ఏప్రిల్‌ 15న దండకారణ్యం బంద్‌కు పిలుపు

1

– బస్తర్‌పై వైమానిక దాడులకు వ్యతిరేకంగా ఉద్యమించండి

-మావోయిస్టు పార్టీ

్ట హైదరాబాద్‌ ఏప్రిల్‌ 4 (జనంసాక్షి):

గత ఆరు నెలలుగా దక్షిణ్‌ బస్తర్‌లోని సుక్‌మా, దంతెవాడ, బీజాపూర్‌ జిల్లాల్లో వాయుసేనకు చెందిన యుద్ధ హెలికాప్టర్‌, ఎంఐ-17 ద్వారా కాల్పులూ, బాంబు దాడుల డ్రిల్స్‌ జరుగుతున్నాయని భారత కమ్యూనిస్టుపార్టీ (మావోయిస్టు) ఆరోపించింది. ఈమేరకు ఆపార్టీ దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్‌ పత్రిక ర్యాలయాలకు   ప్రకటనలను విడుదల చేశారు.  తమ సాయుధ బలగాలపై మావోయిస్టులు దాడి చేసినపుడు గరుడ్‌ కమాండోలు కాల్పులు జరుపుతారని, ఏప్రిల్‌ 1న జరిగిన ఒక పత్రికా సమావేశంలో వాయు సేన, పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారని ఆయన పేర్కోన్నారు.  అంటే ఇప్పుడు ఏ క్షణంలోనైనా, ఎక్కడైనా విమానాలతో కాల్పులు జరపవచ్చన్నారు.  బాంబులు కురిపించవచ్చని . ఇప్పటికే పోరాట ప్రాంతంలో ప్రభుత్వ సాయుధ బలగాలు రోజూ కాల్పులు జరుపుతున్నాయని ఆరోపించారు. మహా అభియాన్‌ల పేరుతో బూటకపు ఎన్‌కౌంటర్లు, ఎన్‌కౌంటర్లు జరుపుతున్నారని  విచక్షణా రహితంగా అరెస్టులకు పాల్పడుతున్నాట్లుగా పేర్కోన్నారు. హెలికాప్టర్లను కేవలం సహాయక చర్యలకే ఉపయోగిస్తామనీ, హెలికాప్టర్లపై మావోయిస్టులు దాడులు చేసినప్పుడు మాత్రమే ఆత్మరక్షణ కోసమే వైమానిక కాల్పులు జరుపుతామని గత అక్టోబర్‌లో పోలీసులు అబద్ధాలు చెప్పారని ఆయన విమర్శించారు. గత ఆరు నెలల్లో హెలికాప్టర్లపై కాల్పులకు పాల్పడిన ఘటన ఒక్కటి కూడా లేదని అయినప్పటికీ ప్రభుత్వం గ్రీన్‌హంట్‌ ఫాసిస్టు నిర్బంధకాండలో భాగంగా వైమానిక దాడులకు సిద్ధమవుతుందన్నారు.  ఆత్మ రక్షణ అనే మాటలు దేశ ప్రజలను పక్కదారులు పట్టించడానికి మాత్రమేనని,  వాయు సేనకు నేరుగా దాడులు చేయడానికి పూర్తి అధికారాలు ఇవ్వబడ్డాయన్నదే అసలు వాస్తవమని వికల్ప్‌ ఆరోపించారు. దండకారణ్యంలో తలపెట్టిన భారీ గనులు, భారీ ఆనకట్టలు, భారీ పరిశ్రమల మూలంగా నిర్వాసితులవుతున్న ప్రజలు చేస్తున్న పోరాటాన్నీ, దానికి నాయకత్వం వహిస్తున్న తమ పార్టీ , పీఎల్‌జీఏ, ప్రజా సంఘాలనూ, పోరు ప్రజానీకాన్నీ వీలయినంత వేగంగా అంతం చేసి ఇక్కడి జల్‌-జంగల్‌-జమీన్‌-వనరులను దేశీయ, విదేశీయ కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెట్టడం కోసమే ఇప్పటికే మోహరించబడిన పదుల వేల పోలీసు, అర్ధసైనిక బలగాలతో పాటు ఇప్పుడు వైమానిక దాడుల నిర్ణయం తీసుకున్నారన్నది ఆయన  స్పష్టంచేశారు. ఇంద్రావతి టైగర్‌ రిజర్వ్‌ ప్రాంతంలో రన్‌వే నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతులివ్వడం వెనుక ఆ నేషనల్‌ పార్కును వైమానిక స్థావరంగా మార్చే రహస్య పథకం దాగి వుందన్నారు.  దండకారణ్య ప్రజల పోరాటం వాళ్లది మాత్రమే కాదని. దేశంలోని పీడిత ప్రజలందరిదని ఆయన అభివర్ణించారు. ఈ పోరాటం భావి తరాల కోసం వనరులను కాపాడేందుకు. పర్యావరణాన్ని కాపాడేందుకు. ఈ భూమినీ, అడవులనూ, నదీనదాలనూ కాపాడేందుకు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై చేస్తున్న అన్యాయ యుద్ధం- ఆపరేషన్‌ గ్రీన్‌హంట్‌ కేవలం కార్పొరేట్‌ సంస్థల లాభాల కోసం మాత్రమే. దేశ పేద ఆదివాసీ ప్రజానీకంపై విమానాలతో తూటాలూ, బాంబులు కురిపించడానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టవల్సిందిగా పిలుపునిచ్చారు.  విదేశీ దాడులను, దురాక్రమణ యుద్ధాలను ఎదుర్కోవడం కోసం ఏర్పడిన వైమానిక సేనను దేశం నడి బొడ్డున, దేశ ప్రజలపై ప్రయోగించడానికి వ్యతిరేకంగా ఉద్యమించాల్సిందిగా, దేశంలోని ప్రాచీన ఆదివాసీ తెగల అస్తిత్వాన్ని రూపుమాపే ప్రభుత్వ కుట్రలను విఫలం చేయవల్సిందిగా దేశ, విదేశీ పీడిత ప్రజలకూ, విప్లవ పార్టీలకూ, ప్రజాస్వామిక-ప్రగతిశీల శక్తులకూ, కార్మిక సంఘాలకూ, మానవ హక్కుల సంఘాలకూ, రచయితలకూ, కళాకారులకూ, చరిత్రకారులకూ, చలన చిత్రకారులకూ, లాయర్లకూ, విద్యార్థులకూ, దృశ్య-శ్రవణ-పఠన మాధ్యమాలకు, ఆదివాసీ-ఆదివాసేతర సామాజిక సంఘాలకు ఆయన  విజ్ఞప్తి చేశారు.

బస్తర్‌పై తలపెట్టిన వైమానిక దాడులకు వ్యతిరేకంగా ఏప్రిల్‌ 15న దండకారణ్య (ఛత్తీస్‌గఢ్‌-మహారాష్ట్ర) బంద్‌ను విజయవంతం చేయాల్సిందిగా ఛత్తీస్‌గఢ్‌-మహారాష్ట్ర ప్రజలకు  పిలుపునిచ్చింది కాగా  విద్యా, వైద్య సంస్థలకు బంద్‌ నుండి మినహాయింపు వుందన్నారు.