ఎప్‌ఐఆర్ చేర్చామని పోలీసులు చెబుతున్నారు. కాగా సుశీల్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు సమాచారం. అతని ఆచూకీ కోసం మూడు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. మంత్రి రావెల కిషోర్‌బాబు కుమారుడు సుశీల్‌పై పోలీసులు నిర్భయ కేసు నమోదు చేశారు. సుశీల్, అతని డ్రైవర్‌పై ఐపీసీ 354 ప్రకారం బంజారాహిల్స్ పోలీసులు నిర్భయ కేసు నమోదు చేశారు. విచారణకు హాజరుకావాలంటూ సుశీల్‌కు నోటీసులు జారీ చేశారు. అయితే తన తప్పేవిూ లేదని కొంతమంది కావాలనే పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారని సుశీల్ ఫేస్‌బుక్‌లో వివరణ ఇచ్చారు. మరోవైపు పరారీలో ఉన్నవారి కోసం మూడు బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు బంజారాహిల్స్ ఏసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఒక రాష్ట్ర మంత్రి కుమారుడిపై నిర్భయం చట్టం కింద కేసు నమోదు అవడం ఇదే తొలిసారి.
రాజకీయ కుట్ర
ఈవ్‌టీజింగ్ ఘటనపై మంత్రి రావెల కుమారుడు సుశీల్ స్పందించారు. ఇది రాజకీయ ప్రత్యర్థుల కుట్ర అని రావెల సుశీల్ ఆరోపించారు. తనపై రాజకీయ కక్షకు పాల్పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డుపై ఉన్న కుక్కపిల్లను రక్షించేందుకు ప్రయత్నించానని, ఈలోగా ఓ మహిళ వచ్చి తనను తిట్టిందన్నారు. తాను స్పందించేలోపే కొంతమంది గుమిగూడి కొట్టారని ఆయన ఆరోపించారు. ప్రత్యర్థులు పరిస్థితిని అనుకూలంగా మలుచుకున్నారని, నిన్న మధ్యాహ్నమే ఆ ఘటన పరిష్కారమైందని…కొంతమంది కావాలనే పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారని రావెల సుశీల్ ఆరోపించారు.