ఐదోసారి బీహార్ సీఎంగా నితీష్ ప్రమాణం
పాట్నా,,నవంబర్20(జనంసాక్షి):
బిహార్ ముఖ్యమంత్రిగా నితీష్‌కుమార్ ఐదోసారి ప్రమాణస్వీకారం చేశారు. పాట్నాలోని గాంధీ మైదాన్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో నితీశ్ సహా పలువురు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ వీరిచేత ప్రమాణం చేయించారు. బిహార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం నితీశ్‌కిది ఐదోసారి కావడం విశేషం. ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ కుమారులు తేజస్వి యాదవ్, తేజ్‌ప్రతాప్ యాదవ్‌లు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. వీరిలో తేజస్వి యాదవ్‌కు ఉపముఖ్యమంత్రి పదవి కట్టబెట్టనున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి పలువురు కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. నితీశ్ కుమార్ 2000 మార్చి 3వ తేదీ నుంచి మార్చి 10వ తేదీ వరకు కేవలం ఏడు రోజుల పాటు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు. తర్వాత తిరిగి రబ్రీదేవి అధికారంలోకి వచ్చారు. 2005 నవంబరు 24 నుంచి 2010 నవంబరు 24 వరకు అయిదేళ్లు నితీశ్‌కుమార్ బిహార్ ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు. 2010 ఎన్నికల్లోనూ నితీశ్ గెలుపొందడంతో 2010 నవంబరు 26 నుంచి 2014 మే 17 వరకు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. 2014 సాధారణ ఎన్నికల్లో బిహార్ లోక్‌సభ సీట్లలో సింహభాగాన్ని బిజెపి గెల్చుకుంది. దీంతో రాష్ట్రంలో జేడీ(యూ) ఓటమికి బాధ్యత వహిస్తూ 2014లో బిహార్ సీఎం పదవికి నితీశ్ రాజీనామా చేశారు. జితన్‌రామ్ మాంఝీని ముఖ్యమంత్రి పీఠం ఎక్కించారు. అనంతరం వచ్చిన వివాదంతో ఆయనను దింపేసి తిరిగి సీఎం బాధ్యతలు స్వీకరించారు. దాదాపు పదేళ్లు బిహార్‌ను పాలించిన నితీశ్ కుమార్ 2015 బిహార్ అసెంబ్లీ ఎన్నికల విజయంతో వరుసగా మూడు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొంది హ్యాట్రిక్ కొట్టారు. నితీశ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అతిరథ మహారథులు హాజరుకాగా, దాదాపు 2 లక్షల మంది ప్రజలు వచ్చారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని దేవేగౌడ, పలువురు ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు విచ్చేశారు. మమత బెనర్జీ, కేజ్రీవాల్, సిపిఐ నాయకుడు రాజా తదితరులు హాజరయ్యారు. 243 స్థానాలు ఉన్న బిహార్ అసెంబ్లీలో ఆర్జేడీ, జేడీ(యూ), కాంగ్రెస్ పార్టీల మహాకూటమి 178 అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్న విషయం విదితమే. జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీల ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు.