ఏపీ సెక్రటేరియట్‌ ముట్టడి ఉద్రిక్తం

7

టీ లాయర్ల అరెస్టు

హైదరాబాద్‌,మార్చి4(జనంసాక్షి): హైకోర్టు విభజనపై తెలంగాణ న్యాయవాదుల ఆందోళన ఉధృతం చేశారు. గన్‌పార్క్‌ వద్ద మంగళవారం ధర్నా నిర్వహించిన లాయర్లు బుధవారం ఎపి సచివాలయ ముట్టడికి ప్రయత్నించారు. ఏపీ ప్రభుత్వం తన వైఖరి చెప్పాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ న్యాయవాదులు  ఏపీ సచివాలయాన్ని ముట్టడించేందుకు యత్నించారు. ఇందిరా పార్క్‌ నుంచి ర్యాలీగా బయల్దేరిన లాయర్లను పోలీసులు అడ్డుకున్నారు. సచివాలయం వద్దకు చొచ్చుకొచ్చిన లాయర్లను పోలీసులు అరెస్టు చేశారు. హైకోర్టును విభజించాలని డిమాండ్‌ చేస్తూ గత కొంత కాలం నుంచి న్యాయవాదులు నిరసనలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఎపి ప్రభుత్వం బిజెపితో కుమ్మక్కయి కావాలనే  విభజనను అడ్డుకుంటోందని అన్నారు. లాయర్ల రాకతో కొంత ఉద్రిక్తత నెలకొంది. హైకోర్టు విభజనకు ఏపీ సర్కారు సహకరించడం లేదని ఆరోపించారు. ఉమ్మడి హైకోర్టును వెంటనే విభజించాలని, తెలంగాణ రాష్టాన్రికి ప్రత్యేకంగా న్యాయశాఖను ఏర్పాటు చేసి విడిగా నియామకాలు చేపట్టాలన్న డిమాండ్‌తో చలో సెక్రెటేరియట్‌ పిలుపునిచ్చారు. న్యాయవాదులంతా సచివాలయానికి బయల్దేరడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తెలంగాణ న్యాయవాదులు సచివాలయంలోకి ప్రవేశించకుండా అడ్డుకున్న భద్రతా దళాలు, కొందరిని అరెస్ట్‌ చేశారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా హైకోర్టు ఉమ్మడిగా కొనసాగడం, నియామకాలు చేపట్టడం వల్ల తెలంగాణ న్యాయవాదులు తీవ్రంగా నష్టపోతున్నారని న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేశారు. తర్వాత వీరంతా అక్కడి నుండి ఇందిరా పార్క్‌ చేరుకుని ఆందోళన చేపట్టారు. నియామకాల్లో తెలంగాణకు రావాల్సిన వాటాపై సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్‌ వేసేందుకు సిద్ధమయ్యారు.