గ్రామపంచాయతీ ఎన్నికలపై తీర్పు రిజర్వు

` హైకోర్టును నెల గడువు కోరిన ప్రభుత్వం
` నిర్వహణకు 60రోజుల సమయం కావాలన్న ఈసీ
హైదరాబాద్‌(జనంసాక్షి):ఎన్నికలు నిర్వహించడానికి మరో 60 రోజులు సమయం కావాలని ఎలక్షన్‌ కమిషన్‌ హైకోర్టును కోరింది. స్థానిక సంస్థల ఎన్నికల పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు సోమవారం విచారణ చేసింది. ఆరు నెలల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల కేసు విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున న్యాయవాదులు తమ వాదనలను కోర్టుకు వివరించారు. ఎన్ని రోజుల్లో ప్రభుత్వం ఈ ఎన్నికలు నిర్వహిస్తుందో చెప్పాలని హైకోర్టు పిటీషనర్లను ప్రశ్నించింది. గత ఫిబ్రవరిలోనే ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం హావిూ ఇచ్చిందని.. ఎందుకు ఎన్నికలు నిర్వహించలేదని న్యాయస్థానం నిలదీసింది. తెలంగాణ రాష్ట్రంలో కులగణన సర్వే పూర్తి అవ్వలేదని కొంత సమయం కావాలని కోర్టుని ప్రభుత్వం కోరింది. ఎన్నికలు నిర్వహించడానికి మరో 60 రోజులు సమయం కావాలని ఎలక్షన్‌ కమిషన్‌ అడిగింది. ఎన్నికలైనా పెట్టాలని లేదా పాత సర్పంచ్‌లనే కొనసాగించాలని పిటీషనర్లు వాదనలు వినిపించారు. ఆరు నెలల్లో ఎన్నికలు పూర్తి చేయాలని నిబంధన ఉందని.. కానీ ప్రభుత్వం ఈ ఎన్నికలు నిర్వహించలేదని పిటీషనర్లు వాదనలు వినిపించారు. కాగా 2024 ఫిబ్రవరి 1వ తేదీన తెలంగాణ సర్పంచ్‌ల పదవీకాలం ముగిసింది. స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వ్‌ చేసింది. పిటిషనర్లు, ప్రభుత్వం, రాష్ట్ర ఎలక్షన్‌ కమిషన్‌ వాదనలు విన్న తర్వాత న్యాయస్థానం ఈ తీర్పు ఇచ్చింది. ఎన్నికలు నిర్వహణకు సమయం కావాలని ప్రభుత్వం కోరడంతో తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వ్‌ చేసింది.

 

‘కంచగచ్చిబౌలి’పై తీర్పు 3 వారాలకు వాయిదా
` దీనిపై సుప్రీంలో విచారణ ఉండటంతో 3 వారాలకు వాయిదా వేసిన హైకోర్టు
హైదరాబాద్‌(జనంసాక్షి):కంచ గచ్చిబౌలి భూములపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణను సీజే ధర్మాసనం 3 వారాలకు వాయిదా వేసింది.కంచ గచ్చిబౌలి భూములను గతంలో టీజీఐఐసీకి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. భూమిని అభివృద్ధి చేసి ఐటీ కంపెనీలకు కేటాయించేలా టీజీఐఐసీ ప్రణాళికను సిద్ధం చేసింది. ఈక్రమంలో భూములను జేసీబీలతో చదును చేసింది. దీన్ని అడ్డుకోవాలంటూ హైకోర్టులో వేర్వేరుగా 4 ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి.వాదనల సందర్భంగా.. టీజీఐఐసీకి భూమిని అప్పగిస్తూ జారీ చేసిన జీవోను రద్దు చేయాలని పిటిషనర్లు కోరారు. సుప్రీంకోర్టులో దీనిపై విచారణ ఉండటంతో.. హైకోర్టు 3 వారాలకు వాయిదా వేసింది.

 

తాజావార్తలు